దురద


‘మీ కోసం చేసే  ప్రోగ్రాం  కు మరో సారి స్వాగతం. ఈ రోజు మన ముందున్నారు,ప్రొఫెసర్ ఆదుర్ద సుబ్బారావు గారు! నమస్కారం ఆదుర్ద గారు!’
అటు విశాలమైన కళ్లజోడుతో ఆయన కనిపించాడు.వాళ్లావిడనే పంకించి చూస్తున్నట్లు అందరినీ చూశాడు. నేను కూడా టి.వీ లోకి వచ్చాను,, నన్ను తక్కువగా అంచనా వేయద్దు అని చెబుతున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. చిన్నగా చేతులు జోడించి ‘ నమస్కారం ‘ అన్నాడు.
‘ ఆదుర్ద సుబ్బారావు గారు దురద లోకి లోతుగా వెళ్లారు…అంటే దురద మీద పరిశోధన చేసి ఎన్నో విషయాలు-మనకు తెలియనివి అన్నీ మన ముందుకు తెచ్చారు. మీ టెలిఫోనులు రెడీగా పెట్టుకుని ఉన్నారా? వెరీ గుడ్! మనం ప్రారంభిద్దాం…సుబ్బారావు గారూ, అసలు దురద అంటే ఏమిటి?’
ఎంత దారుణంగా అడిగావన్నట్లు మొహం చిట్లించాడు ఆదుర్ద!
‘అస్సలా…దురద అనగానే అందరం సింపులుగా దురద అనేస్తున్నాం…దురద సామాన్యమైనది కాదు.గోకటం, దురద, దేనితోనైనా రాసుకోవటం…’
‘ ఒక్క ప్రశ్న. దురదకీ, గోకటానికీ సంబంధం ఏమిటండీ? వివరిస్తారా?’
‘ అస్సలా…బాగా  అడిగారు. గుడ్డు ముందా, పిల్ల ముందా అనే విషయం ఇది. గోకాక   దు
రద మొదలయిందా లేక దురద ఉన్నదని గోకటం మొదలు పెట్టామా…ఇలా…’
‘ కాల్ తీసుకుందామండీ ‘
‘అలాగే!’
‘ సార్ నమస్కారమండీ…’
‘నమస్కారం…చెప్పండీ, చెప్పండీ…’
‘సార్ నమస్కారమండీ…’
‘హలో…హలో మీరు వాల్యూం…కాదు గోక్కోవటం కొద్దిగా తగ్గించి మాట్లాడుతారా?’
‘…’
‘హలో…’
‘ఆ ఇప్పుడు చెప్పండి!’
‘సార్, మిమ్మల్ని చూడగానే చాలా ఆనందం వేసిందండీ ‘
‘నాక్కూడానండీ అస్సలా…మనిషికీ మనిషికీ మధ్య కొద్ది పాటి దురద అవసరం’
‘సార్,మా అబ్బాయి అర్థరాత్రి లేస్తాడు…’
‘వెరీ గుడ్ అండీ. బాగా చదువుతున్నట్లున్నాడు ‘
‘కాదండీ.అలా లేచి తల మీద ఒకటే గోక్కుంటాడండీ. జుట్టు పట్టుకుని విపరీతంగా లాక్కుంటాడు. ఎన్నో పరీక్షలు చేయించాం. ఎంతో మంది డాక్టర్లకు చూపించాం. లక్షన్నర ఖర్చయింది.మా దురద వదిలింది కానీ వాడి దురద పోలేదు. ఏమి చేయమంటారు?’
‘డాక్టర్లు గోకలేదా/ సారీ, వాళ్లు ఏమన్నారు?’
‘ఏమీ లేదన్నారు!’
‘మీరు భయపడవలసింది ఏమీ లేదండీ. ఇది ఓచో మచో సమస్య ‘
‘ఓచో మచో సమస్య? చైనా నుంచి వచ్చిందా సార్?’
‘కాదు. ఇది మన భారతీయ సంప్రదాయబధ్ధమైన, అతి ప్రాచీనమైన అంశం! ఓచో మచో అంటే సింపుల్. ఒక చోట దురద ఉంటే మరో చోట గోక్కోవటం.’
‘సార్, నన్నేమి చేయమంటారింతకీ?’
‘అస్సలా…మీ అబ్బాయి అలా తల మీద గోక్కోవటం ప్రారంభించగానే ఒక పని చేయండి ‘
‘సార్…’
‘అరికాలు మీద గోకటం ప్రారంభించండి.ఆపేస్తాడు.’
‘చాలా థాంక్స్ సార్!’

‘కొత్త విషయం చెప్పారు ఆదుర్దా గారూ! అసలు దురద అనేది తొలుత ఎవరు కనుక్కున్నారు? ఇది సామాన్య మానవుడిని ఎందుకు ఇలా బాధిస్తోంది? ఇలా…’
‘అస్సలా…అన్నీ మన దగ్గర పుట్టినవే!ఏ ఆకు ముట్టుకున్న శరీరమంతా దురదలు పుట్టే వృక్షలు దట్టంగా పెరిగిన ఒక మహారణ్యం దురదారుకావనమని ఒకటి యున్నది. అందులో నిత్య దురదానదులస్వామి వారని చెప్పేసి ఒకాయన తీవ్రమైన తపస్సు చేశాడు.ఆయన అస్సల ముందు ఈ దురద గురించి రెండు ఖండాలుగా ఒక పురాణం వ్రాశారు.దానినే దురదారుణేయం అంటారు.’
‘దురదారుణేయం గురించి క్లుప్తంగా చెప్పే ముందు మరో కాలర్…’

‘ హలో, చెప్పండి?”
‘సార్, …’
‘చెప్పండి…’
‘ చాలా దురదగా ఉంటోంది సార్!’
‘ఏవండీ, ఎక్కడ దురదగా ఉంటోంది?’
‘సార్…’
‘అయ్యా…’
‘చాలా దురద సార్!’
‘అయ్యా? ఎక్కడ దురదండీ?’
‘తెలియటం లేదండీ…’
‘అస్సలా…ఎప్పుడు దురదగ ఉంటోందండీ?’
‘సార్…చెప్పలేనండీ…మందు చెప్పండి!’
‘ అయ్యా మీ పేరండీ?’
‘మునియప్ప సార్ ‘
‘అయ్యా, మీరు ఒక పని చేయండి.’
‘చెప్పండి ‘
‘ మీరు ఒక సమగ్రమైన దురదావేశంలోకి వెళ్లారు.’
‘ఛా…’
‘ స్టేషనరీ షాపులోకి వెళ్లి తెల్ల కాగితాలు ఒక అయిదు వందలు కొనండి ‘
‘సార్…’
‘ వాటిని ముందు పెట్టుకొండి.’
‘సార్…’
‘మీ దురద యావత్తూ ఆ కాగితాలలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సరేనా?’
‘అలాగే సార్ నమస్కారం!’
‘ ఆదుర్దా గారూ, దురదదారుణేయం గురించి మాట్లాడుకుంటున్నాం…’
‘ కరెక్ట్! అస్సలా సృష్టి యావత్తూ కేవలం దురద ద్వారా తయారయిందని అందులో తేల్చారు! దురదమద: దురదమిదం దురదాత్ అంటారు వారు!  దురద మీద గోకామా లేక దురద పుట్టిన చోట గోకామా? ఆలోచించండి! చిత్రమైన వేదాంతం ఇది….’
‘కరెక్ట్. దురద మీద గోకటం వలన దురద వచ్చిందా లేక గోకటం వలన దురద పోయినట్లనిపించి మరల పుట్టుకొచ్చిందా?’
‘అస్సలా…దురదను బాగా పట్టారు. అదొక అనుభూతికి చెందిన విషయం. ఉన్నదా లేదా అనే లోపల ఎక్కడికో వెళ్లి మరల తిరిగి వచ్చేస్తుంది. దీనినే మాయ అని పెద్దలు చెబుతూ ఉంటారు. జాగ్రత్తగా చూస్తే అంతా దురదే!’
‘విష్ణుమూర్త్ చెవిలో గులివి వలన దురద పుట్టగా మధు కైటభులు ఇవతలికి వచ్చి…’
‘చంపేశారు. బాగా గుర్తు చేశారు. చూశారా? ‘
‘ఆదుర్దా గారూ…మీ ఇంటి పేరులో ఆదుర్దా ఉన్నది.’
‘కరెక్ట్. ‘
‘ ఆదుర్దాకీ దురదకీ సంబంధం ఏదైనా ఉన్నదా అని చెప్పుకునే ముందు మరో కాలర్…’
‘తప్పకుండా ‘
‘హలో, ఎవరండీ? మీ పేరు?’
‘ నా పేరు గజ్జి తాండవప్రసాద్ అండీ…’
‘ఎక్కడినుండి మాట్లాడుతున్నారు సార్?’
‘నేను ఒక దశాబ్దంగా దురదబాధితుడిని సార్ ‘
‘చెప్పండి…’
‘ ప్రభుత్వం వారు ఆదుకోలేదు ‘
‘మీరు ఎక్కడినుండి మాట్లాడుతున్నారు సార్?’
‘అయ్యా మాది గోకినవారి కుప్పం సార్ ‘
‘చెప్పండి మీకు దురద ఎప్పుడు వస్తుంది…ఎలా ఉంటుంది?’
‘ఎటువంటి బట్ట శరీరానికి తగిలినా విపరీతమైన దురద సార్.’
‘ఛా…ఎలాగ మరి?’
‘అదే సార్ నా బాధ! డాక్టర్లు ఎలర్జీ అని చెప్పి కొంత కాలం ఏమీ తొడుక్కోవద్దని సెలవిచ్చి యున్నారు సార్!’
అక్కడ ఇద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకున్నారు.
‘అలాగా? ఎన్ని రోజులయింది?’
‘చాలా కాలం అయింది. రెండు పుట్టిన రోజులు పుట్టినప్పుడు బట్ట కట్టలేదన్న సూత్రాన్ని పాటించాను సార్…’
‘వెరీ గుడ్!’
‘అంటే రెండు సంవత్సరాలు గడిచాయి. మందులు వాడుతున్నాను. ఉపయోగం లేదు. ఎంత కాలం బట్టలు లేకుండా ఉండాలి? ఇప్పుడు మీతో ఫోనులో కూడా అలానే మాట్లాడుతున్నాను సార్. దయ చేసి ఏమీ అనుకోవద్దు!’
‘అనుకునేందుకు ఏమీ లేదండీ. మీరు మాకు కనపడరులేండి.కాకపోతే మీ బాధ కనిపిస్తోంది.’
‘అయ్యా…ఆదుర్దా గారూ, నాకు పరిష్కారం చెప్పండి ‘
‘   మీరు నేలను కౌగిలించుకోవాలి సార్!’
‘ ఆయో!’
‘మీ ఇంటిలో నేలకు దగ్గరగా అంటే పొట్టిగా ఉండే మంచాలున్నాయా?’
‘ఆ…హాలులో ఒక దివాన్ ఉన్నది సార్!’
‘అదీ! అస్సలా…దాని మీద పడుకోండి.దాని మీద ఏ బట్టా ఉండకూడదు!’
‘మా ఇంటిలో ప్రస్తుతం దేని మీదా ఏ బట్టా లేదు. బ్రతికుంటే బట్ట కడతాను. ఏదైనా చెప్పండి. బ్రతికి బట్ట కడతాను సార్!’
‘భయపడకండి. నా చేతిలో మహిమ ఉన్నదని స్వామీ నిగూఢ గోళ్లానందుల వారు చెప్పారు.’
‘వాడెవడు?’
‘తప్పు! ఆయన అనాలి. వారు తీవ్రమైన దురదదురదలోకి అవలీలగా జారి గోక్కోకుండానే సమాధిలోకి వెళ్లేవారు. ఆయన గోళ్లు చాలా పొడుగు. రెండు సార్లు భూమిని చుట్టి రాగలవు!’
‘సార్! నా దురద…’
‘దివాన్ మీద పడుకో! రాత్రి దురద పుడుతుంది.’
‘అయ్యా…’
‘అప్పుడి క్రిందికి దిగకుండానే దాని క్రిందికి జారి దూరాలి.దూరి గోడ వైపు తక్కువ చోటు ఉన్న వైపు నుండి ఇవతలికి రావాలి!’
‘  సార్, దివాన్ గోడకి తాకుతూ ఉన్నది…’
‘అదే! అందుకే అటువైపు ఉపయోగించాలి…ఈ రోజే ప్రయత్నించండి!’
‘ చాలా థాంక్స్ సార్! నమస్కారం!’
‘ఆదుర్దా గారూ…’
‘చెప్పండి!’
‘ఆదుర్దా, దురద గురించి మనం చర్చ ప్రారంభించే ముందు ఒక చిన్న బ్రేక్…’
‘అలాగే…’
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే!)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: