బహుమతి


బొమ్మలతో ఆడుకున్న రోజులనుండి కనపడక, వినపడక, ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకుంటూ అదో రకం బొమ్మల్లా మారిపోవటం ఓ నాణేనికి బొమ్మా బొరుసా అటూ ఇటూ లాగా జీవితం ఇదిగో ఇదంతా కొద్దిగా ఇట్ అటూ అంతే అంటూ అసలు బొమ్మ చూపిస్తూ ఉంది ఈ మధ్య. దానికి తోడు ఈ గోడల నిండా బొమ్మలెందుకో. గాలిలోకి ఎగురవేసి గాలిపటాలు అంటూ ఆడుకున్న రోజులవి. ఈ రోజు గోడ మీద గాలికి కదులుతూ విన్యాసం చేసే పటాలు…ఇంతోటి జీవితం ఎందుకో వెక్కిరిస్తుంది. కొంతమంది ఎందుకో అప్పుడప్పుడు జీవితకాలం అంటూ ఉంటారు…అదేదో ఎందరినో ఉతికి ఆరేసినట్లు!

ఈ మధ్య మనుమరాలు క్రందింటిలోంచి పైకి వచ్చేసి ఏదో తన సోఫా అని నిర్దేశించినట్లు అందులో కూర్చుని వాళ్ల బామ్మని పట్టుకుని ఇక్కడున్న బొమ్మలన్నీ క్రిందికి దింపించుకుని ఒక్కొక్క దానితో ఆడుకుని మధ్యలో నాకు కూడా ఒక్కొక్కటీ చూపిస్తూ ఉంటుంది.  మాటలు ఇంకా పూర్తిగా రాలేదు దానికి. అలా టైం పాస్ చేస్తూ ఓ గంట సేపు ఆడుకుని వెళ్లిపోతుంది. చక్కగా ‘బై ‘ అని చెబుతుంది.ఈవిడగారు ఆ బొమ్మలన్నింటినీ తిరిగి చక్కగా షోకేస్ లో పెడుతూ ఉంటుంది.

పేకాటలో షో లాగా ఈ షోకేస్ లో ఎందుకో ఈ బొమ్మలు.ఒక్కో క్షణం ఒక్కో కేసులాగా ఒక్కోదానికి, గడచిన దానికి ఒక షో! నాకిది చేతైంది అని చెప్పే ఒక షో! ఎవరికో ఇది నచ్చిదని మరో షో! ఎందుకో ఎవరో మెచ్చుకున్నారని మరో షో! కప్పులు, షీల్డులు, సన్మాన పత్రాలు, దండలు, అండలు…అన్నీ ఎందుకో అలా అద్దాల వెనుక వద్దన్నా దాక్కున్నాయి. ఎందుకో దృష్టి అటు పడింది ఈ రోజు. నిజానికి నాకు షీల్డులు, కప్పులు తక్కువ. పుస్తకాలు, సర్టిఫికెట్లు ఎక్కువ.ఏవో మెడల్సు అరిగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటాయి. పుస్తకాలు ఎందుకో నాలాగ చిన్నప్పిటి నుంచీ సిగ్గుపడ్తున్నట్లు లోపల అల్మీరాలలో దాక్కునుంటాయి.కొన్ని తెల్ల కాగితాలు, కొన్ని కలం తొక్కిన కాగితాలు, కొన్ని ముద్రణలోకి వెళ్లి కదం తొక్కిన కాగితాలు…ఊహల లాహిరిలో విహరించిన కొన్న్ని కాగితం పడవలు…అన్నీ ఙ్ఞానప్లవములేనేమో!

ఇక పోతే ఈ హాల్లో ఉన్న ఈ అందమైన షోకేసులో అందంగా అమర్చిన ఙ్ఞాపికలు, బహుమతులు ఎందుకో సిగ్గు పడుతున్న ముసలి పెళ్లికూతుళ్లలా ఉన్నాయి. సారీ షాపుల షో కేసులో అందమైన బొమ్మల్లా అయితే లేవు. గతం లోని ఊహలను వలువలుగా చుట్టుకుని సవాలు చేస్తున్నాయి. మనం ఎలా ఉన్నా ఇవన్నీ పెళ్లికూతుళ్లే! 

ఎలా పొందినా ఫరవాలేదు- ఆత్మానందం అనుభవించే ప్రతివాడూ పెళ్లికొడుకే! ఈ బహుమతుల వెనుక ఓ అద్భుతమైన కప్పు ఒకటుంది. చిన్నప్పుడు వ్యాస రచన పోటీలో నాకిచ్చిన కప్పు.అది ఎందుకు అద్భుతం అంటే పేర్లు తారుమారయి తొలుత అది నాకు ఇవ్వలేదు. మరో కుర్రాడికి ఇచ్చారు.నేను చిన్నబుచ్చుకుని దాదాపు ఏడ్చినంత పని చేసాను. ఆ కుర్రాడు స్టేజ్ మీదకెళ్లి దానిని స్వీకరించి మామూలుగా దిగిపోయాడు. అది దేనికిచ్చారో కూడా వాడికి తెలియదు. మిగతా కుర్రాళ్లు వాడిని ఆట పట్టించారు.మర్నాడు మా క్లాస్ టీచర్ నన్ను పిలిచి లిస్ట్ చూపించి , ‘ఇదిగో నీ పేరు తప్పుగా చదివారు ‘, అని చెప్పి ఆ కుర్రాడిని నాకు దానిని వెనక్కి ఇవ్వమని చెప్పింది. అదేమి చిత్రమో అతను ఏమీ అనుకోలేదు.బ్రేక్ లో నాతో అన్నాడు, ‘రేయ్, సాయంత్రం ఇంటికి రారా. తీసుకుని వెళుదువుగాని. చాకెట్లు కూడా ఇస్తాను.’చక్కగా ముస్తాబయి వాళ్ల ఇంటికి వెళ్లాను.ఆ రోజుల్లోనే వాళ్ల ఇంట్లో ఒక కారు, ఒక ఆఫీసు జీపు ఉండేవి.అంటినీ మించి ఒక భయంకరమైన కుక్క ఉండేది. గేటు దగ్గర ఆగిపోయాను.శ్రీపాల్ (ఈ కుర్రాడు…నా పేరుకు చాలా దగ్గరది) దానిని పట్టుకుని గేటు తెరిచాడు. లోపలికి వెళ్లాను.ఎంత అందమైన ఇల్లో అది.అతను చదువుకునే గది, ఆడుకునే లాన్, అన్నీ చూపించాడు.ఆంటీ నవ్వుతూ వచ్చి ఎంతో ఆదరంగా హాల్లో కూర్చోపెట్టి కొన్ని కొత్త కామిక్స్ (ఆ రోజుల్లో మాకవి ఎంతో క్రేజ్) ఇచ్చి ఇంట్లో తయారు చేసిన చాక్లెట్లు టీ పాయ్ మీద పెట్టింది. ఎందుకో భయం. షోకేస్ లోంచి శ్రీపాల్ ఆ కప్ తీసి నాకిచ్చాడు. ‘నా అదృష్టం రా…’,అన్నాడు,’…రెండు రోజులు నా దగ్గరుంది. ఇదిగో. అయాం సారీ ‘.

అది తీసుకుని దాని మీద వ్రాసినవి చదువుతుండగా అంకుల్ వచ్చారు. ‘హలో మై బాయ్ ‘, అని చేతులు కలిపితే ఏం చేయాలో అర్థం కాలేదు.

‘ఎన్ని ప్రైజులు తిసుకుంటూ ఉంటావు?’, అడిగారు.

శ్రీపాల్ చెప్పాడు, ‘డాడీ, ఇతనికి ఏటా కనీసం అయిదు ప్రైజులంటాయి. వీడు స్టేజ్ ఎక్కాడంటే ఏదో ఒకటి చేస్తాడు. ఇతని వల్ల మొదటి సారి నేను స్తేఝ్ ఎక్కాను. కాళ్లు వొణికాయి తెలుసా?’

ఆయన నవ్వారు. ‘మనమెందుకు పనికొస్తాం ‘, అంటారేమో అనుకున్నాను. ఆయన ఏమీ అనలేదు.నవ్వెసి లోపలికెళ్లిపోయారు.నాకు ఏమైందో తెలియదు. వాళ్లు ఎంత వద్దంటున్నా దాన్ని వాళ్లషోకేసులోనే పెట్టి ‘ఇది నా బహుమతి ‘ ,అని చెప్పి వచ్చేసాను. కానీ వాళ్లు ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతున్నప్పుడు మా ఇంటికి ‘టీ ‘ కని వచ్చారు.అంకుల్ ఆ కప్పు నాకు తిరిగి ఇచ్చేసారు. దానిని అలాగే పట్టుకుని గేటు దాకా వచ్చాను. శ్రీపాల్ జీపు ఎక్కుతూ అన్నాడు…’రేయ్, మళ్లీ కలుసుకుంటామో లేదో తెలియదు. నేను చెబుతున్నానురా! నిన్ను…అంటే నీ పేరు చాలా మందికి తెలుస్తుంది. అప్పుడు నేను చాలా మందికి చెబుతాను, నా మిత్రుడు అని. అంతే కాదు, అతను గెలుచుకున్నది నా దగ్గర కొంత కాలం ఉందనీ…’

ఆ జీపు అలా వెళ్లిపోవటం ఇప్పటికీ గుర్తు. నా పేరు ఎందరికి తెలుసో నాకెందుకు ఈ రోజు? ఒక శ్రీపాల్ లాంటి వాడు జీవితానికి ఒక్కడు చాలు!      

ఆ కప్పుని కప్పుకున్న మెమెంటో ఒకటి…మరో వింత అది. కాలేజీలో ఉత్తమ రచయిత అవార్డు మా నాటికకు దక్కింది. అదో పెద్ద కామెడీ. గిట్టని వాళ్లు సరైన సమయానికి కరెంటు సప్లై తీయించేసాడు. చీకటైపోయింది. అది పతాక సన్నివేశం. కానీ హాలు బయట కూడా చీకటి కమ్ముకుని ఉరుములూ మెరుపులూ వచ్చాయి. ఆ ఉరుముల శబ్దంలో, మెరుపుల మధ్య మానటీ నటులు ఏం చేసారో వాళ్లకే తెలియదు. అక్కడ టీపాయ్ మీదున్న లిక్కర్ గ్లాసు పొరపాటుగా మా హీరోయిన్ మంచి నీల్ల గ్లాసనుకుని తాగేసింది. అదే సమయానికి ఓ పెద్ద ఉరుము బయటనుండి వినిపించింది!మాకు మొదటి బహుమతి ఇచ్చారు న్యాయ నిర్ణేతలు. నా భుజం తట్టి ‘భలే ప్రయోగం చేసావయ్యా…’,అన్నారు,’…ఆఖరుకు అమ్మాయి ఏమీ చేయలేని పరిస్థితిలో అందరి ముందూ మందు తాగేసింది చూడు? గొప్ప ఆలోచన అది! అవునూ, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎలా తెచ్చారయ్యా? గ్రేట్!’ నాకు జీవితంలో మొదటి సారి పెద్ద కిక్కే వచ్చింది…

దాని ప్రక్కన జాతీయ అవార్డులలో ఒకటి. తొమ్మిది మంది కొత్త నటులతో ఆడిన ‘వీధి నాటకం’ అది. అందరూ కుర్తా పైజమాలలో ఉంటాం. సంగీత ప్రధానంగా సాగిపోతుంది ఆ నాటకం. కొత్తడ్జిల్లీలో గాంధీజీ, సరోజినీ నాయుడూ…ఇలా కొంత మంది నాయకుల రాతి విగ్రహాలు వరుసగా ఒక చోట ఉంటాయి. వాటి ముందర ఒక సేనాని కొద్దిగా ముందరకి వంగి గాంధీ గారి వైపు చేయి చూపిస్తూ ఉంటాడు. ఆ పాత్రకి మా దగ్గర ఒక కొత్త కుర్రాడు (కొద్దిగా బొద్దిగా, బుధ్ధిగా ఉంటాడు) వచ్చాడు. స్టేజ్ మీద ఆ దృశ్యం స్టిల్- ఫ్రీజ్ షాట్ చెయ్యాలి. ఆ షాట్ కి హాల్లో చప్పట్లు మ్రోగాయి. కాని అసలు స్టేజ్ మీద మరొకటి జరిగింది. నేను ఇటు చివర నిలబడి ఉంటాను. అతను ముందరకెళ్లి కూర్చుని చేయి అటు చూపిస్తాడు. అంతా క్షణంలో జరుగుతుంది. అతను అలా చేయగానే పాపం ఆ పజామా పర్రుమని చిరిగిపోయింది! అతను నవ్వుతూనే చేయి అటు చూపించాడు.ఆ కొద్ది సేపూ అతి కష్టం మీద నవ్వు ఆపుకున్నాను. నాటకం అయిపోయాక అందరం వెళ్లి స్టేజ్ వెనుక లాన్ లో పదుకున్నాం. ఇన్నాళ్లూ పడ్డ హింస, రిహర్సల్స్ అలసటకు హమ్మయ్య అనుకున్నాం. ఇంతలో మైకులో అనౌన్స్మెంట్ చేసే ఆవిడ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మళ్లీ రమ్మంది. కొంప దీసి మళ్లీ వెయ్యమంటారా అనుకున్నం. న్యాయనిర్ణేతలు ఒక్కొక్కళ్ల పరిచయం అడుగుతున్నారు అని చెప్పింది. ఈ కుర్రాడిని ముందరకి తోసారు అందరూ! ‘నీ పేరు చెప్పినప్పుడు నిన్ను అటూ ఇటూ తిరిగి చెప్పమంటారు…’,అన్నాడుఒకడు!

దానికి ప్రక్కన కొన్ని కళా సమితి అవార్డులు,న్యాయనిర్ణేతగా వెళ్లినందుకు మెమెంటోలూ…ఇలా ఎన్నో. ఆ మధ్య ఓ వింత జరిగింది. మా ఆఫీసులో మామూలుగా ఎవరైనా పదవీ విరమణ చేస్తే ఓ కార్యక్రమం జరిపి వీడ్కోలు చెబుతాం. కానీఒక సారి ఓ పెద్దావిడ ఆ కార్యక్రమం అయిపోయాక అందరూ వెళ్లిపోయిన తరువాత నాకో ఙ్ఞాపిక ఇచ్చారు.

‘ఏంటండీ?వద్దా?మీకు నచ్చలేదా?’అన్నాను.

‘అయ్యో అది కాదండీ. ఇది నా గుర్తుగా మీకిస్తున్నాను.మీరు నా గురించి ఎన్నో చెప్పారు ఈ రోజు.మా ఇంట్లో ఈ గుర్తులన్నీ అలా ఉండిపోతాయి. కానీ మీ ఇంట్లో నా గుర్తుగా  మీ షోకేసులో ఇది ఉండాలని!’ ఆవిడని ఆవిడ పేరుతో కాకుండా మరో పేరుతో పిలిచేవాడిని. ఆవిడ ఆ ఙ్ఞాపిక క్రింద ఆ పేరే వ్రాయించింది!

నిజానికి ఈ షోకేసులు ఎంతో ఇబ్బందికి గురి చేస్తాయి. ఏదో సాధించేసామనే ఒక అహం ఆ అద్దాల వెనుక ఓ మేడ కట్టుకుని గొప్పగా విర్రవీగుతూ ఉంటుంది!

డాష్ బోర్డు మీదనుండి నీటిలోకి సరిగ్గా దూకాలంటే నీటిలోని మన ప్రతిబంబం లోకి పూర్తిగా కలిసిపోవాలి. ఇతర వస్తువులూ, సాధించినవి, శోధించినవి, నేను ఫలానా అనిపించినవి అన్నీ మాయమైపోవాలి. ఇమేజ్ కూడా కరగిపోవాలి. ఈ అద్దం వెనుక షో ముగిసి తెర పడిపోవాలి!

కానీ అప్పుడప్పుడు అనిపిసితూ ఉంటుంది. కళలు గలవారు, కలల్లోకి వచ్చేవారు పెద్దగా కలకాలం ఏదీ సృష్టించలేరు.అలా రిటైరయిపోయిన ఆవిడలా ఆలోచన వచ్చినప్పుడల్లా అలజడి చేసే వారు కేవలం మామూలు మనుషులే!

ఏ మాయలూ లేకుండా మామూలు మనిషిగా అలా మాయమైపోవాలంటే ఎందుకో అందరికీ ఓ బాధ, ఓ ఇబ్బంది. ఓ షో! ఓ కేసు…

                                                ~~~***~~~

ఈ చిన్నారి మరల వచ్చి సోఫాలో కూర్చుంది. బొమ్మలన్నీ మరల క్రిందికి దింపుకుంది. నేను మామూలు మనిషిని కాను అని చెప్పేందుకు కాదు కానీ ఎప్పుడో ‘కలంకారీ ‘ చేసాను అని ఇక్కడున్న వారికి గుర్తు చేయాలనీ కాదు, అలా కాలంతో పాటు కలం కలుపుతూ, కదుపుతూ ఓ మూల కూర్చున్న నాకు ఒక్కొక్క బొమ్మా చూపిస్తూ నేను ‘ఆడుకో ‘ అనే వరకూ అలాగే బొమ్మలా ఉండిపోతూ తిరిగి చక్కగా నవ్వుతూ ఆడుకుంటుంది. ఓ గంట గడిపిన తరువాత అంతా నిశ్శబ్దం. మనుమరాలు బామ్మతో కలసి ఎదురుగా వచ్చి నిలబడింది.

‘ఏం కావాలి?’, అడిగాను.

మా ఆవిడ షో కేస్ పైకి చూపించింది.

‘అదుగో, అది కావాలిట.’

అటు చూసాను. అది చాలా పెద్ద ఙ్ఞాపిక. దేశంలోని ఎన్నో భాషలలో అనువందింపబడి ప్రదర్శింపబడిన నాటకాన్ని గుర్తు చేస్తుంది. మధ్యలో సరస్వతీదేవి బొమ్మ! అంత పెద్దది ఈ పిల్లకెందుకు?నవ్వొచ్చింది.అమ్మల్ని చూసాను. రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని సీరియస్ గా చూస్తోంది. ఈవిడ నవ్వు దాచుకుంటోంది.

‘అది ఆడుకునేది కాదమ్మా…’,అన్నాను,’…పైగా చాలా పెద్దది.వేరే బొమ్మ తీసుకో ‘,అన్నాను.

పెద్దమనిషి లా తల అర్థమైనట్లు ఊపింది.’బై ‘ అని చెప్పి వెళ్లిపోయింది.

మరల మర్నాడు ఇదే తంతు. ఓ గంట ఆడుకుని బొమ్మలన్నీ సద్దేసారు.

‘ఏవండీ! అది కావాలిట. దీని కన్ను పడింది. ఇక వదలదు.’

అమ్మలు వైపు చూసాను. రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని రెండో సారి పెట్టుకున్న అర్జీ ఏమవుతుందా అని చూస్తోంది. ఇదేంటి? దీనితో ఎలా ఆడుతుంది? ఏదో పాపం సరదా పడుతోంది. పోనీ ఇచ్చేస్తే?

‘అమ్మలూ! అది చిన్న పిల్లలకి కాదమ్మా! అలాంటిది ఇంకొకటి ఇస్తాలే ‘,అన్నాను.

వెంటనే తల ఏదో అర్థమైనట్లు ఊపి నేను రేపు రాకపోతానా, నిన్ను అడగకపోతానా అన్నట్లు ‘బై ‘ అని చెప్పి వెళ్లిపోయింది.

ఇది తనకి దొరకదు అని తెలిసి కూడా ఎందుకిలా అడుగుతోందో అర్థం కాలేదు. పిల్లలంతే అనుకునాను.

మరల నిన్న వచ్చి బొమ్మలన్నీ దింపించి చక్కగా ఆడుకుంది. నేను నా లోకంలో ఉన్నాను. ఓ గంట తరువాత అన్నీ సద్దేసాక తిరిగి అదే సీను! ఈవిడ ఒకటే నవ్వు! పిల్లని చూస్తే అదే భంగిమ.రెండు చిట్టి చేతులూ నడుము మీద పెట్టుకునుంది. సీరియస్ గా చూస్తోంది.

ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

‘యస్?’, అన్నాను. అమ్మలు నాకేదీ చూఒఇంచదు. ఈవిడ చెప్పాలన్నమాట!

‘ఏముంది? మళ్లీ అదే! అది కావాలిట!’

‘అవునూ! అంత పట్టుదల ఉంటే మారాం చేయకుండా ఆల్ రైట్ అని ఒప్పుకుని వెళ్లిపోతోంది కదా? ఈ స్కీం నాకు అర్థం కావటం లేదు. అంటే ఏదో రోజు నాకు మూడ్ వస్తుందనా?’

‘అలాగే ఉంది వ్యవహారం.’

అమ్మల్ని చూస్తే ఏ స్పందనా లేదు. సమాధానం కోసం ఎదురు చూస్తోంది.

నాకు నవ్వొచ్చింది. పిల్లలు ఈ మధ్య చాలా చురుకుగా ఉన్నారన్నది నిజమే. కానీ ఇదేదో పెద్ద వాళ్ల వ్యవహారంలా ఉంది. మా ఇద్దరినీ తేరిపారి చూస్తోంది!

‘పోనీ జాగ్రత్తగా దింపి కూడా తీసుకుని వెళ్లి క్రింద ఇయ్యి.’,అన్నాను. ఈవిడ అనుమానంగానే చూసింది.

‘ఇవ్వమంటారా?’

‘ఫరవాలేదు. ఏదైనా సమస్య ఉంటే తరువాత చూద్దాం.’

అది క్రిందికి దిగుతుంటే ఈ పిల్ల దానిని చూసిన తీరు గంగ అవతరిస్తుంటే శివుడు పైకి చూసినట్లుంది. ఆ చేతులు నడుము మీదనే ఉన్నాయి. చిట్టి చేతులలోకి తీసుకుని మురిసిపోయింది.

ఈ సారి ఏదో రహస్యం చెప్పినట్లు ‘బై ‘ అంది. ఇద్దరూ వెళ్లిపోయారు.

                                                ~~~***~~~

మధ్యాహ్నం పూట ఓ చక్కని కునుకూ, తరువాత చిక్కని కాఫీ, వేయించిన జీడి పప్పు, వేడి మిర్చీ బజ్జీ వంటివి అసలు జీవితపు షో కేసులో నింపికోవలసిన జీవితసత్యాలు. అసలు మనం మరొకరికి గుర్తుకు రావాలంటే వాళ్లు ఇవి ఆస్వాదిస్తున్నప్పుడు తక్కున మనకు వీడియో చూపించి ‘సార్, మీరే గుర్తుకొస్తున్నారు…’,అనాలి. న్యాయం పట్టి పిండితే చరిత్ర అలా వ్రాయబడుతుంది. పైగా ఈ వయసు మామూలుగా మీద పడదు. బాగా చిన్నప్పుడు మనల్ని పట్టించుకోకపోతే అల్లరి చేసి నేనున్నాను అని అనిపించుకున్నాం. యువత రక్తం పొంగుతున్నప్పుడు నేనే ఉన్నాను అనీ చెప్పాం! మరి వయసు మీద పడ్డప్పుడు మెల్లగా కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసేసి నేనూ ఉన్నాను అంటున్నాను! కాకపోతే ఈ వయసు మామూలుగా మీద పడలేదండీ! రైల్లోకి ఎక్కి కూర్చున్నాక ఎవరో కుర్రాడు మొబైల్ లో మాట్లాడుకుంటూ వచ్చి నెత్తి మీద బర్త్ మీద సూట్ కేసు సూటిగా పెట్టేసి మాట్లాడుకుంటూ ఎటో వెళ్లిపోతాడు. బండీ ఒక్క జర్క్ తో కదలగానే ఆ సూట్ కేసు తల మీదకి మిసైల్ మాదిరి పడి ఊర్కుంటుంది. ఇలాంటప్పుడు మంచి సినీ దర్శకుడు ఇది చూపించి అంతా చీకటి చేసేస్తాడు. అక్కడ టైటిల్స్ ఇచ్చేస్తాడు. అయితే ‘వయసు పిలిచింది ‘ బదులు ‘వయసు మీద పడింది ‘ అనే కార్డు చక్కగా ఏ నేపథ్య సంగీతం లేకుండా అలా క్రింది నించి పైకి వచ్చేస్తుంది. (ఇక ఏ సంగీతమూ వినపడదు కాబట్టి).

హాల్లోంచి అమ్మలు గొంతు వినిపించి లేచి అటు వెళ్లాను. ఈ రోజు ఆ బొమ్మలేవీ లేవు. ఏవై ఉంటుందా అని దగ్గరగా వెళ్లాను. నిన్న తీసుకుని వెళ్లిన ఙ్ఞాపిక ఒక్కటీ టీపాయ్ మీద ఉంది. అమ్మలు ఏవో గీతలు గీస్తూ ఆ పనిలో మునిగిపోయి ఉంది. నన్ను గమనించి వెంటనే లేచి ఆ కాగితం చూపించింది. ఈ చిట్టి వేళ్లలో గట్టి కళ ఉంది. ఇందులోని సరస్వతిని బొమ్మలా గీయాలనుకుంటోంది. ఆశ్చర్యం వేసింది.

మా ఆవిడ అంటోంది,’దీనిని అడుగుతోంది ఆడుకునేందుకు కాదుటండీ!ఈ మధ్య బొమ్మలు వేస్తోందట! చూసింది చూసినట్లు దింపేస్తోంది. దానికి చెప్పటం చేత కావటం లేదు. పిల్ల ఒక్క రోజుకని అడుగుతోంది రోజూ!’

అందులోని సరస్వతి తల్లినీ, రెండు చేతులూ నడుము మీద పెట్టుకుని నన్ను చిత్రంగా చూస్తున్న తల్లినీ చూసాను…

ఎన్ని భాషలలోనో ఒక ఆలోచన చెప్పి ఉండవచ్చు. ఈ భాషకు మరో పరిభాష వద్దనిపించింది!

ఈ’బహు ‘ మతికి అసలు బహుమతి లభించింది!

                                                                ~~~***~~~  

~వేదాంతం శ్రీపతిశర్మ   

   

TataCliq [CPS] IN Lenovo India [CPS] IN

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: