‘ఇమ్మొబయిల్’ -వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ


వేచి ఉండటం అంటే నాకు ఏ రోజూ ఇష్టం లేదు. ఒకరి కోసం ఒక చోట నిలబడాలన్నా, ఒక రైలు లో ఎవరో వస్తున్నారని ఎదురు చూస్తూ కుర్చోవాలన్నా, లైను కదలాలన్నా జీవితం మీద విరక్తి పుడుతూ ఉండేది. కొద్ది రోజుల నుంచీ అలా లేదు. నా మొబయిల్ తడిసిపోయి కోరని వరాన్నిచ్చింది. నాకూ, నా సమయానికీ గల సంబంధం మరింత గట్టిదయ్యింది. అదలా ఉంచి ఎక్కడైనా అలా వేచి ఉండాలంటే ఆ సమయం నాకు ఏ రోజూ వృధా పోదు. బండీ పాడయి ఒక మూల నిలబడ్డాను. వాన దంచుకుంటోంది. ఆగే వరకూ అలా ఆ మూసేసిన షాపు షటర్ కు ఆనుకుని నిలబడ్డాను.

అన్ని వైపులా ద్వారాలు మూసుకున్నప్పుడు నాకు నేను ఎందుకో మరింత స్వతంత్రంగా ఎగురుతాను! ఎక్కడి నుంచో ఆలోచనలు అద్భుతంగా ఆ గొడవ చేస్తున్న ఆకాశంలోకి రాకెట్లలా ఎగిరిపోతాయి. ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తోంది. కటకటాల మాటున ఒక కుర్రాడు వచ్చి మొబయిల్ ఫోనులో మాట్లాడుతున్నాడు. ఎవరో వచ్చి వెనక్కి తీసుకుని పోతున్నారు. అతను మరల వస్తున్నాడు, వాళ్లు మళ్లీ తీసుకుని వెళ్లిపోతున్నారు. తమాషాగా ఉంది. ఎంత వానలో తడిస్తే నేను కింద పడిపోతాను? పోనీ తడిసి చూద్దామా? ఏమో! కొత్త రోగాలు నాట్యం చేస్తున్న నేల ఇది! ఆ కుర్రాడు మరల వచ్చాడు. చిన్నగా అంటున్నాడు, ‘హలో, ఆ, నేనే! ఏమీ లేదు…ఏం చేస్తున్నావు? వానా? లేదు ఎండగా ఉంది. వాడికి చెప్పు, వాడికి మొత్తం మెంటాలిటీయే మెంటల్…’ ఈ సారి తనే వెళ్లిపోయాడు.

ఆ కటకటాలు అతనికి అడ్డంగా ఉన్నట్లున్నాయి. నాకు ఏ అడ్డమూ లేదు. ఈ జైలు అనంతం. ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు తాళం వేయగలదు. మరో ఆలోచన అన్ని ఆలోచనలకూ తాళం వేసి మూయగలదు… ఒక చిరునవ్వు చిన్నగా తాళం తెరవగలదు. ఈ మనన్సులోకి నన్ను తోసి జైల్లోకి పంపినట్లు ఎవరో అనుకుంటున్నారు. కుదరదు. నేను నిలబడ్డ చోటే వేయి తలలు, వేయి వెర్రి ఆలోచనలు. నాకు మనుషులతో పని లేదు, నేను బంధువును కాను. నాలో ఏదో నిదుర లేచినప్పుడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు. నేను స్వతంత్ర జీవిని…

కుర్రాడు మరల వచ్చాడు. ‘హలో…రావద్దు. ఎందుకు? ఆ పిచ్చోడు రాడు. వద్దు. నేను మిస్డ్ కాల్ ఇస్తాను…’
మరల లోపలికి తీసుకుని వెళ్లిపోయారు.

ఏమిటి నాలో ఈ ఆలోచనలు? శరీరం అలసిపోయిందనా? వాన అడ్డుగా వచ్చిందనా? అనుకున్న సమయం దాటిపోయిందనా? ఏమో! ఆలోచనలకు ఒక గ్రూప్ లీడర్ గా మరో ఆలోచన. ఈ ఆలోచన మిగతా ఆలోచనలను పరిశీలిస్తోంది. పనికి మాలింది!

ఎవడు స్వతంత్రుడు? ఎవరూ లేరు. ఎవరు బంధువు? ఎవరూ లేరు. అన్నీ ఇచ్చి పుచ్చుకునేవే! పై వాడు కూడా నోరు తెరిస్తే కిందటి జన్మలో…అంటూ మొదలు పెడతాడు. లెక్కలు అంటాడు. ఏదో బ్రహ్మాండమైన లెక్క తప్పి పోతున్నట్లు కబుర్లు చెబుతాడు. నేను వాడు కనపడితే నాయనా, నీ సృష్టి మాడర్న్ ఆర్ట్ లాగా చాలా బాగుంది. నీ వెర్రి తనం ఘోరంగా, ఎంతో అందంగా ఉందని చెబుతాను.

కటకటాల దగ్గర లైటు వేసారు. అంటే చీకటి పడింది. చుట్టూతా చూశాను. ఎలా, ఈ వాన ఆగటం లేదు. ఇంటిలో ఒక్క సరుకు లేదు. బండీ మూసుకుంది…ఇలా చెప్పినా నమ్మరు. అదో సమస్య. అక్కడ ఆ కుర్రాడిలాగా నిలబడి చూస్తున్న వారికి ఆలోచనలు కారు మబ్బులలాగా కమ్ముకుంటాయి…ఈ ఊళ్లో ఒక చోట పడే వాన మరో చోట పడదు. అన్నీ అబధ్ధాలే! సిగ్గనేది ఉంటే కదా? ఎవరో మరి స్వతంత్రుడు?

కాలు దగ్గర చిన్న రాళ్లు ఉన్నాయి. ఊరకే ఒక దానిని తీసి తుడిచాను. నీలా బ్రతకలేను. పోనీ నిన్ను ఆయుధం చేసుకుని ఒకరి మీద విసరలేను. అసలు మొబయిల్ పాడైపోయిందన్నా నమ్మటం లేదు ఎవరూ! ఒకరిని ఎందుకు నమ్మించాలి? రాయను నీటిలోకి విసిరాను. అక్కడ పడుకుని ఉన్న ఊరకుక్క ఊరకే లేదు. లేచి మొరిగింది!
‘ కొత్త మొబయిల్ కొని ఇస్తాను ‘, పై వాడు ఆఫీసులో కర్ణుడి తరువాత నేనే అన్నట్లు చెప్పాడు. ‘ కొనలేక కాదు సార్. ఇది చాలా ఖరీదైనది. రిపెయిరు అవుతుందని చెప్పారు. అందుకని ఆగాను…’
బయటికి వచ్చాక వెనుకనుండి మాట్లాడుకుంటున్నారు ఎవరో..’ ఈ మధ్య ఇది ఒక మంచి వంక. తన పనులకు వాడుకోడా మొబయిల్? ‘
ఒక రోజు ఆఫీసుకు వెళ్లి కూర్చున్నాను. ఎదురుగా ఒక పెద్దాయన కూర్చుని ఉన్నాడు. ‘ మొబయిల్ ఎత్తటం లేదేమిటి? ‘, అడిగాడు. రిపెయిరుకు వచ్చిందని చెప్పాలనిపించలేదు. ‘ అది నా మొబయిల్ ‘ అని కూర్చున్నాను. ఏదో అన బోయి నోరు మూశాడు. తన మొబయిల్ లో చాలా సేపు ఏ
దో కెలికాడు. లేచి ‘ వస్తాను ‘, అన్నాడు. చిరునవ్వు నవ్వాను. ఇది నా టయిం అంటానేమోనని అనుకున్నట్లున్నాడు! వెళ్లిపోయాడు.

కుర్రాడు మరల వచ్చాడు. ‘ఛార్జ్ అయిపోతోంది. త్వరగా చెప్పు. కరెంటు పోతుంది. త్వరగా చెప్పు. ఊ…అవునా…’
మరల ఎవరో వెనుక నుంచి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లారు.
వాన తగ్గింది. బండీ తోసుకుంటూ అటు వెళ్లాను. ఈ సారి కుర్రాడు గింజుకుంటున్నాడు. కటకటాల దగ్గరకు వచ్చాడు. నన్ను చూడలేదు.
‘ ఓ హలో, చెప్పు, వినిపించటం లేదు. ఏమిటీ?…మొబయిల్ పాడయిందా? మరి ఎలా మాట్లాడుతున్నావు? కొయ్యకుర రే…’
వెనుక నుంచి మరల వీపు ఎవరో తట్టి ఈ సారి ఒకటి వాయించారు. నేను అదోలా చూశాను. ఆయన నన్ను చూసి లోపలికి వెళ్లిపోయాడు. కుర్రాడు మొహం ఎర్రగా పెట్టుకుని మరల అక్కడికి వచ్చాడు.
‘ హలో…నేను …చెప్పు. బాగానే ఉందా? ఏమి బాగుంది? మొబయిలా…నీ బుర్రా? ఎందుకు మాట్లాడవు? ‘
మరల పెద్దాయన వచ్చి అతన్ని తీసుకుని వెళుతున్నాడు. ఎందుకో అడిగాను, ‘ సార్, మాట్లాడనీయండి…’
ఆయన కొద్దిగా కోపంగానే చూశాడు. కుర్రాడి చేయి విప్పి చూపించాడు. అసలు చేతిలో మొబయిల్ లేనే లేదు!.
నేను ఇమ్మొబయిల్ అయ్యాను!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ఇమ్మొబయిల్’ -వేదాంతం శ్రీపతిశర్మ చిట్టి కథ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: