‘వేదిక మీద అలంకరణ’-బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు సభ మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


ప్రారంభ సభకు వెళ్లి వచ్చిన తరువాత ఈ బ్లాగులో,ఆంగ్ల వెబ్ సైటులో కొన్ని విషయాలను చర్చించటం జరిగింది.అక్కడితో ఆ విషయాన్ని వదిలేశాను. కానీ నా మిత్రుడికి పట్టుదల ఎక్కువ. ‘సార్, ఈ సారి మీరు చెప్పిన పొరపాట్లను దిద్దుకున్నాము, వచ్చి చూడండి ‘, అన్నాడు. సరేనని వెళ్లి కూర్చున్నాను.నిజంగానే ఈ సారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లున్నారు. రోశయ్య అంకుల్ ఇలాంటివి లేవు. చిత్త శుధ్ధికి సంతోషించాను.ఒక చోట మటుకు కొద్దిగా నవ్వొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రముఖులు పార్థసారథి గారిని వేదిక ‘మీద అలంకరించవలసినదిగా ‘ కోరారు! ఆయన పైకి వచ్చి ఏమి అలంకరించాలోనని చూశారు. అర్థం కాక ఆయన చెప్పదలచుకున్నది చెప్పి దిగిపోయారు. కార్యక్రమం తరువాత కనుక్కున్నారేమో మరి!
ఇంతలో రామా నాయుడు గారిని రమ్మన్నారు. ఆయనను ఒక అవార్డు గురించ్చి మైకు ముందు పలకమన్నారు. ఆయన చిత్రం పేరులో ‘స్పీసీస్ ‘ బదులు ‘స్పైసెస్ ‘ అని పలికారు.అక్కడున్న అమ్మాయి ‘స్పీసీస్ ‘ అని గుర్తు చెసినట్లు చెప్పింది. అయినప్పటికీ ఆయన మరల ‘స్పైసెస్ ‘ అనే నొక్కి వక్కాణించారు.తెలుగు చలనచిత్రాలు మసాలాలు (స్పైసెస్) తప్ప మరొక దాని వైపు వెళ్లవు అని సారు బల్ల గుద్ది మరీ చెప్పారు! నిజమే! తెలుగు నిర్మాతల స్పీసీస్ ఇంతే! మన రాట్నంలోనే తిరుగుతాం! ఇంకొకరి ప్రతిభతో మనకి సంబంధం లేదు!

కొద్దిగా ముందుకు వెళదాం…సినిమా పేరు చెబుతున్నప్పుడు ఆ నిర్మాత,దర్శకుడు,రచయిత,సాంకేతిక వర్గం,ముఖ్య నటులు…వీరి పేర్లు చెబితే ప్రాణాలు పోతాయా? మనకి జుహీ చావ్లా,ఇలియానా మీద ధ్యాస కంటే ఇవి ముఖ్యం కాదా? ఒక్క సారి ఆలోచించండి!

కార్యక్రమాన్ని లాగీ లాగీ తిరిగి షాహ్ రుఖ్ ఖాన్ నటించిన పాటల దగ్గర ఆపి గోల చేసి అవార్డు దక్కిన సినిమా ఎప్పుడో గానీ చూపిస్తే అందులో అర్థం ఏమిటి? మధ్యలో ఓ కుర్రది వచ్చి ‘రాత్ బాకీ, బాత్ బాకీ, హోనా హై జో…’ అంటూ మొదలెట్టింది.పిల్లలు రెండు చేతులూ పైకి పెట్టి ఊగారు. ఆ బుల్లి తెర వీరుడు వచ్చాడు. దిక్కుమాలిన సినిమా పాట ఒకటి పట్టుకుని చండాలంగా అసభ్యమైన నాట్యం ప్రదర్శించి జుహీ చావ్లా నా ‘ఫేవరైట్ హీరోయిన్ ‘అని ఈలల మధ్య ప్రకటించి రోశయ్య గారి ఆశీర్వాదం కోరాడు! ఆయన మరేమీ చేయలేక ‘దగ్గరకి తీసుకుని ‘ మరీ ఆశీర్వదించాడు!

భారతీయ నృత్య సంప్రదాయంలో-ఏ పధ్ధతి అయినా తీసుకోండి-ఈ పెల్విక్ గైరేషన్ నిషిధ్ధం అన్న సంగతి, సినీ గీతాలలోని ద్వంద్వార్థాల చెత్తని మంచి సందర్భం ఉన్న వేదిక మీదకి తీసుకురావటం కేవలం చెత్త మనుషులు పిల్లల చేత చేయించే పని అని ఇందు మూలంగా నేను మరో సారి చెబుతున్నాను. మన జానపద నృత్యాలలో కూడా నడుమును ఒక స్వింగులో కదపటం ఉంటుంది కానీ ఈ పాశవిక ప్రక్రియ మన గ్రామ్య వ్యవస్థలో కూడా లేదు.అప్రాచ్యమంటే ఇదే!నిజానికి ఇతర దేశాలలో కూడా ఒక చిత్రమైన సందర్భం నుంచి ఇది వచ్చంది.
మెరిలిన్ మోన్రోకు మడమలూ, కాళ్లూ బలహీనంగా ఉండటంతో ఒక సారి ఆమె ఒక ప్రదర్శన ఇస్తూ ఏమీ చేయలేక శరీరం లోని ఆ భాగాన్ని కదపాల్సి వచ్చి అలా పలు మార్లు చేసిందని తెలుస్తున్నది. అదే ప్రాచుర్యం పొంది మనిషిలోని పశువు ఒక్క దెబ్బకి ఇవతలకి వచ్చాడు. వాడే ఈ రోజు కూడా ఈ రంగాన్ని మహిషాసురుడిలాగా ఏలుతున్నాడు!

బాలల చలనచిత్రాలకీ, బాలీవుడ్, టాలీవుడ్ రంగానికి చెందిన చెక్కమొహాలకీ (వుడ్),ప్రాచుర్యం కోసం చేసే ఈ చెక్కభజనకీ పెట్టిన ముడిని బలవంతంగా, ధైర్యంగా తెంపేసి ముందుకు వెళ్లగలిగిన రోజున బాలలకు నిజమైన స్వాతంత్ర్యం, భావ విన్యాసానికి సరైన బాట ఏర్పడతాయన్నది అక్షర సత్యం!

కాంగ్రెస్ పార్టీలోని వారికి ఒక లిఖితపూర్వకమైన ఉత్తర్వు ఉన్నట్లున్నది.ఎక్కడ నిలబడ్డా కనీసం ఒక్కసారైనా సోనియా గంధీ గురించి చెప్పమన్నారు. గీతా రెడ్డి గారు అదే చేశారు. ప్రారంభ సభలో అంబికా గారు చెప్పారు, ఇప్పుడు ఆ పని ఈవిద చేశారు.బాగుండదు కాబట్టి (అ)ప్రధాని పేరు కూడా అలా పలికేస్తారు…

అందరికీ ఒక రాజకీయ వేదిక కావాలి. అందరికీ ప్రాచుర్యం కావాలి.రాజకీయాలు, కీర్తి కాంక్ష, రెండిటికీ ఉన్న షార్ట్ కట్ అయిన సినీ రంగం,అదే సంస్కృతి అని నమ్మే ఈ తరం, భాషలోని కాలుష్యం, భావకాలుష్యం,ఆలోచన లేని మరుభూమిలో మరమనుషులలా సాగిపోయే గడ్డరికా ప్రవాహం…ఇది మన దేశం యొక్క రంగుల కాన్వాస్! ఇలా కాన్వెంటుల్లోంచి రోడ్డు మీద పడి పైశాచిక నృత్యాలు చేస్తూ ఎదిగిపోయి ఆఫీసర్లు అయిపోయి దొరబాబుల్లాగా తిరిగి మైకు పట్టుకునే ఈ నాటి బాలలలో కాదు….మన దేశం జెండాను చూస్తూ ఒక్క సారైనా మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనో, లేక లక్షణంగా జాతీయగీతాన్ని పాడే పల్లెల్లోని, పట్టణాల్లోని పేద విద్యార్థుల కళ్లల్లో, ఇళ్లల్లో మన దేశం యొక్క జీవాధారం ఇంకా మెరుస్తోంది. ఒక్క సారి జాగ్రత్తగా చూడండి…

~~~***~~~

ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఆర్. బి.ఐ ప్రక్కన కామత్ హోటల్ కి వెళ్లాలని రోడ్డు అటు ప్రక్క నుంచి దాటడం కోసం నిలబడ్డాను. క విదేశీ మహిళ అక్కడున్న బాదం పాలు అమ్మే వాడి దగ్గర భాష రాక తిప్పలు పడటం గమనించాను.ఆవిడ భాషను బట్టి కొద్దిగా ఫ్రెంచ్ లో మట్లాడి ఆవిడ బాధ తెలుసుకుని బాదం పాల దగ్గర సమస్యని సమాధాన పరచి అటు నడిచాను.ఆవిడ కూడా ఈ కార్యక్రమానికే వెళుతున్నదని తెలుసుకుని హోటల్ సంగతి ప్రక్కన పెట్టి ఆవిడతోనే అడుగులు వేసుకుంటూ వెళ్లాను. కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నాను. అన్నీ బాగున్నాయి కానీ చిన్న పిల్లలకు మీరు ఏర్పాటు చేసిన టాయిలెట్లు అలా ఉండవచ్చా అని ఆవిడ అడిగారు! ఆవిడ వెళ్లిపోయాక లలిత కళాతోరణంలోని ఆ ఏర్పాటు లోకి స్వయంగా వెళ్లి చూశాను….మన దేశం లోని కుళ్లు వ్యవస్థ సజీవంగా అక్కడే ఉంది…

కొద్ది పాటి సమయం తరువాత వేదిక మీదకు ఆవిడ నా ముందు నుంచే వెళ్లింది.ఆవిడ ఈ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న ఒక ప్రముఖ జ్యూరీ సభ్యురాలని తెలుసుకుని ఎందుకో చిరునవ్వు నవ్వుకున్నాను!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: