‘రోశయ్య అంకుల్..’-16వ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకలపై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


సామాన్యంగా సభలకు వెళ్లినప్పుడు మధ్యలోంచి లేచి వెళ్లటమూ మంచిది కాదు.అలా వెళ్లాల్సి వచ్చినపుడు ఇంకొకరు ఏమనుకుంటారా అనే ఆలోచనతో నేను సభలకు వెళ్లను. ఎప్పుడైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రముఖులకు దూరంగా కూర్చుని పాములా బయట పడటం అలవాటు.ఈ సారి ఒక సినీ ప్రముఖుడు తప్పనిసరిగా రావాలని తీసుకెళ్లాడు.భయంగానే వారందరి మధ్య కూర్చున్నాను.ఇంతలోనే సభ మధ్యలోంచి పెద్ద ప్రముఖులే గోల్డెన్ ఎలిఫెంట్…సామజము లాగా వెళ్లిపోవటం చూసి ఎంతో గుండె ధైర్యం తెచ్చుకున్నాను.
పిల్లలు వేసిన చిందులు బావున్నాయి. ఇద్దరమ్మాయ్లి-ఒకరు తెలుగు,ఒకరు ఆంగ్లంలో బుల్లితెర పధ్ధతిలో మైకు ముందు ఏంకరింగు చేశారు.
గుల్జార్ గారు హానరెబల్ ఛిల్డ్రెన్ అని ఎవరైనా స్పందిస్తారేమోనని చూశారు. మన వాళ్లకి ఇలియానా,వెంకటేశ్ ల మీద ఉన్న ధ్యాస  ఇటువంటి వాటి మీద ఉండదన్న సంగతి ఆయనకు అప్పుడే అర్థమయి ఉంటుంది. ఏదో నాలుగు ముక్కలు చెప్పి వారూ వెళ్లిపోయారు. నాకూ సినిమాల గురించీ, పిల్లల గురించీ ,పిల్లల సినిమాల గురించీ ఎంత తెలుఓ నందితా దాస్ గారికి కూడా అంతే తెలుసు! మా ఇద్దరికీ ఏమీ తెలియదన్న సంగతి మా ఇద్దరికీ తప్ప అందరికీ తెలుసు. అలా కాదు,మా ఇద్దరికీ కూడా తెలియదు అని మన్మోహన్ గారు, సోనియా గారూ తెలిపినట్లు చెప్పకుండానే అంబికా సోనీ గారు చెప్పారు! పట్టు మని నాలుగు నెలలు కాకుండానే నందితా అద్భుతాలు సాధించిందని, ప్రధాని, అసలు ప్రధాని ఇద్దరూ ఆమె మీద చూపిన విశ్వాసాన్ని నిలబెట్టిందని ఆవిడ సెలవిచ్చారు…
ఈవిడ మాట్లాడే ముందు దాసరి గారు వారి శైలిలో మొదలు పెట్టారు. వారిని గిన్నెస్ బుక్ రికార్డ్ హోల్డర్ గా ఎవరూ ఎందుకు పరిచయం చేయరని అరిచారు! తెలుగు సినిమాలను ఉపేక్షిస్తున్నారని నొక్కి వక్కాణించారు.అమూల్య అనే సినిమా 2007లో ఎంపికైనదని అంబికా గారు తరువాత గుర్తు చేశారు.
నందితా ఏమి మాట్లాడిందో పైన పేర్కొన్నట్లు నాకొక్కడికే తెలుసు. అది ఎందుకంటే ఆమె దేని గురించి ఎట్టి పరిస్థితులలో మాట్లాడలేదో తిరిగి నాకే తెలుసు!
అటు వెళుతున్న ఎన్.టి.వీ అమ్మాయిని అడిగాను,’ అమ్మా,ఏ సినిమాలు ఎక్కడ ఎప్పుడు ప్రదర్శింపబడతాయో ఒక పుస్తకం లాంటిది దొరికితే ఎక్కడ దొరుకుతుంది?’ అన్నాను.
‘ సార్, దొంగతనంగా ఒకటి సంపాదించాను. ఎక్కడా దొరకదు ‘, అని చక్కని సమాధానం ఇచ్చింది.
నా ముందు వరుసలో కూర్చున్న ఒక జ్యూరీ సభ్యుడు (విదేశీ వ్యక్తి) దాసరి గారి భావోద్రిక్తమైన ఆంగ్ల పదజాలానికి రెండు కళ్లూ విప్పార్చి భయపడ్డట్లు ఉన్నాడు. అతిథుల ముందు మనం సినిమాలతో పని లేకుండా ఇచ్చే దిక్కుమాలిన ప్రదర్శనకు కొద్దిగా బాధ పడ్డాను. మనలో మనకీ ఎన్ని ఉన్నా వాటిని వ్యక్తపరచే వేదికలు వేరు.ఇది మనకు తెలియదా?
సరే! పిల్లలు తెలుగును చిత్రంగా ప్రదర్శించారు-చెప్పేదానికీ, వచ్చేదానికీ, చేసే దానికీ…ఎవరు నేర్పుతున్నారమ్మ ఈ కొమ్మలకు?పాడు చెయ్యమని…
ఆంగ్లం ఇంకొకలాగా ఉంది-యు ఆల్, వి ఆల్…
సినిమాల దగ్గరకు వద్దాం. పిల్లల సినిమాలంటే ఏమిటి?పిల్లలు నటించిన సినిమాలా?,పిల్లలు కథలో ప్రధాన పాత్ర పోషించే సినిమలా,పిల్లల సమస్యలు ఉన్న సినిమాలా,పిల్లలు దర్శకత్వం వహించిన సినిమాలా,లేక కేవలం ఏనిమేషన్ సినిమాలా…ఆ సొసైటీ వారికే అవగాహన లేనప్పుడు నందితాని నేను అనవలసినది ఏమీ లేదు.
నా కుడి వైపు ఒక తెర మీద వెంకటేశ్ గురించి, ఇలియానా గురించి రెండు సార్లు చూపించారు. జనం చప్పట్లు, కేరింతలు, ఈలలు…
140 సినిమాలు చూపిస్తారని మైకు ముందు అమ్మాయి చెప్పింది. నందితా పాపం అక్కడ ఆ రోజు ఒకే ఒక నిజం చెప్పింది.70 సినిమాలు అని చెప్పేసింది!
ప్రారంభ సినిమా-మొజార్ట్ ఇన్ చైనా చూపించే సమయానికి నందితాతో పాటు అందరూ వెళ్లిపోయారు.దాసరి గారు కూర్చున్నట్లున్నారు.
మనం ఇంతసేపూ ఇక్కడున్నది బాలల చిత్రోత్సవం కోసం కాదా? కాదు! తెలుగు రాని ఇలియానా, తప్పదు కాబట్టి విచ్చేసిన వెంకీ కోసమా?
ఇంటికి వెళ్లి రోశయ్య గారు వేదిక మీదకి నడుస్తున్న దృశ్యాన్ని పలు మార్లు తలచుకుని నవ్వుకుంటూనే ఉన్నాను! కారణం మరేదీ కాదు.ఆన పట్ల అందరికీ గౌరవం ఉంది.
కారణం ఏమిటంటే పిల్లలు మైకు ముందు ‘నందితా దీదీ’,’అంబికా ఆంటీ’,’వెకటేశ్ అంకుల్ ‘,’గీతా రెడ్డీ ఆంటీ ‘, ‘ఇలియానా దీదీ ‘ అని చెబుతూ
‘ఇప్పుడు రోశయ్య అంకుల్ గారిని ఆహ్వానిస్తున్నాము…’ అని చెప్పారు.
అంకుల్ గారు ఇప్పటి సినిమాలు ఏమీ అందుకే అర్థం కావటం లేదని సెలవిచ్చారేమో!

~~~***~~~

అదలా ఉంచండి.ఒక ప్రబుధ్ధుడు నాకు డెలిగేట్ పాస్ చేతిలో పెట్టి సినిమాల మీద మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు. ఐమాక్స్, ప్రసాదులు ఎలాగో వెళతాము.వీరు మూలుగుతున్న హరిహర కళాభవవన్ లో ఏమి చేస్తున్నారో చూద్దామని 17.11.2009 న వెళ్లాను. స్కూలు పిల్లలు లైన్లలో పడిగాపులు కస్తున్నారు. హాలులో గోల తప్ప మరేమీ లేదు. ఎ.సి గురించి మరచిపోండి.ఫేన్ కూడా లేదు.ఈ నేపథ్యంలో ఒక ఫ్రెంచ్ ఏనిమేషన్ సినిమా వేస్తున్నారు.చూడగలిగినంత చూసి ఇవతలకు వచ్చాను.

కళారంగానికీ, రాజకీయానికీ, సివిల్ సర్వీసెస్ దొరబాబులకి పూర్తిగా సంబంధాలు తెగిపోయిన రోజున తప్ప వీటి వైపు తలకాయ ఉన్న కళారాధకుడెవరూ వెళ్లకూడదు అనుకున్నాను.పరేడ్ గ్రవుండ్స్ ప్రక్కన ఒక కోతులను అడించే కుర్రాడు ఖంజీరా పట్టుకుని పాడుతున్నాడు.వాడు వేస్తున్న దరువుకి పట్టుకున తలనొప్పి కాస్తా వెళ్లిపోయింది.
‘గరీబ్ క యె ఖేల్ హై,గరీబ్ కె సాథ్ హీ ఖేల్ హై. రంగ్ బినా ఎక్ హోలీ హై,నౌరంగోంకీ ఝోలీ హై,భూఖ్ కి దునియా…ప్యాస్ కి దునియా…భూఖ్ కి దునియా,ప్యాస్ కి దునియా, భూఖ్ అవుర్ ప్యాస్ క మేల్ హై భాయి…గరీబ్ క యే ఖేల్ హై…’

చలనం లేని సంచాలకులతో చలనచిత్రోత్సవాలు ఇలానే ఉంటాయి…

~~~***~~~
 

 

 

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘రోశయ్య అంకుల్..’-16వ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ వేడుకలపై వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: