‘ రాత్రి’-వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


కోర్టు ఆవరణ చిత్రంగా ఉన్నది. నీడ లేనందున అక్కడక్కడా పెరిగి ఉన్న చెట్ల క్రింద కొందరు కూర్చుని ఉన్నారు.కుటుంబ కోర్టు భారతీయ వైవాహిక వ్యవస్థకు అద్దం పట్టినట్లు అలా ఎండలో మాడుతోంది!
ఒక వృధ్ధుడు, ఆయన ప్రక్కన ఇద్దరు అమ్మాయిలు,ఎవరో మగ మనిషి అలా కూర్చుని ఉన్నారు.
‘బెయిల్ వస్తుందా? ‘,అడుగుతున్నాడు ఆయన.ఆయన మిత్రుడు కాబోలు, చేతులు కట్టుకున్నాడు.
‘వస్తుంది కానండీ ఈ రోజే వస్తుందని చెప్పలేము.న్యాయమూర్తి కూడా మహిళే!’
‘అయితే?’
‘ఇటువంటి చోట ఎంచుకుని నియమిస్తారు.’
‘మన లాయరు కూడా మహిళే కదా?’
‘మహిళ కాని వారు ఎవరండీ?’,ఆయన నవ్వాడు.
కొద్ది సేపు అంతా నిశ్శబ్దంగా ఉంది.లోపల ఏమవుతోందో ఎవరికీ తెలియదు.కుర్రాడొకడు టీ తెచ్చి చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పూలో పోసి ఇస్తున్నాడు. అటువంటివి ఎన్ని తాగి ఉంటారో!ఆడ పోలీసులు, మగ పోలీసులు అలా అటూ ఇటూ తిరుగుతున్నారు.
‘మన లాయరు గట్టిదేనా?’
‘ఎందులో?’
‘…అలా కాదు.మేటర్ చెప్పి కన్విన్స్ చేయగలదా?’
‘ సార్, కన్విన్సింగు అలాంటివి కాదు.అంతా కాగితం మీద ఉంటుంది.ఈ సెక్షన్లను వాడుకుని బేరాలకొచ్చే రోజులు.అవి ఏర్పరచిన నేపథ్యం వేరు…’
‘హింస అంటే ఏమిటి సార్?’
‘ఇది కాదా?’
‘సరే! అలా అనుకుంటే ఏదైనా అవ్వచ్చు.నన్ను అనుమానంగా చూడటం కూడా హింసే!మట్లాడకపోవటం కూడా హింసే! అత్త మామలు కలసి ఉన్నా హింసే!’
‘అలా కాగితం మీద ఉంటుందా?’
‘మంచోరే!అలా ఎందుకుంటుంది?కాగితం చక్కగా సెక్షన్లకు అణువుగా తయారవుతుంది.’
‘మరి కాగితం బట్టే కదా విచారణ?’
‘ఇప్పుడు పాయింటుకు వచ్చారు.’
‘నాకు భయంగా ఉంది.ఈవిడకు అసలే బి.పి. వయసు ఏమైనా తక్కువా?’
‘…’
‘ఆ అమ్మాయి ఈ పథకంలో ఉన్నదని తెలియదు సార్.ముందరే మాట్లాడుకునే వాళ్లం.’
‘మళ్ళీ పొరపాటు పడ్డారు సార్!మాటలు అనే సరికి ఎవరో పెద్దమనుషులు,ఇలా కాదు అలా కాదు అంటూ మొదలెడతారు.న్యాయం, ధర్మం,సీత, సావిత్రి,పెద్దలు, వంకాయలు…ఇలా ఉంటుంది.’
‘కోర్టు న్యాయం చెబుతుందా?’
‘ ఏ కోర్టూ ఏ న్యాయమూ చెప్పదు.సహజమైన న్యాయం జరిగే ప్రక్రియలో కోర్టు ఒక పాత్ర పోషిస్తుంది.’
‘మీరు కోర్టును నమ్ముతారా?’
‘ఇదేమిటి? మనం ఉన్నది ఎక్కడ?’
‘నిజమే! అయితే మటుకు?’
‘నమ్మీ నమ్మక…ఎవరికి కావాలి.అక్కడ న్యాయమూర్తికి నిజాలు తెలియవంటారా? ఆవిడ ఈ కోర్టును నమ్ముతున్నదా?’
‘…’
~~~***~~~
లోపలి నుండి ఒక బృందం బయటకు వచ్చింది.ఆడ పోలీసులు ముసలామెను పట్టుకుని నడుస్తున్నారు.ఆడ లాయరు దగ్గరగా వచ్చింది.
‘సార్,అంతా బాగానే జరిగింది.చాలా సహనంతో ఆర్గ్యుమెంట్స్ విన్నారు.బెయిల్ ఇస్తామన్నారు కానీ పెద్దామెను మటుకు రిమాండులో ఈ రాత్రి ఉంచమన్నారు.’
పెద్దాయన ఉలిక్కి పడ్డాడు.’ఏమిటండీ?ఈమే ఏమయినా కసబ్ అనుకుంటున్నారా? ఎక్కడికి పారిపోతుంది? ఏమిటండీ అసలు…వాట్ నాన్ సెన్స్?’
లాయరు చేయి అడ్డు పెట్టింది.’తొందర పడకండి.తరువాత వివరాలు చెబుతాను.ఈ ఒక్క విషయంలో ఆ వైపు వాళ్లు పట్టు పడుతున్నారు…’
అమ్మాయిలు అమ్మ దగ్గర నిలబడి ధైర్యం చెబుతున్నారు.ఆడ పోలీసులు ఆవిడ గాజులు వగైరాలు తీయమని అడుగుతున్నారు.వారి పూచీ కాదన్నారు.
‘ఈ ఒక్క రాత్రే! ఏమీ ఉండదండీ.వాళ్లు చాలా మర్యాదగా చూసుకుంటారు. ఏమీ వర్రీ లేదండీ..’,లాయరు చెబుతున్నది.
ఆవిడ ఏమీ మాట్లాడటం లేదు. చాలా సహనంతో గాజులు తీసి వాళ్లకు ఇస్తోంది. అమ్మాయిల కళ్లల్లో నీరు తిరుగుతున్నది.ఒక అమ్మాయి అటు తిరిగిపోయింది.పెద్దాయన చెట్టు క్రింద కూర్చుని నిట్టూర్చాడు.మిత్రుడు భుజం మీద చేయి వేశాడు.
ముసలావిడ మాట్లాడకుండా రిమాండు వైపు నడిచింది.
ముసలాయన అడుగుతున్నాడు,’ఎలా ఉంది అది?బి.పి….’
‘బాగానే ఉన్నారు సార్…బాధ పడకండి.ఒక్క రాత్రే!ఎంత సేపు?’
ముసలావిడ వెనుక ఒక అమ్మాయి పరిగెట్టింది.’అమ్మా…’అని గట్టిగా అంది.
ఆవిడ ఊరకే తల పైకి ఎత్తింది.’ఏడవకు…’,చాలా చిన్నగా చెప్పింది,’…నన్ను చంపేయరు కదా? ఉరి తీయరు కదా?’
‘అది కాదమ్మా…’,దాదాపు ఏడుపుగానే ఉంది అమ్మాయి గొంతు.
‘ఊర్కో చిట్టీ,ఒక్క రాత్రికి ఇంత బాధా? ఊరుకో! మీ అన్నయ్య ఎన్ని రాత్రులు నరకం అనుభవించాడో తెలుసా? నీకు తెలియదు.ఈ రాత్రితో నా బిడ్డకు అర్థమవుతుంది.ఈ తల్లి ఆ మాత్రం చేయలేదా వాడికి?’
అమ్మాయి తమాయించుకుంది.’అమ్మా…’
‘ఊరుకో తల్లీ…లోపల వాదన అంతా విన్నాక నేను తెచ్చుకోవలసిన న్యాయం నాకు అర్థమయింది.నేనేమీ పిచ్చి దాన్ని కాను. నాన్నను ధైర్యంగా ఉండమని చెప్పు.’
పోలీసులు పదమంటున్నారు.
ఆవిడ ఎందుకో చిరునవ్వు నవ్వింది,’ మన వ్యవస్థకు పట్టిన కాళరాత్రి ఇది.ఎంతసేపు,అదే తెల్లారుతుంది…’
~~~***~~~
(జరిగిన కథ ఆధారంగా…)
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: