‘ఇద్దరు’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


పెద్దాయన తప్పదన్నట్లు పార్కులోకి ప్రవేశిస్తాడు.ఆయన వెనుక భార్య అప్పుడప్పుడు అలా చేయిని పట్టుకున్నట్లు పట్టుకుని లోపలికి వస్తుంది. బిల్ గేట్సో లేక ఒబామా లాగానో మొత్తం పార్కంతా సింహావలోకనం చేస్తాడాయన.మెల్లగా ఇద్దరూ ఒక్కో చెట్టూ చూసుకుంటూ నడుస్తారు. ప్రతి చెట్టు దగ్గర ఏదో వెతుక్కుంటున్నట్లు  చూస్తారు. ఏమి పారేసుకున్నారో తెలియదు.రోజూ ఇంతే! దొరుకుతుందనే ఆశ మటుకు పోలేదు!ఒక రోజు కొద్దిగా వెంట నడిచాను.
‘ఏమి పోయిందండీ?’,అడిగాను.
ఆవిడ వెనక్కి తిరిగి కొద్దిగా భయంగా చూసింది.పెదాల మీద చూపుడు వేలు పెట్టి మాట్లాడవద్దని సైగ చేసింది.అక్కడే ఆగిపోయాను…

~~~***~~~

ఈ రోజు ఎందుకో ఆవిడ ఒంటరిగా కూర్చుని ఉంది.ఆవిడను దాటుకుంటూ ముందుకు వెళ్లి ఆగిపోయాను.వెనక్కి తిరిగాను. ఆవిడకి ఏదో అర్థమయి చిరునవ్వు నవ్వింది.

‘సార్ రాలేదా?’అడిగాను.
‘కొద్దిగా నీరసంగా ఉంది.’
దగ్గరగా వచ్చి కూర్చున్నాను.
‘అదేదో దొరికిందా?’
ఆవిడ పైకి చూసి నవ్వింది.
‘ఏంటది?’
‘రోజూ వెతుకుతారు కదా?’
‘పోగొట్టుకున్నది ఏమీ లేదు.ఆయన అలా అనుకుని అటూ ఇటూ చూస్తూ ఉంటారు…’
‘మీరు?’
‘వెతుకుతున్నట్లు నటిస్తూ ఉంటాను!’
‘ఛా…’
పార్కులో జనం పెరిగారు. ఆ బెంచీల ప్రక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు.ఒకమ్మాయి నిన్ను వదిలేది లేదన్నట్లు జతగాడి చేయిని రెండు  పట్టుకుని ముందుకు నడుస్తోంది.ప్రస్తుతానికి ధైర్యం బాగానే ఉందని చెబుతున్నట్లు అబ్బాయి హుందాగా నడుస్తున్నాడు.మా ఇద్దరినీ ఓరకంట చూసి అలా సాగిపోయారు.
‘ఎందుకండీ?’
‘మా వారు చాలా కష్టపడి పైకొచ్చారు…’,ఆవిడ చెప్పింది,’…ఒక పెద్ద ఆఫీసరు బంగళాలో వీళ్ల కుటుంబం పనికి ఉండేది.ఆఫీసరు గారు వీళ్లని చాలా బాగా చూసుకున్నారు.వాళ్ల అబ్బాయినీ, ఈయననూ కలసి చదివించారు.ఈయన ప్రతి రోజూ ఆయన పేరు ఏదో విధంగానైనా చెబుతూనే ఉంటారు.ఇద్దరూ బాగానే చదువుకున్నారు.అతనూ విదేశాలు వెళ్లాడు,ఈయనా చాలా దేశాలు తిరిగారు.’
‘ఆఫీసరు గారి అబ్బాయి కలవటం మానేసాడా?’
‘అదేమీ లేదు. వాళ్ల కుటుంబం మా ఇంటికి వస్తూ ఉంటుంది.వాళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. మేము ఇక్కడుంటున్నాము.’
‘పిల్లలి?’
‘ఎవరి దారిన వారు విదేశాలలో ఉన్నారు.’
‘మరి ఏమి వెతుకుతున్నారు?’
ఆవిడ మరల నవ్వింది.
‘ఏదైనా పోగొట్టుకుంటే కదా? వెతికాలి?’
లేచి నిలబడ్డాను.నా బాధ ఆవిడకు అర్థమయినట్లుంది.ఆవిడా లేచింది.
‘రండి. నడుస్తూ మాట్లాడదాం…’
‘మామూలుగా నడుద్దామా? వెతుకుదామా?’
పెద్దగా నవ్వు రాలేదు. తల ఒక్కటీ ఆడించి ముందుకు నడిచింది.
‘మీరు కారణం వెతుకుతున్నారు.చెబుతాను.బాగా అలసిపోయినప్పుడు నిద్ర పోయారనుకోండి…గతంలో గడచినవి బాగా ఇబ్బంది పెట్టినవి అలా మరల జరిగినట్లు కలలో కనిపిస్తాయి. అవునా?’
‘నిజమే! సమయానికి హాల్ టికట్ రాకపోవటం ఇప్పటికీ నాకు కనిపిస్తూ ఉంటుంది.’
‘వయసు దాటిపోయినప్పుడు అలసటలో కూడా అనుభవాలు అలాగే వెనకి వస్తాయి.అవి చాలా నిజంగా, మరల జరుగుతున్నట్లు కనిపిస్తాయి…’
‘కరెక్ట్.’
‘ఒక పార్కులో ఈయన చేత ఆఫీసరు గారి అబ్బాయిని ఆడించే వారట.అదుగో చూడండి.ఆ పిల్లలందరిదీ ఆడే వయసే.ఆడించటం ఏమిటి?’
‘అర్థమయింది.’
‘కొత్త బంతి ఎక్కడో పోయింది ఓ సాయంత్రం. ఆ అబ్బాయి ఏడుస్తూ రాత్రంతా ఏమీ తినలేదు.’
‘ఈయనను ఏమైనా అన్నారా?’
‘లేదు.ఈయన తండ్రిని పిలచి ఒక వేళ చిన్న తనంలో అబ్బాయి ఎక్కడైనా దాస్తే తెచ్చివమన్నారు. కొంత బంతి కూడా పిల్లవాడు వద్దంటున్నారన్నారు!’
‘మరి?’
‘ఈయన అర్థరాత్రి అని కూడా లేకుండా పార్కంతా వెతికారట!దొరకలేదు!అలా చేసినందుకు దెబ్బలు కూడా తిన్నారు!ఆ గోల అక్కడితో అయిపోయింది.కానీ ఎక్కడైనా పెద్దింటి పిల్లలను వేరే పిల్లలు ఆడించటం చూస్తే తట్టుకోలేకపోయేవారు.ఈ మధ్య ఇలా వచ్చి వెతుక్కోందే ఆయనకు నిద్ర పట్టదు.అంతకంటే ఏమీ లేదు.’

అవతలి గేటు దాకా వెళ్లి ఇద్దరం వెనక్కి వచ్చాం.పూలు,పూలమొక్కలు,పిల్లలు,పెద్దలు అందరితో పార్కు రంగుల కలలా ఉంది.చీకటి పడుతోంది.ఆవిడ వెళ్లిపోయింది.నేనూ ఇంటికి వెళ్లే లోపు ఎక్కడో ఓ ముల్లు గుచ్చుకున్నట్లయింది…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘ఇద్దరు’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ

  1. శ్రీపతి శర్మ గారూ,మీ ఈ కధ అద్భుతం. ప్రతీ మనిషి జీవితంలోనూ ఇలాటి కధాంశం దొరుకుతుంది, అలాటి వ్యక్తులు తారసపడుతుంటారు అలాటి యేవో కొన్ని అనుభవాలు అనునిత్యం మనలను వెంటాడుతూనే వుంటాయి . మనలను తరుముతూనే వుంటాయి .
    కధనం బాగుంది.అభినందనలు. శుభాకాంక్షలతో శ్రేయోభిలాషి …నూతక్కి రాఘవేంద్ర రావు.

raghavendra rao nutakkiకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: