‘కామెంటరీ’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


ఇంటి వరండా తలుపు తెరచి ఉంది. అటు రెండు , ఇటు రెండు కేను కుర్చీలు ఉన్నాయి. వాకిలి నుంచి చూడగానే ఒక పెద్దాయన ఒక కట్ బనియన్ వేసుకుని అలా కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. మరో పెద్దాయన తలుపు దగ్గర నిలబడి లోపలికి, బయటకి, తరువాత అటూ ఇటూ చూశాడు. ఎవరూ కదలటం లేదని కాలింగు బెల్లు కొట్ట బోయి ఆ కూర్చుని ఉన్నాయని చూసి ఆగిపోయాడు. నిద్రా భంగమో లేక ధ్యానభంగమో అవుతుందని ఆలోచించినట్లున్నాడు. మెల్లగా లోపలికి ప్రవేశించి ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. లోపలా, బయటా ఏ శబ్దమూ లేదు. ఈయన ఒక్కడే ఉన్నాడేమో అనుకుని ఎవరైనా వచ్చే వరకూ అలనే కూర్చుందామనుకుని నిర్ణయించినట్లున్నాడు. ఇదేమిటి? మామూలుగా ఎవరి ఇంటిలోనైనా వినిపించే టి.వీ కూడా వివ్నిపించటం లేదు? మరల అలా ముని లాగా కూర్చుని ఉన్న పెద్దాయన వైపు చూశాడు. ఈ సారి మరింత జాగ్రత్తగా చూసి కుర్చీ లోకి వెనక్కి వాలాడు. ఆయన కళ్లు మూసుకుని ఉన్నాడు. కానీ కళ్లల్లోంచి నీరు అలా కారుతూ ఉంది…

~~~***~~~

‘ఏమయింది సార్?’
‘…’
‘ నేనండీ, బ్రహ్మానందాన్ని…’
ఏ ప్రతిక్రియా లేదు. పెదాల దగ్గర చిన్నగా ఒక సందడి. అంత మటుకే!
అలా కొద్ది కొద్దిగా నీరు కళ్లల్లోంచి కారుతూనే ఉంది. కట్ బనియను కొద్దిగా తడిసినా ఆయన పట్టించుకోవటం లేదు. ఒకప్పుడు బరువులు మోసిన భుజాల లాగే ఉంటాయి అవి. కుడి భుజం కొద్దిగా పెద్దది, ఎడమ భుజం కొద్దిగా చిన్నది. ఎవరికైనా అంతే! కట్ బనియన్లు గొప్పగా ఉంటాయి. ఒక వయసు వచ్చాక పెద్దగా దాచుకోవలసిన శరీరం ఉండదు కాబట్టి నీకు నేను చాలు అన్నట్లు అలా ఒక వంట వాడి ఏప్రన్ లాగా అలా గుండెకు హత్తుకుని ఉంటుంది మరి. ఒక వయసులో దానిని మించిన మిత్రుడు లేడు!
‘ సార్…’
‘…’
‘ ఏమి జరిగిందండీ? నాకు చెప్పండి. చెప్పుకుంటే అన్నీ కరగిపోతాయి. అదేమిటి? ఒక్కరే కూర్చుని అలా కన్నీరు పెట్టుకుంటే ఎలా?’
‘…’
‘ నిజమే! ఇలా వినే వారు కూడా లేరు. దిక్కుమాలిన లోకం తయారయింది. ఎక్కడ చూసినా రన్నింగు రేసే! నేనున్నా కదా? చెప్పండి.’
‘…’
‘ నా సంగతే చూడండి. నా చుట్టూతా ఉన్న వారందరూ పోలికలు, పొంతనలూ, అక్కడుందీ, ఇక్కడ లేదు అనే వారే! అంతటా పోటీలు, అన్నీ పోట్లాటలే. ఒక్కడికీ నా మాట అక్కరలేదు. ఏం చేస్తాం? సార్, మీరు అలా కూర్చోకూడదు. డాక్టర్లు కూడా మాట్లాడమంటున్నారు! ఏమయిందండీ?’
‘…’
ఆయన మరల వెనక్కి వాలాడు.
‘ ఏదో పని మీద వెళుతూ…సర్లేండి. మీతో దాపరికం ఎందుకు? నాకు పనేముంది? అలా పాత రోజుల గురించి మాట్లాడుకుందామని సుబ్బారావు గారి ఇంటికి వెళితే ఆయన ఇంటిలో ఎవరో వచ్చి ఉన్నారని కాంపఔండ్ దగ్గర నిలబడి కొద్ది సేపు మాట్లాడి వచ్చాను. ఎక్కువ సేపు నిలబడ లేక ఇలా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది…’
ఆయన కళ్లు కొద్దిగా కదిలాయి.
‘ చెప్పండి…అరే! అలా కన్నీళ్లు కారిస్తే ఎలా? నన్ను చూడండి. ఒక్కడినే పిచ్చి పట్టిన వాడిలాగా అలా ఓపిక ఉన్నంతవరకూ నాలో నేను ఏవో మాట్లాడుకుంటూ వెళ్లిపోతాను. నీరసం వస్తే వెనక్కి తిరుగుతాను. ఎక్కడైనా మ అబ్బాయి కనిపిస్తే వాడు ‘ఎక్కడికీ?’ అని అరచి ‘ ఇంటికి పద!’ అంటాడు. వరండాలో కూర్చుంటే ‘ ఛలి గాలికి దగ్గుతావు. లోపలికి పద అంటాడు! గదిలోనే పడుకుంటే వాకింగ్ చెయ్య మంటాడు…’
ఆయన ఈ సారి కొద్దిగా కదిలాడు.
‘ చెప్పండి సార్. ఏమయిందీ? నాలుగు కబుర్లు చెప్పుకుందాం. ఏముంది ఇందులో?’
ఆయన ఇంతలోనే నవ్వాడు. కళ్లు తెరచి తుండుతో మొహమంతా తుడుచుకున్నాడు.
ఈయన ఎవరెస్టు ఎక్కాడు. ‘ అద్దీ! ఇప్పుడు చెప్పండి! మాట్లాడుకోవాలి సార్!’
‘ ఊ…’
‘ ఎందుకు ఏడుస్తున్నారు?’
‘ ఇప్పుడూ…’, ఆయన మొదటి సారి మాట్లాడాడు,’…కంటిలో డ్రాప్స్ వేసి అరగంట అలా కళ్లు మూసుకుని ఉండమన్నారు. అదీ నా ఏడుపు! ‘
ఈయన నోరు అలానే తెరచి ఉంచాడు.
‘ ఆ మట చెప్పవచ్చు కదా?’
‘ చెప్పాలనే అనుకున్నా! ఈ వంకతో మీ మాటలు విన్నాను కదా? మీరే కదా ఎవరూ మాట్లాడరని అన్నారు?’
‘ ఓహో! ఇదో ధ్యానం అన్న మాట!’
‘ ధ్యానం కాదు. మీ మనసు లోని బరువూ తేలిక అవలేదా?’
‘ కరెక్టే! ఇదేదో బాగుందే! ఆ డ్రాప్స్ నేనూ వాడి ఇలా వరండాలో కూర్చుంటాను. కొద్ది సేపు ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం!’
ఇద్దరూ జోరుగా నవ్వుకున్నారు.
‘ కళ్లు మూసుకుని ఇంకొకరి మాటలు అలా వింటూ ఉంటే మన

మనన్సులోకి మననం కూడా అక్కరలేదు. జరుగుతున్నది కేవలం మాయేనని తెలిసినా నిజాలను నవ్వుతూ నటింపచేయటం నిజంగా…’
‘అమ్మో…ఎంత మాట?…’, ఆయన ముక్కు మీద వేలు పెట్టాడు,’…చెప్పండి…నిజంగా?’
‘ నిజంగా ఏమీ లేదు. మీ పేరే! సమయానికి నా ముందుకు వచ్చారు. నిజంగా బ్రహ్మానందమే!’
మరో సారి నవ్వుకున్నారు ఇద్దరూ.
‘ ఎంత మాయ? జీవితం మీద కామెంటరీ ఇచ్చుకుంటూ గడిపేస్తాము. ఎప్పుడు జీవిస్తామో తెలియదు. జీవితం కామెంటరీ కాదు అని తెలుసుకునే లోపు జీవితకాలం అయిపోతుంది…’

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: