‘ అనురాధ ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


తెలుగు అమ్మాయి లీలా నాయుడుని సినిమాలో చూడాలనిపించి ఈ చిత్రాన్ని చూశాను. 1960లో హృశీకేష్ ముఖర్జీ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక సున్నితమైన అంశాన్ని ఎంతో చక్కగా పరిశీలిస్తుంది. బల్రాజ్ సాహినీ నటన గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. ఆయన నటన అనేది ఒక పనిగా ఏ రోజూ చేయలేదు. ఒక కాఫీ హోటల్ లోకి వెళ్లి ఎంత సింపుల్ గా కాఫీ తాగుతామో అంత తేలికగా పాత్రను నిర్వహించి వెళ్లిపోతారు. లీలా నాయుడు ఒక పెయింటింగు వేసిన బొమ్మలా ఉంది. ఇటువంటి ముఖ కవళికలు రవి వర్మ గారి ఒక చిత్రంలో చూసినట్లు గుర్తు! ఆమె నటన కూడా పాత్రకు తగ్గట్లు ఉంటుంది.

మా ఆఫీసులో ఆఫీసరు గారు ఒక సారి ఒక మాట అన్నారు. ఒక పెద్ద ఆఫీసర్ గారికీ, ఆయన కింద అసిస్టెంటుకీ ఏ కారణం చేతనో మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఆయన కింద కాకుండా ఇంకొకరి కింద ఈయన పని చేసే వాడు. ఒక సారి నాకు ఎలాగో మిత్రుడు కదా, ఆయన కింద పోస్టులోకి బదిలీ చెయ్యండి అని ఈయన అడిగాడు. ఆఫీసరు గారు వద్దు లెండి, మీ స్నేహం చెడిపోకుండా ఉండాలంటే ఇక్కడే ఉండండి అన్నాడుట!
ఒక్కో సారి కొన్ని వివాహ బంధాలు కూడా అలానే ఉంటాయి! ఒక గాయకురాలు ఒక డాక్టరు ప్రేమించి గుడిలో వివాహం చేసుకుంటారు. ఆమె కళకు పరిస్థితులు తోడ్పడవు, ఇతని వృత్తిలో భార్యకు సమయం కేటాయించలేడు. ఘర్షణ మొదలు.

చివరకు తండ్రి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్న అనురాధ ఆగిపోవటాన్ని చాలా బాగా చూపించారు దర్శకుడు. ఇరవై వేల రూపాయల చెక్కు డాక్టర్ ఆపరేషన్ చేసిన అమ్మాయి తండ్రి అతనికి ఈయబోతుండగా అక్కడికి వచ్చిన పెద్ద డాక్టర్ ఈయవలసింది ఇతనికి కాదు, ఎంతో త్యాగం చేసి ఇతని చేత ఆ వృత్తిని నిర్వహింపచేస్తున్న ఈ తల్లులకు ఇవ్వాలి అంటాడు. తన కళను, ఎంతో ప్రాచుర్యం కల గాయక వృత్తిని వదులుకుని డాక్టర్ కోసం త్యాగం చేసిన అనురాధ లాంటి వారికి ఈ శ్రేయస్సు చెందాలనటం ఆ రోజులలోనే వివాహ బంధంలో మౌనంగా పురుషునికి అండ దండలుగా నిలబడ్డ ప్రతి ఇల్లాలినీ దర్శకుడు ఆ విధంగా కొనియాడిన తీరు చెప్పుకోతగ్గది. మరునాడు ఉదయం డాక్టర్ ఆమె వెళ్లిపోతుందనుకుంటాడు. ఏమయింది వెళ్లలేదు అని అడిగితే నన్ను పో, తిరిగి రానక్కరలేదు అనే అర్హత కూడా నీకు లేదా? అని ప్రశ్నించి అతని గుండెల మీద వాలిపోతుంది అనురాధ…

ఈ ఇతివృత్తంతో చాలా చిత్రాలు వచ్చాయి. ముఖర్జీ తరువాత ‘అభిమాన్ ‘ కూడా తీశారు. ఈ చిత్రంలో అప్పటికే ఆయన దర్శకత్వం లోని ప్రతిభ కొట్టొచ్చినట్లు ముందుకు వస్తుంది. అనురాధ తనలో పడు ఘర్షణను చిత్రీకరించిన తీరులో ఎంతో నేర్పు కనిపిస్తుంది. ఒక ఫొటోలో అనురాధ ఉంటుంది. ఆమె పక్కన అదే అనురాధ చేరి మాట్లాడుతుంది. ఎన్నో సార్లు భర్త ఈ సారైనా వేళకు తిరిగి వస్తాడనుకుని ఆఖరుకి పెళ్లి రోజున కూడా రాలేకఓయినందుకు బాధ పడి ఇక మెట్ల మీదకు వెళ్లిపోతుండగా వెనుక లాంతరులోని వొత్తి మాడిపోయినట్లు చూపించటం జరుగుతుంది. ఆవేశం అలాంటిది…

సచిన్ భౌమిక్ రచించిన కథ ఇది.  ‘మదాం బొవారీ ‘ అనే గుస్తావ్ ఫ్లబెయి నవల మీద కూడా ఆధారం చేసుకుంది. రజిందర్ బేదీ దీనికి సంవాదాలు వ్రాశారు. ఈ చిత్రానికి సంగీతం పండిత్ రవిశంకర్ అందించారు. ఆంగ్లంలో ఈ చిత్రం పేరు ‘ లవ్ ఆఫ్ అనురాధ ‘.
లతా మంగేశ్కర్ పాటలు చిత్రానికి ఆయువుపట్టు. ‘ హాయె రే వో దిన్ క్యోన్ న ఆయే…’  మరీ మరీ వినాలనిపిస్తుంది. కేవలం ఒక ఇంటి హాల్ లో అందరూ కూర్చుని వింటున్న పాట అయినప్పటికీ భావ ప్రదర్శన అనతలోనే కదిలించేటట్లు ఉండటం ఆ గళం, గీతం, సంగీతం యొక్క కలయికలోని మాయ అనే చెప్పాలి…

ఈ చిత్రం 1961 లో జాతీయ అవార్డు, బర్లిన్ ఫెస్టివల్ కు నామినేషను పొందింది.
~~~***~~~

జాన్స్టన్ అనే చలనచిత్ర పరిశోధకుడు ఒక సారి విషయానికీ, ఆదర్శానికీ మధ్య ఒక అంతరం ఏర్పడి అందులోంచి స్త్రీలకు సంబంధించిన సినిమాలు ఉద్భవించాలని అన్నాడు.  ఆయన ఉద్దేశ్యం ఆదర్శానికి ఎవరైనా దూరం వెళ్లినప్పుడు కథ మొదలవుతుంది అని కాదు. సమాజం అనే స్టేజ్ మీద ఏ రోజైనా స్త్రీది ఆయువుపట్టు గల పాత్ర. రక రకాల మార్పులు జరుగుతున్నప్పుడు స్త్రీ దృక్పథం లోంచి తిరిగి సమాజాన్నీ, సమస్యలనీ పరిశీలించలేకపోతే మనకి ఏదీ అర్థమూ కాదు, ఒక వేళ అయినా అది ఎందుకూ పనికి రాదనే చెప్పాలి…
భారతీయ నేపథ్యం లో కుటుంబం, వైవాహిక వ్యవస్థ బరువు గల విషయాలు కావటం వలన, సాహిత్యం, సంగీతం భావ ప్రదర్శనకు ప్రసాధనాలు చేసుకోవటం వలన తెర మీద సమానాంతరంగా ఒక దాగి యున్న సందేశం, ఒక కలాత్మకత ఇతివృత్తంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక నిజమైన సమస్య కూడా కవిత్వం లోకి వెళ్లిపోయి కరిగిపోతుందా అనిపిస్తుంది!
‘అనురాధ ‘ చిత్రం ఇతివృత్తం అందరికీ తెలిసినదైనప్పటికీ సరళమైన కథనం కోసం, ఒక్క సారి పాత రోజులను తిరిగి ఙ్ఞాపకం చేసుకోవటం కోసం, కొద్ది రోజుల క్రితమే లోకాలు మారిన మన తెలుగు నటి కోసం ఒక్క సారి చూసి తీరాలి!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘ అనురాధ ‘ చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

  1. It gives great pleasure in going through either the reviews or short stories written by you. Your blog gives an opportunity for the people who are away from India to enjoy neatly written articles. It is heartening to note socially responsible articles(like article on leftover food items).

    Thanks a lot
    Venkat

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: