చంద్రయోగములు…(తరువాయి భాగం)


‘అలా చెప్పండి సార్.మొత్తానికి చంద్రుడంటారు!’
‘కరెక్ట్!అసలు మామూలుగానే చంద్రుని బట్టి యోగాలు చాలా ముఖ్యమైనవి.దైనందిన జీవితంలో జరిగేవన్నీ గోచారం-అంటే చంద్రుని బట్టే కనిపిస్తాయి.చాంద్రమానమైనా,బార్హస్పత్యమానమైనా, సౌరమానమైనా తిథులలో తేడా ఉండదు కాబట్టి,పంచాంగాలలో యోగ నిర్ణయం (నక్షత్ర పరిమాణంలో చంద్రుడు కలసి ఉన్న కాలం యోగం అనబడుతుంది)సమంగానే జరుగుతుంది కాబట్టి చంద్రుని బట్టి యోగాలు చాలా సూటిగా, దీటుగా ఉంటాయి.
యోగాలలోకి వద్దాం.సామాన్యంగా జాతకాలను పరిశీలిస్తే రవి నుండి చంద్రుడు 1,4,7,10 స్థానాలందున్నప్పుడు ధనం,బుధ్ధి,నైపుణ్యం తక్కువగాను,2,5,8,11 స్థానాలందున్నప్పుడు మధ్యమంగానూ,3,6,9,12 లో ఉన్నప్పుడు ఉత్తమం గానూ ఉంటాయన్నది శాస్త్రం.ఇది భావ నిర్ణయం.ఇది కాక యోగాల దగ్గరకి వెళ్లినప్పుడు ధనాధన యోగముల గురించి చూద్దాం. పగటి వేళ జన్మించినప్పుడు చంద్రుడు స్వాంశ యందున్నా,అధిమిత్రాంశ యందున్నా,గురునిచే చూడబడినా,జాతకుడు ధనసుఖము కలవాడై ఉంటాడు.రాత్రి యందు జన్మించినప్పుడు శుక్రునిచే చూడబడిన, జాతకుడు సుఖవంతుడు,ధనవంతుడు అవుతాడు.దీనికి వేరుగ ఉండి గురు శుక్ర దృష్టి లేకపోతే అల్పధనుడో లేక నిర్ధనుడో కాగలడు.
అధియోగము చాలా ముఖ్యమైనది.చంద్రుని నుండి 6,7,8 స్థానాలయందు శుభగ్రహమున్నప్పుడు అధియోగం ఏర్పడుతుంది.గ్రహబలానుసారం జాతకుడు రాజో మంత్రియో సేనాధిపతియో కాగలడు.
చాలా సింపుల్ గా ఉండే ఒక యోగం ఉంది.చంద్రుని నుండి 3,6,10,11 (ఉపచయ స్థానాలు) లో అన్నీ శుభగ్రహాలున్నప్పుడు సంపూర్ణ ధనవంతులవుతారు. రెండు ఉంటే మధ్యమ ధనవంతులు,ఒక్కటుంటే అల్ప ధనవంతులవుతారు. దీనినే ధనయోగం అంటారు.
సునఫా,అనఫా,దురుధర యోగాలు:
చంద్రునికి రెండులో రవి కాకుండా ఏ గ్రహమున్నా సునఫా యోగం,12 లో రవి కాకుండా ఏ గ్రహమున్నా అనఫా యోగం.రెండింటిలో అలా ఉన్నప్పుడు దురుధర యోగం అని శాస్త్రం.(కొందరు దుర్ధర అని చెబుతారు.ఆ పదం సముచితం కాదు).
సునఫా యోగం ఉన్నవారు రాజులు లేదా రాజతుల్యులు,బుధ్ధిమంతులు,ప్రసిధ్ధి కలవారు,స్వార్జిత ధనం కలవారు అవుతారు. అనఫా యోగం ఉన్న వారు రాజులు, రోగహీనులు,మంచి నడవడి కలవారు,కీర్తిమంతులు,సుందరులు,సుఖజీవనం గడిపే వారు అవుతారు.దురుధర యోగం కలవారు ధనం,వాహనం,సౌఖ్యం కలవారవుతారు.వీరు దాతలు,శత్రువులను జయించే వారు,సేవకులు కలవారు అవుతారు.
ఇవి చెప్పుకున్నాక చంద్రుని నుండి ఇలాంటి పరిస్థితి లేకపోతే ఏమిటి అని అడగాలి.ఇతర గ్రహాల లా కాకుండా చంద్రునికి ఒక ప్రత్యేకత ఉన్నది.చంద్రుని బట్టి యోగం లేనప్పుడు అది ఒక అవయోగం!దీనిని బట్టి చంద్రుని బట్టి యోగం ఉండటం ఎంత ప్రధానమో అర్థమవుతుంది.చంద్రుని బట్టి ఈ విధమైన యోగం లేకపోవటాన్ని కేమదృమయోగం అంటారు.అలా ఉన్నపుడు ఒక విషయాన్ని పరిశీలించాలి. చంద్రుని నుండి గానీ, లగ్నము నుండి గానీ కేంద్రములో గ్రహములున్నప్పుడు కేమదృమయోగం ఉండదు.అలాగే ఒక వేళ కేమదృమయోగం ఉన్నదని నిర్ధారించినప్పుడు చంద్రుడు గానీ శుక్రుడు గానీ కేంద్రగతుడయి ఉండి గురునిచే చూడబడితే కేమదృమయోగం లేదని చెప్పవలసి ఉంటుంది.ఇంకా ముందుకు వెళితే చంద్రుడు శుభగ్రహయుక్తుడైనా,శుభగ్రహముల మధ్యలో ఉన్నా,గురు దృష్టి కలవాడైయున్నా కేమదృమయోగం భంగమగును.ఈ అవయోగం సామాన్యమైనది కాదు.వేరే రీతిలో రాజయోగం ఉన్నా దానిని భంగం చేసే శక్తి ఈ యోగానికున్నది…
అలాగే తొలుత చెపినట్లుగా ఏ విధమైన అవయోగం జాతకం లో ఉన్నప్పటికీ చంద్రయోగం దానిని ప్రక్కన పెట్టి విశేషంగా తన ఫలం ఇవ్వగలదు.
‘బాగుంది సార్.ఈ యోగాలు ఉంటే చాలు…’
‘సుధాకరా…చంద్రయోగాలున్న వారు చాలా మంది ఉపసకులుగా కనిపిస్తారు.చంద్రుని బట్టి తిథులు ఏర్పడుతున్నాయి.పరమేశ్వరుడు శక్తిని పూరించి నివసించే 24 గంటల కాల ప్రమాణాన్ని తిథి అంటాము. కాలం పరబ్రహ్మ స్వరూపం.ఈ కాలం వలన మృత్యువు ఏర్పడుతోంది కబట్టి మనం కాలసర్ప వలయం లో ఉంటాం.ఇదే కాలం నుండి ఉపాసన ద్వారా  కాలామృతాన్ని మనం పొందుతాం.శుక్ల పక్షంలో 14,కృష్ణ పక్షంలో 14 తిథులను, అమావాస్య, పౌర్ణమి లను  నిత్యలు గా భావించి శ్రీవిద్యోపాసకులు పరమేశ్వరిని కాలస్వరూపిణిగా శ్రీచక్రం లో ఆరాధిస్తారు.సూర్యుడు కర్మలను ఆచరించమని ప్రేరేపిస్తాడు.చంద్రుడు నిత్య కర్మలనుపాసించేవారికి యోగాలను ప్రసాదిస్తాడు.అందుచేత గమనించి ఉంటావు.చంద్రుని బట్టి యోగాలు రవితో ముడి బడి యున్నాయి…’
‘సార్, మొండి వాడు రాజు కంటే బలవంతుడన్నారు…’
‘కరెక్ట్!’
‘ఈ అమ్మాయికి ఏ యోగం ఉండి ఉంటుందంటారు?’
‘నాయనా సుధాకరా,అమ్మాయిలను యోగాల ద్వారా, భార్యలను రోగాల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకు.ప్రపంచం తల్లక్రిందులవగలదు.’
‘అంతే అంటారు.’
‘ముమ్మాటికిన్నూ! సత్కర్మలను ఆచరించు.కార్తీక పొర్ణమి దగ్గరలో ఉన్నది. పరమేశ్వరుని దర్శించుకో.దాన ధర్మాలు చెయ్యి.ఒక్కో తిథికీ ఒక్కో ప్రత్యేకత ఎందుకున్నది? అందులోనే యోగమున్నది.యోగమంటేనే కలయిక-యుగళం.కలసి రావటమంటేనే యోగం!’
‘వస్తాను మాష్టారూ!’
‘శుభం భూయాత్!’
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “చంద్రయోగములు…(తరువాయి భాగం)

  1. ‘నాయనా సుధాకరా,అమ్మాయిలను యోగాల ద్వారా, భార్యలను రోగాల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకు.ప్రపంచం తల్లక్రిందులవగలదు.’
    ‘అంతే అంటారు.’….yeam baagaaleadu!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: