శ్రీమద్రామాయణం-కచ్చిద్ సర్గ(1)


అయోధ్యకాండలోని నూరవ సర్గ కచ్చిద్ సర్గ అని పేరు తెచ్చుకుంది.భరతుడు శ్రీరాముని వద్దకు వచ్చి  చేతులు జోడించి అలా నేల మీద పడి ఉన్నాడు (పతితం భువి).శ్రీరాముడు వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు.కొన్ని కుశల ప్రశ్నలు, ఆ తరువాత రాజధర్మం,ఇలా ఎన్నో గొప్ప విశేషాలు ఈ సర్గలో కనిపిస్తాయి.ఇలా చేస్తున్నావా?,అలా చేయటం లేదు కదా?ఒక వేళ ఇలా ఉంటే…అన్నీ ఇలాంటి ప్రశ్నలే!మితభాషి అయిన శ్రీరాముడు వరుసగా ఇంతసేపు మాట్లాడిన సందర్భం ఇక్కడేనేమో! వనం లో ఉన్న వీరి దగ్గరకి సోదరుడు రాగానే తండ్రి,పెద్దలు…ఇలా కొంత కుశల ప్రశ్నలు జరిగాక సుదీర్ఘంగా  రాజధర్మం, నీతి విషయాల మీద శ్రీరాముడు ప్రశ్నలను అందుకోవటం చిన్నవాడైన భరతుని పట్ల అనురాగం,పెద్దవాడిగా ఆయన చెప్పవలసినవి,అయోధ్య ప్రజల పట్ల వాత్సల్యం…అన్నీ ఒక్క సారి ప్రదర్శనలోకి వస్తాయి. ఈ శ్లోకాలలో తెలుసుకోవలసినవి,ఈ నటికీఆచరాలో ఉండవలసినవి (కానీ ఏనివి) చాలా విషయాలు కనిపిస్తాయి.కచ్చిత్…అంటూ ప్రారంభమయ్యే శ్లోకాలను చూద్దాం:

శ్లో: కచ్చిత్ సౌమ్య న తే రాజ్యం భ్రష్టం బాలస్య శాశ్వతం
కచ్చిఛృశౄషసే తాత పితు: సత్యపరాక్రమ

నీవు ఇంకా బాలకుడవు.పరంపర చేత వచ్చిన సామ్రాజ్య నష్టమయిపోలేదు కదా?సత్యపరాక్రమా! తండ్రి గారి సేవ, శుశౄష చేస్తున్నావు కదా?

శ్లో:కచ్చిద్ దశరథో రాజా కుశలీ సత్యసంగర:
రాజసూయాశ్వమేధానామాహర్తా ధర్మనిశ్చిత:

ధర్మమందు స్థిరముగా నుండు రాజసూయ, అశ్వమేధ యఙ్ఞములను అనుష్ఠించిన , సత్యప్రతిఙ్ఞులైన మహారాజ దశరథులు కుశలమే కదా?

శ్లో: స కచ్చిద్ బ్రాహ్మణో విద్వాన్ ధర్మనిత్యో మహాద్యుతి:
ఇక్ష్వాకూణాం ఉపాధ్యాయో యథావత్ తాత పూజ్యతే

ధర్మతత్పరులైన పండితులు,బ్రహ్మవేత్త,ఇక్ష్వాకుకుల ఆచార్యులైన మహాతేజస్వి (వసిష్ఠుల వారిని) యథావిధిగా పూజిస్తున్నావా?

శ్లో:తాత కచ్చిచ్చ కౌసల్య సుమిత్రాచ ప్రజావతీ
సుఖినీ కచ్చిదార్యా చ దేవీ నందతి కైకయీ

మాత కౌసల్య కుశలమా?,ఉత్తమమైన సంతానము గల సుమిత్ర ప్రసన్నముగా ఉన్నదా? ఆర్యా కైకేయీ దేవి కూడా ఆనందముగా ఉన్నదా?

శ్లో: కచ్చిద్ వినయసంపన్న: కులపుత్రో బహుశృత:
అనసూయురనుద్రష్టా సత్కృతస్తే పురోహిత:

ఉత్తమకులములో ఉత్పన్నమై,వినయసంపన్నులై,బహుశృతులై, ఎవరిలోనూ దోషములు చూడని వారై,శాస్త్రోక్తములైన ధర్మముపైన నిరంతరం దృష్టి సారించువారలైన,ఆ పురోహితులను సంపూర్ణంగా సత్కరించుచున్నావా?

శ్లో: కచ్చిదగ్నిషు  తే  యుక్తో విధిఙ్ఞో మతిమానృజు:
హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా

హవనవిధి గురించి తెలిసినవారైన,బుధ్ధిమంతులు, సరళస్వభావులు,అయిన ఏ బ్రాహ్మణులనైతే నీవు అగ్నిహోత్రము కోసం నియమించినావో వారు సరైన సమయానికి వచ్చి ఆయా కార్యములు సరైన సమయాలకు జరిగినవి అని నీకు సూచన ఇస్తున్నారా?

రాజ్యం,ప్రజలు క్షేమంగా ఉండవలసిన పరిస్థితి గురించి ఎంతో ప్రధానమైన విషయాన్ని చాలా నేర్పుగా అడిగాడు శ్రీరాముడు. హవనము అనేది నిత్యకృత్యము. అది విధిగా సరైన కాలానికి జరుగవలసిందే!అందులో తేడా వస్తే అపచారం,అధర్మం.ధర్మబధ్ధమైన రాజ్యపాలనకు మూలస్తంభం యఙ్ఞం.
రాజ్యంలో పండవలసిన పంటలు,ప్రజోత్పత్తి,మేఘములు,వర్షాలు…సమస్తం యథవిధిగా జరుగు అగ్నిహోత్రం మీదనే ఆధారపడి ఉంటాయి.ఇహలోకాలకు,పరలోకాలకు అనుసంధానం చేయువాడు అగ్ని.హవిస్సును దేవతలకు అందించే వాడు కావున ‘హవ్యవాహనుడు ‘ అన్నారు.అక్కడ ఏ మాత్రం తేడా రాకూడదు!

(మరల కలుసుకుందాం)
శుభం భూయాత్!
హరి: ఓం!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: