బహు వివాహ యోగాలు…


‘శర్మాజీ…’
‘చెప్పండి…’
‘ఎప్పటినుంచో అడగాలనుకున్నాను.’
‘అమ్మాయి కనిపించిందా?’
‘అయ్యో కాదు సార్!అసలు తెలుగువాళ్లకి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలే లేరు. అది కాదు…’
‘మరి? బట్టతల మీద జుట్టు మొలవాలంటే నావల్ల కాదు…’
‘నా బట్టతలని వదిలేయండి మాష్టారూ.అది మిమ్మల్ని ఏమి చేసింది?అది తల రాత!’
‘అదృష్ట్వంతుడవు. బ్రహ్మదేవుడికి తల  రాత వ్రాయటానికి పిచ్చ చోటు ఇచ్చావు…ఎంత అదృష్టం వ్రాసాడో?’
‘ఓహో! బట్టతల అంటే అదృష్టం అంటే ఇదా?’
‘కావచ్చు! అధికస్య అధికం ఫలం.ఇంతకీ నీ బాధేమిటి?’
‘…’
‘ఏమయింది?’
‘హోమియోపఈ డాక్టర్ అడిగినట్లు అడిగారు. ఏమీ లేదు.ఒక పెళ్లికే అమ్మాయిలు లేరు.చూస్తే కొంత మంది వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు.అసలు బహు భార్యలుండటం రాజయోగమా?లేక అవయో గమా? జాతకంలో బహు భార్యలున్నప్పుడు అన్ని పెళ్లిళ్లు జరిగి తీరుతాయా?అసలు వివాహం…’
చేయి అడ్డం పెట్టాను.’అబ్బాయి, బట్టతలలు,భార్యలు,వివాహాలు…ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నావు.ఇవి ఆలోచిస్తే అర్థమయ్యేవి కావు.వీటి గురించి ఆలోచన అనేది చేయకపోవటం అనే చక్కని నిర్ణయం ఉంది చూసావ్?’
‘సార్…’
‘బ్రహ్మానందం అనే ఒక మహాసౌధానికి ముఖ్యద్వారం అని పునర్వివాహానందస్వాముల వారు చెప్పారు.’
‘వారెవరు?’
‘ఉన్న భార్యను వదిలించుకుని మరో అమ్మాయితో వివాహం చేసుకుంటుండగా  మొదటి భార్య నడుచుకుంటూ స్టేజ్ మీదకి సరాసరి నడుచుకుంటూ వస్తున్న  తరుణంలో ఆయన చూపు అక్కడే నిలచిపోయింది.అది సమాధి అని పెద్దలు చెప్పారు.ఆ సమయంలో ఆయన ఒకౌద్బోధ చేసారు.అదే ‘పువి పురాణం ‘ గా భువిలో ఖ్యాతి చెందింది!’
‘శర్మాజీ…’
‘యస్?’
‘నేను ఒకటి అడిగాను.’
‘చెబుతాను.దీనిని శ్రధ్ధగా వినకూడదు.సరదాగా వినాలి.’
~~~***~~~
సామాన్యంగా గ్రహస్థితులూను పరీక్షిస్తే ఒక విషయం బాగా కనిపిస్తుంది.శుక్రునికి సప్తమమున చంద్రుడు,చంద్రునికి సప్తమమున బుధుడుండి అష్టమాధిపతి పంచమమున ఉన్నప్పుడు పదవ ఏట ఒకటి,22వ ఏట ఒకటి,33వ ఏట ఇంకొకటి అగునని శాస్త్రం చెబుతున్నది.దీనికి భాష్యం కొందరు ఎలా ఇచ్చారంటే పదవ ఏట మరదలు పిల్లే సంబంధం అని ఇ అనుకొని,22వ ఏట ఒక సంబంధం బాగా దగ్గరగా వచ్చి తప్పిపోయి,33వ ఏట అసలు వివాహం జరగటం ఉండవచ్చు అని! విచిత్రం ఏమిటంటే ఒకరి జాతకంలో ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ఆయన ఇంచిమించు ఇలాంటి విషయమే చెప్పాడు…అంటే?జ్యోతిషం ప్రకారం వివాహ ప్రకరణం అనేది ఆ ఘటనకు భిన్నంగా ఉన్నదా? అదలా ఉంచండి.నీ భార్య ఎక్కడో పుట్టే ఉంటుంది అన్నప్పుడు భార్యగా మారబోయే ఒక అమ్మాయి కొన్ని గ్రహస్థితులతో జన్మించి ఉన్నదా…దీని దగ్గరకు తరువాత వద్దం.

ఎందరు భార్యలు అనేది శాస్త్రం చెబుతున్నది.సప్తమమున బుధ గురులు, రవి కుజులు ఉంటే ఒక్క భార్య.

లగ్న సప్తమాధిపతులు లగ్నమున కానీ సప్తమమున కానీ ఉంటే ఇద్దరు,సప్తమ అష్టమములందు పాపగ్రహముండి కుజుడు వ్యయయమున ఉండి వ్యయాధిపతి అదృశ్య చక్రార్థగతుడై (1-6)ఉంటే మరల పెళ్లి ఉండవచ్చు.

సప్తమాధిపతి శుభగ్రహములతో  (6,8,12) ఉండి సప్తమమున పాపగ్రహములుంటే ఇద్దరు భార్యలుండగలరు.

లగ్నాధిపతి ద్వాదశమున ఉండి ద్వితీయాధిపతి పాపగ్రహంతో ఉన్నా ఇద్దరు భార్యలు.

కుజుడు సప్తమ,అష్టమ,వ్యయములందుండి సప్తమాధిపతి దృష్టి లేకు న్నప్పుడు ఇద్దరు భార్యలు ఉండగలరు.

సప్తమ ద్వితీయములు పాపగ్రహసంబంధముతో ఉండి ద్వితీయాధిపతి దుర్బలుడై ఉన్నా రెండవ వివాహం ఉండగలదు.

సప్తమమున గానీ ద్వితీయమున గానీ పాపగ్రహములు ఎక్కువగా ఉండి సప్తమాధిపతులకు పాపగ్రహదృష్టి ఉంటే ముగ్గురు భార్యలు ముందుకు రాగలరు!

లగ్న, ద్వితీయ,సప్తమములందు పాపగ్రహముండి సప్తమాధిపతి నీచ అయినప్పుడు లేదా అస్తంగతుడైనా ముగ్గురు అమ్మాయిల మొగుడవగలడు.

భాగ్యాధిపతి సప్తమమున,సప్తమాధిపతి నాలుగులో ఉన్నా,లేదా సప్తమ, ఏకాదశాధిపతులు కేంద్రమందున్నప్పుడు ముగ్గురు కాదు, సంఖ్య మించగలదు.

~~~***~~~

‘సార్!’
‘యస్?’
‘చాలా ఆనందంగ ఉంది.’
‘ఎందుకు?’
‘ఇన్ని చెప్పారు కాబట్టి వీటిలో ఒక్కటైనైనా  నా జాతకంలో ఉండబోదా అని!’
‘వార్ని! నీకు ఇంకా ఒక్కటైనా అవలేదు కదా?’
‘శర్మాజీ! అదే తమషా!సావిత్రి అడిగినట్లు అధికస్య అధికం ఫలం.ఆకాశం అడగాలి. చెట్టు మీదైనా పడతాం.రెండు మూడు వివాహాలున్నాయి అంటే ఒక్కటైనా అయిపోగలదు!’
‘తొందర పడకు. ఈ గ్రహస్థితులను నవాంశతో కలిపి చూడాలి. అక్కడ కూడా లగ్నాత్, లేదా చంద్రుని నుంచైనా ఇలాగే ఉంటే బహు భార్యలు, లేదా వివాహాలుండకపోవచ్చు.అలాగే ఇవన్నీ పురుషుల జాతకాలకు సంబంధించినవి.ఇవి స్త్రీల జాతకం లో కూడా ఉన్నాయి కాబట్టి బహు భర్తలు అని నిర్ధారించకూడదు.’
‘అదేమిటి సార్? స్త్రీలు ఉద్యమించగలరు!’
‘అలాక్కాదు! పురుషుల జాతకంలో వివాహం,వైవాహిక జీవితం గురించి పరీక్షిస్తున్నప్పుడు సప్తమాధిపతితోపాటు ప్రధానంగా చూడ వలసినది ఏకాదశం.ఇక్కడ గురువున్నా,శుభగ్రహమున్నా, ఆ విధమైన దృష్టి సప్తమం మీద ఉన్నా చాలా అవయోగాలు కొట్టుకుపోగలవు.అలాగే స్త్రీల విషయం వద్దకు వస్తే శుక్రుడు ద్వితీయంలో , పంచమంలో ఆ పని చేయగలడు…’
‘వదిలేయండి.ఎంతో ఆశతో వచ్చాను.అయినా ఇంత బట్టతల మీద ఎక్కడా కళత్రం గురించి వ్రాసిలేదా?’
‘సమయం వచ్చినప్పుడు కనిపిస్తుంది మిత్రమా!గొంగట్లో బొచ్చు ఎలా అయితే ఏరలేమో,హెలిపాడ్ లాంటి బట్టతల మీద తలవ్రాతనూ త్వరగా చదవలేము!’
‘శర్మాజీ నమస్కారం.మరల దర్శనం చేసుకుంటాను!’
‘శుభం భూయాత్!’
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “బహు వివాహ యోగాలు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: