సుబ్బారావుకు అరుగు మీదే సాహిత్య అకాడమీ!-వేదాంతం శ్రీపతిశర్మ


సంక్రాంతి రోజున పొద్దున్నే సుబ్బారావు మరల అరుగు మీదకు వచ్చాడు. ఈ రోజు వాకిళ్లు కళ కళ లాడిపోతున్నాయి.అమ్మాయిలు రథం ముగ్గులేసేస్తున్నారు.గొబ్బెమ్మలు పెడుతున్నారు. సుబ్బారావు ఛలికి వెనకాడలేదు!

‘ఈ రోజు కాఫీ కూడా అక్కరలేదన్నమాట!’ ప్రక్కనే వాళ్లావిడ కప్పుతో నిలబడి ఉంది!

‘అంటే? అదేవన్నమాట?’

‘ఇంత చక్కని దృశ్యాలు కనిపిస్తున్నాయి కద? అసలు సమయం తెలుస్తోందా?’

‘అన్యాయం.అరుగు మీదకి నేను రోజూ వస్తాను. వాళ్లు ఇవాళ వచ్చారు.ఆలోచించు!’ ఆవిడ కూర్చుంది.

‘ముగ్గులు బాగున్నాయి…’

‘చూశావా?అదీ సంగతి!అసలు ముగ్గు అనే సంప్రదాయం ఎందుకొచ్చిందో తెలుసా?’

‘అస్సలు తెలియదు. ఈ అరుగు మీద ఏమైనా తెలిసినా చెప్పదలచుకోలేదు.’

‘అదేమిటి?’

‘ఈ అరుగు మీద ఎప్పుడు ఏమన్నా ఎలా ఉంటుందో తెలియదు.’

‘ఇంతకీ నీ బాధ ఏమిటి?’

‘ద్రౌపదికి సాహిత్య అకాడమీ ఇచ్చారు.’

‘అయితే?’

‘రేపు ఇంకొకడు అసలు సీత కూడా పర్ణశాలనుండి లక్ష్మణుడిని వేరే కారణాల వలన పంపించింది అంటే ఈ అవార్డు ఇచ్చేస్తారా?’

‘ఇవ్వరు!’

‘ఎందుకు?’

‘ఈ అవార్డు ఇవ్వరు.భారతరత్న ఇస్తారు.’

‘ఓహో! ఎందు వలన?’

‘అద్భుతమైన విషయాన్ని బయటికి లాగి విశేషమైన సృజనాత్మకతను చూపించినందుకు!స్త్రీల స్వాతంత్ర్యం గురించి కూడా పోట్లాడినందుకు!’

‘ బాగుంది. నవ్వుతరు ఎవరైనా!’

‘ఎవరూ నవ్వరు! కాముకత్వం నేరమా? అని పోట్లాడుతారు!’

‘ఛా!’

‘అవును మరి.ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కూర్చుని కాఫీ తాగుతుంటే అమ్మాయిలను చూడటానికని సరదాగా అంటే క మాట!అదే అసలు ముగ్గులు అమ్మాయిలు ఎందుకు వేస్తారు? అబ్బాయిలు చూసేందుకే అంటే అమ్మాయిలందరూ ఒప్పుకుంటారా?’

‘అలా ఎలా ఒప్పుకుంటారు?’

‘కరెక్ట్!అక్కడ ఆ అమ్మాయిని చూడు.క్రిందటి సంవత్సరం ముగ్గు వేస్తే ఎవరూ చూడలేదట!అందుచేత ఏకంగా అయిదు ముగ్గులు వేస్తోంది!’

‘ఛా! అంటే అయిదుగురు అబ్బాయిలైనా చూడాలనా?’

‘అదుగో అయిదుగురు కాదు.పదికి పైనే పై నుంచి మరీ చూస్తున్నారు!’

‘ ముగ్గు   లోకీ  లాగటం అంటే ఇదేనా?’

‘ముగ్గు,గొబ్బెమ్మ,పేడ లోకీ లాగటం అంటే ఇదే!’

‘మన అదృష్టం బాగుంది!’

‘ఎందుకు?’

‘యార్లగడ్డ ఈ వీథిలో ఉండడు!’

‘ఆయన సృజనాత్మకతను అంతగా ఆడిపోసుకు చిట్టీ!ఆయన అమ్మాయిల ఔన్నత్యాన్ని వారి కాముకతతో చెబుతున్నారు!’

‘ఇది మరీ బాగుంది.’

‘అవును మరి!అక్కడ ఆ అమ్మాయి అలా కష్ట పడి చక్కగా ముగ్గు వేస్తోంది చూడు,ఎందుకనుకున్నావు?

‘ఎందుకండీ?’

‘ఇంత మంది చూస్తున్నా,ఇంత చెమట పడుతున్నా ఎందుకు ముగ్గు వేస్తున్నదంటే అసలు ఆమెకు ఇంతవరకూ వివాహం కాకపోవటం వలన, ఆమెను ఇంటిలో బంధించివేయటం వలన ఆ ముగ్గనే ప్రక్రియ ద్వారా ఒక నిరసనను వ్యక్తపరుస్తున్నది!’

‘ఏమిటి? ముగ్గు ద్వారానా?’

‘అవును మరి!అది రథం ముగ్గు.అందులో గొబ్బెమ్మలను బంధించి మమ్మలను గొబ్బెమ్మలను చేసి ఇంటిలో ఉంచారని చక్కగా చాటింది!మా మనోరథం సాగటంలేదని అందంగా చెప్పింది.’ ‘ఈ ముగ్గు భాష్యం ఎక్కడా వినలేదు!’

‘మరి? అదే సృజనాత్మకత అంటే!

‘ ‘ఎవరో వస్తున్నారండీ…’

ఇద్దరూ అటు తిరిగారు.ఇద్దరు ప్రభృతులు, ఒక మహిళ దగ్గరగా వచ్చారు. ‘నమస్కారం.’

‘నమస్కారం.’

‘మీ పేరండీ?’ ‘సుబ్బారావు.ఇది నా అరుగు!’

‘కరెక్టే!ఇంత అద్భుతమైన వ్యాఖ్యానం ఇంతవరకూ ఎక్కడా చూడలేదు.ఇది భారతీయ మహిళ, ప్రత్యేకంగా తెలుగు వనితల పట్ల ఒక వినూత్నమైన వ్యాఖ్య.మిమ్మల్ని సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంచుకున్నాం.మీరు సంక్రాంతి ముగ్గు అనే పుస్తకాన్ని వ్రాసి వచ్చే సంవత్సరం సంక్రమణం…కాదు సంచలనం సృషించాలి!’

సుబ్బారావు ఇంటిలోకి పరుగు తీశాడు.వాళ్లావిద కూడా లోపలికి వచ్చి తలుపులు వేసేసింది.వాళ్లు తలుపు రెండు మూడు సార్లు కొట్టి వెళ్లిపోయారు. కిటికీలోంచి తొంగి చూసి ఆవిడ అప్పుడు తలుపు తెరచింది.

‘అంత గాభరా ఎందుకు? మనకు అవార్డే కదా ఇస్తానన్నారు?’

‘ఇంకా నయ్యం!కాసేపుంటే నన్ను పట్టుకుని కాముకురాలని చెప్పి మీరు అణగదొక్కరని చెప్పి నా చేత ఆత్మకథను వ్రాయమనే వారు! వీళ్ల మొహాలు తగలెయ్య!’

‘ఎంత మాట! మంచి పని చేశావులే!అరుగు పెద్ద డేంజరు!’

~~~***~~~

కొద్ది సేపు అయిన తరువాత తలుపు దగ్గర చప్పుడయింది.బంధువులేమోనని తలుపు తీశారు.అక్కడ కాళికాదేవి రెండు చేతులలో రెండు పాత్రలు పట్టుకున్నట్లు ఎదురింటి అమ్మాయి రెండు చేతులలో చెరో గొబ్బెమ్మను పట్టుకుని ఉంది.

‘నేను మీకు గొబ్బెమ్మ లాగా కనపడుతున్నానా?’

సుబ్బారావు వాళ్ల ఆవిడ వైపు చూశాడు. ఆవిడ తగులుకుంది,’ఏంటి ఆ చూపు? నేనలా కనిపిస్తున్నానా?.అమ్మాయికి సమాధానం చెప్పండి!’

‘తల్లీ! నేనేమీ అనలేదు!’

‘ఏంటి? అనలేదా?వాళ్లు…’

‘ఎవరు?’

‘అకాడమీ వారుట. చెప్పారు!’

‘ఏమి చెప్పారు తల్లీ?’

‘అసలు సంక్రాంతి ముగ్గు అనే సంప్రదాయం అమ్మాయిలు అబ్బాయిలను ఆకర్షించేందుకే అని చెప్పారుట?’

‘అయ్యో…’

‘అమ్మాయిల కాముకత్వం ఈ విధంగా బహిర్గతం చేస్తారుట?’

‘తల్లీ…’

‘మీ ఇంటికి అటూ ఇటూ రెండు గొబ్బెమ్మలను ఇప్పటికే కొట్టి యున్నాను…’ అటూ ఇటూ చూశారు. ఎలక్ట్రిక్ మీటరు వాడు వ్రాసి పోయినట్లు రెండు సంక్రాంతి గుర్తులు కనిపిస్తున్నాయి. ‘నేనేమీ అనలేదు తల్లీ…ఆ అకాడమీ వారికి ఏదో దయ్యం పట్టింది. ముగ్గు బాగుందీ అని మేము మాట్లాడుకుంటుంటే ఇలా వచ్చి మా ప్రాణాలు తీశారు.లోనకి పరుగు తీశాం. చెప్పవే చిట్టీ…’

‘అవునమ్మా, మీ అంకుల్ అలాంటివి ఏమీ మాట్లాడలేదు!’

‘సరే! ఆంటీ మాట విని వదిలేసున్నాను.’ అమ్మాయి వెళ్లి పోయింది.వెళ్లింది కదా అనుకునే లోపల వాళ్ల నాన్న వచ్చాడు. సుబ్బారావు వెర్రి నవ్వు నవ్వాడు.

‘సంక్రాంతి శుభాకాంక్షలు సార్!’

‘అది ఓకే గానీ నేను మా అమ్మాయిని ఇంటిలో పెట్టి తలుపులు తాళం వేస్తానా?’

‘అని ఎవరన్నారు సార్?’

‘ఆ ముగ్గురు!’

‘ఛా! ఖర్మ! నేనలా అనలేదు.మా ఆవిడని అడగండి.’

‘బాగుంది.అన్నిటికీ ఆవిడ దొరికింది!’

‘ఏమిటండీ వాగుతున్నారు?’,సుబ్బారావు భార్య ఈ సారి గట్టిగా అడిగింది.

‘అద్దీ! అలా అడుగు.ఇలా అడక్కపోయే సరికే అందరికీ మన ఆడవాళ్లు, స్త్రీ పాత్రలతో సహా అలుసు అయి కూర్చున్నారు!’

‘ఏమీ లేదండీ.ఊరకే నిర్ధారణ చేసుకున్నాను.డాబా మీదకి ఎక్కి ముగ్గురు మీదావీపుకు తగిలేటట్లుగా మా అమ్మాయి అందించిన చెరో గొబ్బెమ్మా విసిరి కొట్టాను!’

‘తగిలాయా?’

‘తగలక? సూటిగా తగిలాయి. మన క్రికెట్ ఆటగాళ్లు మన దగ్గర నేర్చుకోవాలి!’

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “సుబ్బారావుకు అరుగు మీదే సాహిత్య అకాడమీ!-వేదాంతం శ్రీపతిశర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: