‘దిద్దుబాటు’-గురజాడ గారి కథ గురించి వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


 

మిత్రుడొకండు ఈ మధ్యకాలమున ఒక పర్యాయము కలసుకొనెను.’ఆర్యా, మనసునకు ఏమి చేయవలెనని ఎన్ని విధంబుల యోచించిననూ తెలియుటలేదు, కిం కర్తవ్యం ‘, అని బహు బేలగ సెలవిచ్చెను!
‘మిత్రమా,మన నలు దిక్కుల చూసిన యెడల అన్నియు ప్రపంచములే గానవచ్చును!ఒక్కింత శ్రధ్ధగ దృష్టి సారింపుము.ఒక ప్రాచీనమైన పుస్తకము,ఒక ఆధునికం అనబడు ఆలోచనను ఇరు ప్రక్కల చేర్చుకొని విధిగా చదువుము.సమస్య తీరిబోవును ‘, అని ఉచితముగ బదులు చెప్పితిని. అయినను అడియేను అటుల చేయుచుండెనా అను సందేహం గలిగి మిక్కిలి విచారించితిని! నా యంత దురాత్ముడెన్నడూ ఉండబోడని నిర్ధారించుకుని పుస్తకంబులను తిరగవేయనారంభించితిని.అదృష్టం అఱజేతిన కానవచ్చెను.గురజాడవారి కొన్ని కథానికలు గల పుస్తకంబొకటి గనిపించెను…

~~~***~~~

‘దిద్దుబాటు ‘ అను కథ ఫిబ్రవరి 1910 ‘ఆంధ్రభారతి ‘ లో ప్రచురితమైనది.

గోపాలరావు మీటింగులూ,లోకోపకారాలు అని కబుర్లు చెప్పి సానెదాని పాటలు వింటూ ఆమె పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఉంటాడు. ఇంటికి రాత్రి వేళల ఎంతో ఆలస్యంగా వస్తూ ఉంటాడు. ఒక రాత్రి ఇంటికి రాగానే నౌకరు అమ్మగారు ఇంటిలో లేరని చెబుతాడు. ఆవిడ వ్రాసిన ఉత్తరం ఒకటి ఇస్తాడు. ఆవిడ వ్రాసిన మాటలు చిత్రంగా ఉంటాయి.’నేనింట ఉండుటను గదా మీరు కల్లలు పలుకవలసి వచ్చె.నేను పుట్టింటనున్న మీ స్వేఛ్చకు నిబంధమును, అసత్యమునకు అవకాశము కలుగకుండును…మీచే దినదినమును అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుండుటయే పతి మేలు కోరిన సతి కర్తవ్యము కాదా?నేనీ రేయి కన్నవారింటికి…’

ఆ ఉత్తరం చదివిన పంతులు నౌకరును అక్కడికి వెళ్లి అవిడను తీసుకుని రమ్మంటాడు.
అక్కడ చెప్పవలసిన మాటలు అతనికి చెబుతాడు.పంతులుకి బుధ్ధొచ్చింది,ఇక ఎన్నడూ సానుల పాట వినరు,…దయ తలచి ఆయన లోపములను బయట పెట్టక రెండు మూడు రోజులలో వెళ్లిపోయి రమ్మన్నారు…అంటాడు.

ఆ నౌకరు ఏమి చెబుతావో చెప్పు అన్నప్పుడు ‘ అదంతా నాకేం తెల్దు, ఆడోరు యెజమాని చెపినట్టల్లా యిని వల్లకుండాలి, లేకుంటే పెద్ద పంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మనుంచుగుంతారు…ఆ పైన మీ సిత్తం అంతాను ‘, అంటాడు.

ఓరి వెధవా అని గోపాలరావు కుర్చీలోంచి లేవబోయేసరికి మంచం కింద నుంచి ‘అమృతనిష్యందిని యగు కలకల నగవును కరకంకణముల హృద్యారావమును విననయ్యెను ‘ అని గురజాడ గారు ముగిస్తారు. కానీ ఇదే కథను ఆయన వ్రాతప్రతిలో ‘దిద్దుబాటు ‘ చేసి ‘అమృతం వొలికే కలకల నవ్వూ,మనోహరియైన  నూపురముల రొద, విననయ్యెను ‘ అని మార్చారు. కథ అసలు పేరు ‘కమలిని ‘-గోపాలరావు భార్య పేరు.

~~~***~~~

కొన్ని సంవత్సరాల క్రితం నసీరుద్దిన్ షాహ్,షబానా ఆజ్మీ కలసి ఒక నాటిక చేశారు. అందులో ఇద్దరు భార్యా భర్తలు కూర్చుని వారు విడిపోయిన తరువాత వ్రాసుకున్న ఉత్తరాలను చదువుతారు. నాటిక యావత్తూ జరిగే దృశ్యం అంతే! మాటలలో,ఆలోచనలలో,ఆలోచనల నుంచి వచ్చే మటల మూటలలో ఉండే కథ అది.

గురజాడ వారు సామాన్యంగా జరిగే అంశం లోనే పంతులు తను అనుభవిస్తున్న ప్రలోభాన్నీ,ఇల్లాలి పట్ల జరుగుతున్న అన్యాయాన్నీ గుర్తించినట్లు చూపిస్తూనే భార్య చదువుకుని ఉండి చిన్నగా మందలించినట్లు  స్త్రీ బేలతనం లోనే ‘అడ్డు తొలగటం ‘ అనే మాటను, భర్త చేత అసత్యం పలికించటం ఇష్టం లేనట్లు చెప్పిస్తూ తప్పును ఎత్తిపొడవటం చూపిస్తారు.

కథకు ఉపోద్ఘాతాలు ఏమీ ఉండవు. ఇంటికి వచ్చిన ఆసామితో ప్రారంభం. అక్కడే మొదలు, ఆఖరు!

‘ ఆడారు చదువు నేరిస్తే ఏటౌతది…’, అంటాడు నౌకరు.
ఉత్తరం చదివిన గోపాలరావు భార్య వినయాన్ని మెచ్చుకుంటూ ‘ మూర్ఖుడా, భగవంతుని సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీరత్నమే…’ అంటాడు.

అస్తు!

ఎటువంటి విద్య అనేది ఆయనే చెప్పకుండా చెప్పారు!

జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే సంఘటనలో మూడు మెట్లు-భార్యా భర్తల సంబంధం,సమాజంలోని స్థితిగతులు, చదువు రాని వారి ప్రతిక్రియ అన్నీ కలబోశారు.చదువుకు, సంస్కారానికి ఉన్న అనుబంధం కథ చివర మబ్బు అంచున మెరుపు తీగె లాగా మెరుస్తుంది.’నవ్వు, నూపురముల కలరవం ‘చక్కగా ఇమిడిపోయాయి…

కథలో సంఘటన ఏది అని కొందరు అడగగలరు. కథ యావత్తూ ఇద్దరి సంవాదమే! అందులోనే అన్నీ జరిగిపోతాయి…

జరుగుతున్న సంభాషణలో జరిగిన దాన్ని చదివే వారికి తిరిగి జరిపించి చూపటం రచయిత చేసే మర్మం. ఆ విషయంలో గురజడ గారి గురించి విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు.

~~~***~~~

కథకు, నాటకీయతకు తేట తెలుగుతో తొలి వివాహం చేసిన శ్రీ గురజాడ వెంకట అప్పరావు గారికి ఈ వ్యాసం అంకితం.

~~~***~~~

వేదాంతం శ్రీపతిశర్మ

 

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘దిద్దుబాటు’-గురజాడ గారి కథ గురించి వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: