‘న మంత్రం నో యంత్రం…’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


ఇంటి నిండా నవ దుర్గలు…చిన్ని చిన్ని పిల్లలు వరండాలో ఆడుకుంటున్నారు. లోపల ఒకటే సందడి-హోమాలు, పూజలు, హడావుడి. ఒక చిన్నారి ఒక కాగితం తీసుకుని కూర్చుంది. రెండు కాళ్లూ ముందరకు జాపుకుని తెల్ల కాగితాన్ని ఒక పుస్తకం మీద పెట్టి బొమ్మను ఆడిస్తున్నట్లు వొడిలో పెట్టుకుని ఒక పెన్సిలుతో అదే పనిగా గీస్తున్నది. పక్కగా ఒక కుర్చీలో కూర్చున్నాను. ఒక కన్ను అటు వేశాను. పిల్ల నన్ను చూసి తను గీస్తున్న బొమ్మను చూసి మరల నన్ను చూసింది. ‘ ఇవి కళ్లు ‘, అంది. అమ్మవారి విశాలమైన కళ్లు గీయాలనే ప్రయత్నం చేస్తోంది. ఎదురుగా గోడ మీద బెoగాలీ కాలెండర్ లో ఉన్న బొమ్మను చూసి ప్రయత్నం చేస్తోంది. ‘ ఎవరివమ్మా కళ్లు? ‘
‘ అమ్మవారివి మావయ్యా! ‘
‘ బావున్నాయి. గియ్యి. ‘
‘ మావయ్యా?’
‘ ఏంటమ్మా?’
‘ అమ్మవారి కళ్లు చాలా పెద్దవి కదూ? ‘
‘ అవును.’
‘ ఎందుకు?’
‘…’
ఇదీ సమస్య. చిన్న పిల్లలతో పెద్ద మాట్లాడేస్తామనుకుంటాను! పెద్దవాడినెప్పుడయ్యానో తెలియదు! పెద్దగా మాట్లాడలేను. ఈ పిల్ల నన్ను అలానే చూస్తోంది.
‘ ఎందుకు మావయ్యా?’…నొక్కి వక్కాణిస్తోంది.
‘ అమ్మవారు చాలా పెద్దదమ్మా! మరి కళ్లు కూడా పెద్దవి ఉండాలి కదా?’
‘ మా మేడం కూడా చాలా పెద్దది మావయా! కానీ కళ్లు చాలా చిన్నవి కదా?’
గొంతు సద్దుకున్నాను. ‘ అలా కాదు చిట్టీ…’
‘ నా పేరు కుట్టీ…’
‘ ఓహో! కాదు కుట్టీ, ఇప్పుడూ, అమ్మవారు లోకంలో అందరినీ చూడాలి కదా? మరి ఇంత పెద్ద లోకంలోని అందరినీ చూడలంటే మరి ఎంత పెద్ద కళ్లు ఉండాలీ?’
‘ ఓహో! అలాగా? అందరినీ ఎందుకు చూడాలి మావయ్యా?’
‘ అందరు ఆమె బిడ్డలే కదా?’
‘ ఓ అందుకా?’
ఆపింది. ఆపి మరల బొమ్మ గీస్కుంటోంది. ఊపిరి పీల్చుకున్నాను.
‘ మావయ్యా…’
‘ అమ్మా’
‘ ఇప్పుడూ, అమ్మవారు ఏమి చేస్తోంది?’
‘ మనలందరినీ కనిపెట్టి కాపాడుతోంది’
‘ ఎలాగా’
‘ మన అమ్మ లాగా’
‘ మా అమ్మ జాబుకి వెళుతుంది. నన్ను చూడదు కదా?’
‘ జాబ్ కి వెళ్లినా నీ గురించే ఆలోచిస్తుంది. నిన్ను కనిపెట్టే ఉంటుంది.’
‘ అవునా?’
‘ అవునవును’
అక్కడి నుంచి లేస్తే మంచిదేమో, లోపల అవసర నైవేద్యం-ఇంటరిం రిలీఫ్ ఏదైనా ఉన్నదేమో కనుక్కుంటే బాగుంటుందనిపించింది. ఇంతలో
మరల అడిగింది, ‘మావయ్యా…’
‘ తల్లీ…’
‘ ఇప్పుడూ…మరీ…మరీ…అమ్మవారు ఎవరినైనా ఎత్తుకుంటుందా?’
‘ అందరినీ ఎత్తుకుంటుంది.’
‘ నన్ను?’
‘ ఓ తప్పకుండా…’
ఆ పిల్ల అసాధ్యురాలిలాగా ఉంది. లేచి సద్దుకుని ఆ కేలెండర్ దగ్గరకు వెళ్లింది. బొమ్మనీ నన్నూ రెండు సార్లు చూసి వెనక్కి వచ్చింది. చక్కగా కూర్చుండి పోయింది.
‘ మావయ్యా ‘
‘ అమ్మా ‘
‘ ఎత్తుకోలా! ‘
‘ నువ్వు అడిగావా?’
‘ ఊ…మెల్లగా అడిగాను. నువ్వు చెప్పావని కూడా చెప్పాను. నవ్వుతోంది కానీ నా మాట వినలేదు…’
ఆశ్చర్యం వేసింది.
‘ అమ్మలూ…’
‘ ఏంటి మావయ్యా?’
‘ అమ్మవారు ఆ కేలెండర్ లో బొమ్మలా ఉన్నారు. అసలుకి ఆవిడ మనలందరినీ ఎత్తుకునే ఉన్నది. ‘
పిల్ల లేచి నిలబడింది. ‘ ఎలా మావయ్యా?’
‘ మనకి తెలియదు. అమ్మ వొడిలో ఉన్నప్పుడు నువ్వు ఆడుకుంటావు అంతే! అమ్మ నిన్ను ఎలా ఎత్తుకుందో చూస్తావా?’
పిల్ల ఆలోచిస్తోంది.’ గుర్తు లేదు మావయ్యా, కానీ…’
‘చంటి పిల్లాడిని చూడు…’
‘ అవును మావయ్యా…నిజమే. చక్కగా ఆడుకుంటాడు.’
‘ మనమూ అంతే!’
‘ అందరం పిల్లలమేనా? ‘
‘ కొందరు చిన్న పిల్లలు, కొందరు పెద్ద పిల్లలు. అమ్మకి తెలుసు…’

ఇంతలో మరో ఇద్దరు పిల్లలు చేరారు. ఒక కుర్రాడు, ‘ మావయ్యా, దీనితో ఊరకే మాట్లాడావ్లు జోరుగా వినిపిస్తున్నాయి.
‘ మావయ్యా…’
‘ ఏంటమ్మా? ‘
‘ ఇప్పుడూ…అమ్మవారు కనిపించటం లేదు కదా? ‘
‘ అవును’
‘ మరీ…మరీ ఎలా గుర్తు పట్టటం?’
‘ నువ్వు మీ అమ్మతో ఎప్పుడైనా సినిమాకి వెళ్లావా?’
‘ ఓ! ‘
‘ అందరు బయటకి వచ్చినప్పుడు ఏమి చేస్తావు?’
‘ అమ్మ చేయి పట్టుకుని వదలను ‘
‘ ఎందుకు?’
‘ తప్పిపోతాము మావయ్యా!’
‘ ఒక వేళ ఎవరైనా మిమ్మల్ని తోసేసి వెళ్లిపోతే చేయి జారిపోతుంది. అప్పుడేమి చేస్తావు?’
‘ అవును మావయ్యా…ఒక సారి అలాగే తోసేశారు. అప్పుడూ…అప్పుడు నేను బిగ్గరగా అరచి అమ్మ వచ్చే వరకూ అక్కడే ఉన్నాను’
‘ లోపల అందరూ అరుస్తున్నారు చూడు, ఈ అరుపులన్నీ అందుకే!’
పిల్ల నవ్వింది.’ ఏ కాదు. అవి మంత్రాలు. ‘
‘ వాటి అర్థం అదే!’
‘ అవునా?’
‘ అవునవును!’
మంత్రాలు సద్దు మణిగాయి.
‘ మావయ్యా?’
‘ ఏమ్మా? ఆకలిగా ఉందా?’
‘ కాదూ! ఒక వేళ జనంలో అరచినా అమ్మకు వినిపించకపోతే?’
ఆ కుర్రాడు అందుకున్నాడు, ‘ మావయ్యా, అమ్మ చీరె రంగు గుర్తు పెట్టుకుని అలా వెనకనే వెళ్లి పటుకుంటాను…నేనైతే అంతే!’
‘ అమ్మ మీద ఉన్న నమ్మకం అది. నీ దారి అది, నీ నీడ అక్కడున్నది, నీ తోడు నిన్ను అలా ఇంటి దాకా నడిపిస్తుంది. నీకు దారి తెలియదా అని అడుగుతుందా?’
‘ పెద్ద పిల్లలని అడుగుతుంది’
‘ అదీ! అసలు ఎవరికీ దారి తెలియదు. అందరం చిన్న పిల్లలం అని చెప్పాను. అవునా?’
‘ లేదు. నాకు తెలుసు…’, కుర్రాడు అన్నాడు.
‘ ఇంటి వరకు తెలియవచ్చు. తరువాత?’
‘…’
‘ మావయ్యా…’
‘ చెప్పు కుట్టీ…’
‘ ఒకాయన మంత్రాలు చదివితే అమ్మవారు కనిపిస్తుందన్నాడు మావయ్యా! నీకు తెలుసా మంత్రాలు?’
‘ అమ్మను గుర్తు పట్టేందుకు మంత్రాలెందుకు పిల్లా? ‘
‘ మరీ…సినిమాలో యోగి ఒంటి కాలి మీద నిలబడతాడు…’
‘ అమ్మ ఒడిలో ఉన్నాను అని తెలుసుకునేందుకు అలా సాధన చేస్తారు తల్లీ…’
కుర్రాడు బుర్ర గోక్కున్నాడు. ‘ మోక్షం కోసం కాదా మావయ్యా?’
‘ సమస్త ప్రాణులూ తల్లి గర్భంలో వృధ్ధి చెందుతున్నాయి నాన్నా! ఆమె ప్రసవిత్రి, సావిత్రి. తిరిగి ఆమెలో లీనమైపోవటమే మోక్షం. అన్ని సాధనలు చివరకు తల్లి ఒడినే చేరుస్తాయి. ‘
‘ మనం చాలా చదువుకోవాలి పిల్లా…’
‘ మనం చిన్న పిల్లలం.’
‘ అవును! అదే ఙ్ఞానం! అందుకే తొమ్మిది చిన్న పిల్లలని అలంకరించి బాలా త్రిపురసుందరి పూజ చేస్తారు.’
‘ మాకు మంత్రాలు అవీ అక్కరలేదా మావయ్యా? ‘
‘ ఎవరడిగారు? పెద్ద పెద్ద మాటలు చెప్పిన శంకరాచార్యులే న మంత్రం, నో యంత్రం అన్నాడు…’
వాళ్లందరూ చక్కగా విరగబడి నవ్వారు. ఆ నవ్వులో దైవాన్ని చూశాను…
వాళ్లు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. కొందరు అనుసరిస్తూ, కొందరు అనుకరిస్తూ…వరండా యావత్తూ మంత్రాలను మరచి ప్రతిధ్వనించింది.
అలసిపోయి ఆగారు. ‘ నో యంత్రం…’ అంటూ మరల నవ్వారు…
శాంతించారు.
‘ మావయ్యా…’
‘ ఏంటి కుట్టీ?’
‘ ఆయనకి ఇంగ్లీష్ వచ్చా?’
‘అంటే?’
‘ నో యంత్రం అంటే…’
‘ అది సంస్కృతమే తల్లీ! ఆయన నా దగ్గర మంత్రం లేదు, యంత్రం లేదు, నిన్ను ఎలా స్తుతించాలో కూడా తెలియదన్నాడు. తల్లిని ఆహ్వానించటం, ధ్యానించటం, ఆవిద కథలు చెప్పటం ఏమీ తెలియవన్నాడు. ఆవిడ ముద్రలు..ఇలాంటివి కూడా తెలియవన్నాడు. చివరకి ఏడవటం కూడా రాదన్నాడు!’
‘ అయ్యో! ‘
‘ అమ్మా, కేవలం ఒక బాలుని లాగా నిన్ను అనుసరుస్తూ నీ వెనుకే నడుస్తాను అన్నాడు ‘
‘ ఎందుకు? ‘
‘ అది కష్టహరణం. అంటే ఏ కష్టం లేకుండా అమ్మ చూసుకోదా?’
‘ అవును.’
‘ ఇంకేమి కావాలి?’
లోపల గంటలు కొట్టారు.
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘న మంత్రం నో యంత్రం…’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ

maverick6chanduకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: