‘ఎదలోయల నిదురించే…’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


 

ఎవరో జో కొడుతున్నారు. తెలియటం లేదు.ఎవరో పాడుతున్నారు.వినిపించటం లేదు.చల్లని గాలి ఎందుకు వీస్తోందో తెలియటం లేదు.ఎటు నుంచి ఎటు వీస్తోందో తెలియటం లేదు.తెలియకుండానే మబ్బులు చంద్రుని మీదకు పాకినట్లు నిద్ర ఎందుకు నా మీద వాలిపోతోందో తెలియటం లేదు…
~~~***~~~
‘కథలో కొద్దిగా శృంగారం ఉంటే బాగుండేది…’,ఒకాయన అంటున్నాడు,’… అలంకారాలు బాగానే వాడారు కానీ పదజాలం అల్లినప్పుడు ఒకే సరళిలో ఉంటే బాగుండేది.’
టేబిల్ కు అటు కూర్చున్నాయన కళ్లజోడు తీసి దాని స్థానం గడ్డం కింద అన్నట్లు అలా పట్టుకున్నాడు.నేను ఆలోచించగలను లేదా నేనూ ఆలోచిస్తాను లెండి అని చెప్పేందుకు సంఘజీవిగా నిలబడే ప్రతి వ్యక్తీ చూపించే బాడీ లేంగ్వేజ్ అది.నిజానికి ఏమి చించుతారో మనకు తెలియదు.కాకపోతే ఆయన ప్రక్కన కూర్చున్నాయన చొక్కా చించుకున్నంత పని చేసాడు.
‘అలంకారం అంటున్నారు…అసలు  రచయిత ఏ అలంకారం వాడాడని మీరు అనుకుంటున్నారు?’
‘అలాక్కాదండీ…అలంకారం అంటే…’
‘పోనీ వదిలేయండి.ఇక్కడ విశ్లేషణాత్మకంగా వెళ్లాడు. స్త్రీ పాత్రలోని అంతర్మథనాన్ని వర్ణించినప్పుడు మంచి దృక్పథాన్ని చూపించాడు.అక్కడ కొంత అనుకరణాత్మకమైన శైలిని కనపరచాడు!’
‘అంటే? ఎవరిని అనుకరించాడని మీ ఉద్దేశ్యం?’
‘అనుకరణాత్మక…అంటే అది కాదండీ దాని అర్థం.అసలూ…’
‘మీరుండండి.అసలు ఈ కథలో కథ ఏమిటి?’
అందరూ కుర్చీలలో వెనక్కి వాలారు.చెయిర్మన్ లా కూర్చున్నాయన కండువాని వెనక్కి తోసాడు. చిన్నగా టేబిల్ మీదకి ఒరిగాడు.’చూడండీ…ఆకాశానికి నది ఒక చిన్న అద్దం లాంటిది అని రచయిత చెబుతున్నాడు…’
‘కరెక్ట్.’
‘చూసారూ, అది సామాన్యమైన మాట కాదు.’
‘కరెక్ట్.’
‘అలాగే స్త్రీ యొక్క హృదయం ఆకాశం అంటున్నాడు!’
‘…’
‘ఆ? అయితే మగాడు ఒక పక్షిలాగా అందులోకి దూరుతున్నాడుట!’
అందరూ నవ్వారు.
‘ఇదేమి గోలండీ?’
‘అలాక్కాదు!ప్రవాహం లో పోతున్నప్పుడు రచయితలు అలా తోచింది చెప్పుకుని పోతూ ఉంటారు.’
‘కరెక్ట్.’
‘అందుకని మనం చీకటినే చూడకూడదు.’
‘చీకటిలో కూడా చూడాలి!’
‘బాగా సెలవిచ్చారు!’
‘అంటే చీకటినే చూడకూడదు!’
‘కరెక్ట్!’
‘చీకటితో చూస్తే?’
‘…’
‘ఈ అలంకారం బాగుంది!’
‘ఓహో!చీకటిని టార్చ్ లైట్ లా వాడాలి!’
‘చూసారా? ఇదే విపరీత అలంకారం.చీకటి అనే పదార్థాన్ని…’
‘వద్దు సార్!కథ దగ్గరకి వద్దాం…’
‘ఏ కథ? నాకు కథ ఏమీ కనిపించలేదు.’
‘అదే గమ్మత్తు. ఈయన వ్రాసే దాంట్ళో అసలు కథ కనిపించదు.ఏదో ఉందీ అనిపిస్తుంది.ఏమీ లేదని తెలుస్తుంది.కానీ కథ అయిపోతుంది.’
‘అంటే కథ ఉన్నట్లే కదా?’
‘ఇది మరీ బాగుంది.ఖాళీ గిన్నెలోకి చేయి పోనిచ్చి చూసినంత మాత్రాన అందులో ఏదో ఉన్నట్లేనా?’
‘నో!ఏమీ లేదని నిర్ధారించేందుకు దాన్ని కదిపి చూడవచ్చు!’
‘అబ్బా వదిలేయండి ఈగోల…విషయానికి వద్దాం.ఇందులో రసం ఏది?’
‘రచయిత పెద్ద సరసుడు కాడు.ఇంక రసం ఎక్కడినుంచి వస్తుంది?ఆకాశం అంటాడు, మట్టి అంటాడు…ఎక్కువ మాట్లాడితే అంతా చీకటి ఇంకేమీ లేదంటాడు.’
‘కరెక్ట్! అంతా వేదాంతమే!’
‘ఇలాంటి వాళ్లకి కథలెందుకు?’
‘అదే తమాషా!’
‘అదుగో అదే మోసం.ఆలోచించమంటాడు చూడండి,అదే, అక్కడే మోసం.రచయిత మనకు చిక్కడు.జారిపోతాడు!’
‘బక్క ప్రాణం!’
‘కాదు. పాదరసం.’
‘ఓకే! వదిలేయండి.ఇంతకీ మీరంతా ఈ కథ దేని గురించి అని చెబుతారు?’
కళ్లజోడు మనిషి మరల దానిని ముక్కు మీదకు తోసాడు.కానీ ఏమీ మాట్లాడలేదు.
‘ఈ మధ్య జనం ఆలోచించటం మానేసారు అంటాడు.’
‘కాదు.సరైన భావ ప్రదర్శన చేయటం లేదంటాడు.’
‘అసలు భావాలు లేవంటాడు.’
‘పప్పులో కాలేసారు సార్! రచయిత అసలు భావాలు అక్కరలేదంటున్నాడని నా గట్టి అభిప్రాయం.’
‘ఏమి కావాలంటాడో మరి?’
‘కామాభావ కామనయా…ఏదో అన్నాడండీ అలాంటిదేనూ!’
‘సర్లెండి.ఏదో ఒకటి.మధ్యలో సంస్కృతం ఒకటి.అసలు ఈ కథ గురించి చర్చించమన్నది ఎవరో వారు ఒక్క సారి ముందుకు వస్తే…’
‘ఆ…వస్తే?’
‘అయ్యో కోప్పడమాకండీ! మీరేనా కొంప దీసి?’
‘కాదు.ఈ కథను ఎటు నుండి ఎటైనా చదవ వచ్చని క్రింద వ్రాసాడీయన. అందుకు వచ్చింది ఈ సమస్య!’
‘అలా ఎలా చదువుతాం?ఓహో అది అర్థం కాక ఇంతమందిని పిలిచారా?అసలు  ఇంతసేపూ మీరు కథ అని అనుకుంటున్నది కేవలం ఆలయ ఉపోద్ఘాతమే!అదే పన్నెండు పేజీలుంది!’
‘అయ్యో మరి కథ ఏది?’
‘దీని క్రింద తెల్ల కాగితం పెట్టాడు!’
‘ఎటు నుంచైనా చదవమన్నాడు.క్రిస్టలైస్డ్ స్టోరీట!’
‘వీడి మొహం మండ!’
‘పదండి పోదాం!’
~~~***~~~
కళ్లు తెరిచాను.ఏదో వ్రాద్దామని తెచ్చుకున్న తెల్ల కాగితాలు అలా గుండెల మీద చంటి పిల్లాడిలా కదులుతున్నాయి.వాటి మీద పెట్టిన లేఖిని గాలికి అటూ ఇటూ కదులుతూ జోల పాడుతోంది.రెండూ కలసి నా చిరు హృదయాన్ని జో కొడుతున్నాయి.ఏదో చిన్ని అలజడి.ఈ క్షణం పోనీయవద్దంటోంది.ఎక్కడో మెరవాలని, ఏదో మరవాలని,అరమరికలు లేని వీటి మీద ఏవో మరకలు చేర్చవద్దంటోంది ఆ కలం.నీకు చేతకాక ఏదో చేర్చినా ఇక్కడే ఉంచి బుజ్జగించమంటోంది.పరిశోధనా బల్లల మీద పెట్టి నిర్దాక్షిణ్యంగా కొయ్య మనుషుల చేత కోయించవద్దంటోంది…

ఎవరో జో కొడుతున్నారు. తెలియటం లేదు.ఎవరో పాడుతున్నారు.వినిపించటం లేదు.చల్లని గాలి ఎందుకు వీస్తోందో తెలియటం లేదు.ఎటు నుంచి ఎటు వీస్తోందో తెలియటం లేదు.తెలియకుండానే మబ్బులు చంద్రుని మీదకు పాకినట్లు నిద్ర ఎందుకు నా మీద వాలిపోతోందో తెలియటం లేదు…
~~~***~~~

(జన్మ దినం జరుపుకుంటున్న నా శ్రీమతి కుట్టి మనోహరికి ఈ కథే చిరు కానుక!
ఏ కానుకలందియ్యగలనో చెలీ…పిచ్చి పదములు తప్ప,వెర్రి ఆలోచనలు తప్ప!)
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ఎదలోయల నిదురించే…’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: