‘రాజ్ నీతి’ చిత్రం పై వేదాంతం శ్రీపతిశర్మ సమీక్ష


‘ఏది   ఇందులో  ఉన్నదో  అదియే అంతట  ఉన్నది, ఏది  ఇందులో  లేనిదో  అది  ఇంకెక్కడ   లేనిది ‘ అని భారతం  లో   వ్యాసుల  వారు  చెప్పి  యున్నారు.ఈ  కథను  అనుసరించి వచ్చిన   పలు   చిత్రాలను    మనం  చూస్తూ  వచ్చాం.’మన  ఊరి  పాండవులు ‘ ఒక   పల్లెటూరు   నేపథ్యం  లో     అల్లిన  చక్కని  చిత్రం. హిందీలో     ‘కల్ యుగ్ ‘ ఒక  కార్పొరేట్  వ్యవస్థ  నేపథ్యంలో  చూపించిన  మరో  భారతం. శశి కపూర్, రేఖా, రాజ్  బబ్బర్      ఇందులో  మంచి  ప్రదర్శనలు  ఇచ్చారు. ఒక  ‘వ్యాపార  ‘  సామ్రాజ్యం   లోని  వ్యవహారాన్ని   భారతంలోని  పాత్రలతో   అల్లి  ఎంతో    నేర్పును  కనబరచారు  దర్శకులు  శ్యాం   బెనెగల్. భారతంలో  ప్రధాన  పాత్ర   ఎవరు    అనేది  తెలియకుండా   ఉంటేనే  అద్భుతంగా  ఉంటుంది.    అలా  కాకుండా  ఆ  కాన్వాస్ ను  కుదించి  కొన్ని  పాత్రలను  సామాన్యునికి  దగ్గరగా  తెచ్చి  సమకాలీనమైన   పరిస్థితులకు  అద్దం   పట్టే  ప్రక్రియలు    కూడా  కొన్ని  వచ్చాయి.  కర్ణుడిని  ప్రధానంగా  ఎంచుకుని  తీసిన  చిత్రాలలో   మణిరత్నం  గారి  ‘దళపతి ‘ ఒకటి. సామ్రాజ్యం    ఏది? అనే  ప్రశ్న    మీద   ఇతివృత్తం  సాగిపోతూ     వస్తుంది…

సాధారణంగా  ఇప్పటి  ప్రేక్షకులకు  పోలికలు  చెప్పక్కరలేదు. నేపథ్యమూ     సృష్టించక్కరలేదు. మరో  సారి   ఒక    మహాభారతం …   సమకాలీన  రాజకీయాలను, వారసత్వపు  వ్యవహారాలను  ఎంచుకుని  ఈ  ప్రజాస్వామ్యం  కూడా  ఈ  గొడవేనని  చెబుతున్నట్లు  కనిపిస్తుంది  ప్రకాశ్  ఝా  నిర్మించిన  చిత్రం  ‘రాజ్ నీతి ‘.

ప్రకాశ్  ఝా  ఈ  చిత్రాన్ని  నిర్మించి, దర్శకత్వం  కూడా    వహించారు. కథ  కూడా  ఆయనదే. స్క్రీన్ ప్లేలో  అంజుం    రాజబలి పాలు పంచుకున్నారు.

కథలోకి  వద్దాం…

భాను  ప్రతాప్  అనారోగ్యం  వలన  పార్టీని  తమ్ముడైన  చంద్రప్రతాప్ కు  అప్ప చెబుతాడు.  చంద్ర ప్రతాప్  భార్య  భారతి  కొద్ది  కాలం  క్రితం  పెండ్లి  కాకుండా   ఉన్నప్పుడు  ఒక  కామ్రేడ్  (నసీరుద్దీన్) వలన  ఒక  కుమారుడిని  కని  గంగలో  వదిలేస్తుంది. అతను  కబడ్డీ  ఆటగాడు  (అజయ్  దేవ్ గణ్) ఒక  దళితవాడలో  పెరుగుతాడు. చంద్రప్రతాప్  వారసుడు    పృథ్వి  ప్రతాప్, భానుప్రతాప్  వారసుడు  వీరేంద్రప్రతాప్ కు  మధ్య  ఘర్షణ  కథను  ముందుకు  తీసుకుని  వెళుతుంది. వీరేంద్ర ప్రతాప్  ఈ  ఘర్షణలో  సూరజ్  (అజయ్ దేవ్ గణ్) ను  కలుపుకుని  ముందుకు  వెళతాడు. చ్  హంద్రప్రతాప్  హత్య  తరువాత  ప్రతీకార  చర్యలతో  చిత్రం  సాగిపోతుంది. పృథ్వీ  తమ్ముడు  సమర్ ను  ప్రేమించిన  ఇందు   (కట్రినా)  ఇదే  ప్రతీకార  వ్యూహంలో  సమర్  అన్నను  వివాహమాడుతుంది. సమర్  అమెరికా  ప్రియురాలు  సారా  ఈ  దేశం వచ్చి  కూర్చుంటుంది. సమర్  తన  అన్న, గర్భవతి  అయిన  తన  భార్య సారా   హత్య  జరిగిన  తరువాత  ఇందు  చేత  పోటీ  చేయించి  పార్టీని  గెలిపిస్తాడు. ఒక  పాత  ఫాక్టరీ లో  ఇ.వి.ఎం  లు  హాకింగు  చేస్తున్నట్లు  పుకారు  పుట్టించి  మామ   బ్రిజ్ (నానా  పాటేకర్) తో   కలసి   వీరేంద్ర  ప్రతాప్, నిరాయుధుడయిన  సూరజ్  ను  హతమారుస్తాడు. సర్వస్వం  కోలుపోయిన  ఒక  మహిళ (కట్రినా) కు  జరిగే  న్యాయమిదేనా  అనే  ఒక  ప్రాతిపదిక  మీద  పార్టీ  గెలుపొందుతుంది.  తాను  గర్భవతినని  ఇందు  అమెరికాకు  వెళుతున్న సమర్  తో  చెబుతుంది.(వారసుడు  తయారవుతున్నాడు!)అదీ కథ.

ఈ  చిత్రంలో  స్క్రీన్ ప్లే  చాలా  బాగుంది.  మొదలు  నుంచి  చివరి  వరకు  జరుగుతున్న   పోటీ  బాగానే  ముందుకు  వచ్చింది.  మామ  బ్రిజ్ పాత్రలో    నానా  పాటేకర్  నటన  బాగుంది. ముఖ్యంగా   చిలిపిగా  నవ్వే  వ్యవహారం  ఆకట్టుకుంటుంది. నానా  పాటేకర్  ఇటీవల  ప్రదర్శిస్తున్న  కంట్రోల్  అతని  వయసును, మెచ్యూరిటీని  ప్రతిబింబిస్తుంది. నసీరుద్దిన్  పాత్ర  ప్రారంభంలో   తప్ప   ఎక్కడా   కనిపించదు.  పృథ్వీ,  సారా  చనిపోయిన  దృశ్యం, ఆ  కారులో  పేలిన  బాంబు  దృశ్యం,  చిత్రీకరణ,  ఆలోచింపచేసాయి.

ఈ  చిత్రానికి కొన్ని  సమస్యలున్నాయి. తెర  మీద   ఒక  ప్రక్రియ    ప్రారంభం  అయ్యే  ముందు  దాని  ఇతివృత్తం  ఏర్పడటం  చాలా  అవసరం. అది  జరగలేదు. ఆ  కారణంగా  తోలుబొమ్మలాట  అయి  కూర్చుంది.  రాజనీతి ఒక  ప్రక్క, వ్యక్తిగతమైన  ప్రతీకారం    మరో   ప్రక్క   అయినప్పుడు   రెండిటినీ  మేళవించి  ఒక  చోట  సమకాలీనమైన  రాజకీయాలలోకి  తేవాలంటే  ప్రజలకీ, ఆ  పాత్రల  లోగుట్టు  వ్యవహారానికీ  మధ్య  ఒక తెర ను  ఏర్పరచి  దానిని  కదిలించటంలో  దర్శకుని నైపుణ్యం  కనిపిస్తుంది. అది   పూర్తిగా  లోపించింది. అందు  చేత  సూరజ్ ను  హత  మార్చటానికి  మామ  బ్రిజ్ (నానా  పాటేకర్) స్వయంగా   గన్   పట్టుకుని  అతని ఇంటిలోకి  దూరటం  చూపిస్తాడు  దర్శకుడు. ఆ  పాత్రను  అక్కడే  చంపేశాడు!    మీడియాను  సరిగ్గా  చిత్రీకరించలేదు.  నేపథ్య  సంగీతం  బాగుంది  కానీ   కొన్ని  మంచి  పాటల  గురించి    ఎందుకు  యోచించలేదో   తెలియలేదు.

ఇటువంటప్పుడు  ఒక  రాజకీయ  సంఘటనను  మూలస్తంభం గా  ఎంచుకుని  ముందుకు  వెళ్లటమో  లేక  ఒక  పాత్రను  ముందుకు  తెచ్చి  దాని  చుట్టూ   పరిస్థితులను  అల్లటమో  చేస్తే  పని  సులభమవుతుంది. ఒక  బొమ్మకు  బార్డర్  ఎంత  ప్రధానమో  ఒక  రూపకానికి  కూడా   మూలస్తంభాలు  అంతే  ప్రధానం.   అది  లేకపోవటం   వలన   అజయ్  దేవ్ గణ్  పాత్ర  తేలిపోయింది. కర్ణుడి  ప్రతిభ  నలుగురిలోకీ  ముందుకు  వచ్చిన  తరువాత  దుర్యోధనుడు  అతనితో    మైత్రి  చేస్తాడు. ఇక్కడ  సూరజ్  అనే  వాడు  ఎందుకు  రాజకీయంగా  బలవంతుడు  లేదా  వ్యక్తిగతంగా  శక్తిశాలి  అనే  మాట  ముందుకు  రానే  లేదు. పాత్ర  చిత్రీకరణ  సరైనది  కాదు.  మణిరత్నం  గారి  ‘ఇద్దరు ‘ చిత్రంలో  ఆ  ఇద్దరూ  ఎవరో   మనకు   తెలిసినా   వారి  కలయిక  ఎందుకు, ఎలా  ఏర్పడింది, ఎలా  ముందుకు  సాగిందీ, పరిస్థితులు   ఎలా మారుతాయి…ఇవి  అద్భుతంగా  చిత్రీకరించటం  జరిగింది. వాస్తవాలకు  దగ్గరగా  ఉండటం  ఇటువంటి  చిత్రాలకు  చాలా  అవసరం. వీరేంద్ర  వర్గం   నామినేషన్లు  చిన్న  పొరపాట్ల  వలన  రిజెక్ట్  అయిపోవటం  హాస్యాస్పదంగా   ఉంది. అతను  అంత  చేతకానివాడిగా  ఉన్నప్పుడు  అంత  పెద్ద  ప్రతినాయకుడు  ఎలా   అవుతాడు?

ఈ  దర్శకుడు  1930,40 లలో  ఇటలీలో  వచ్చిన  కొన్ని నియో రియలిస్టిక్  చిత్రాలను, వాటిలోని  వైపరీత్యాలను  పరిశీలించి  చూస్తే  ఒక  సారి  ఈ  తోలుబొమ్మలాట  వ్యవహారం  నుండి  బయట  పడగలగుతాడు. ఏ   పనయినా  సమగ్రంగా  చేయగలిగితే  మంచిది. లేకపోతే  గాడ్ ఫాదర్  చిత్రం  నుంచి లాక్కున్న   కేవలం  ఒకరిద్దరి  పాత్రల  చిత్రీకరణ  మిగులుతుంది (ఈ  చిత్రం లో  చేసినట్లు). అది  అతకదు.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: