‘ ఆగంతుక్’ చిత్రం మీద వేదాంతం శ్రీపతిశర్మ కబుర్లు


సత్యజిత్ రే 1991లో తీసిన చిత్రమైన చిత్రం ఇది. ఒక డ్రాఇంగు రూం లోనే చాలా మటుకు సినిమా అయిపోతుంది. రెండు గంటలు ఈ చిత్రం ప్రతి సంవాదానికీ, హావ భావాలకీ చూసే వాళ్లని ఆలోచింపచేస్తూ సాగిపోతుంది.
ఆగంతకుని పాత్రలో ఉత్పల్ దత్త్ ఆకట్టుకునే నేర్పుతో నటిస్తాడు. ఒక ఇంటికి ఆ ఇంటిలోని స్త్రీకి మేనమామను అని చెబుతూ ప్రవేశిస్తాడు. అతని మీద సందేహం ఎలా తీర్చుకోవాలి, ఏమి చేయాలి అనే సందిగ్ధంతో ఆ జంట రక రకాలుగా స్పందిస్తుంది. ఒక మిత్రుడు, ఒక లాయరు కూడా ముఖ్య పాత్రలు నిర్వహిస్తారు. వీళ్ల మధ్య మాటలు రకరకాల అంశాలను స్పృశిస్తాయి. చివరకు ఏ సంగతీ తేల్చమని అడిగినప్పుడు మర్నాడు ఆయన ఇక కనిపించడు. ఒక పల్లెటూరులో దొరుకుతాడు. నిజంగా మామ అని తేల్చి ఆ అమ్మాయికి ఆస్తి తాలూకు కాగితాలు అందిస్తాడు…

మనిషి యొక్క  స్పందన,చదువు పేరుతో ఎన్ని విధాలుగా మనిషి ఏవేవో అన్వయించుకుని ఇంకేదో ఎలా మాట్లాడుతున్నాడో, మౌలికమైనవి మరచిపోతున్నాడో…ఈ అంశాలతో పాటు మధ్యలో విఙ్ఞానం, ఆచార వ్యవహారం, మతం, మూఢ నమ్మకాలు…ఇలాంటివి ఎన్నో మాటలలో సాగిపోతాయి. మామూలుగా ఆలోచిస్తే సత్యజిత్ రే సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అందులోనే మరల కేవలం ఒక సమకాలీన పరిస్థితులలో ఎవరైనా అలా ఎందుకు ఉంటారో చెబుతున్నాడా అని కూడా అనిపిస్తుంది. కాకపోతే ఉత్పల్ దత్త్ ఒక ఏంథ్రొపోలోజిస్ట్! ఆయన పాత్ర మనిషి ఆవిర్భావం,  వికాసం, రక రకాల తెగల ఏర్పాటు- ఈ విషయాలకు సంబంధించిన వ్యవహారం. చివరకు ఒక పల్లెటూర్లో ఆయనకు అనుబంధం ఉన్న వారితో ఉండాలని ఆయన ముందరే నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. అసలు ఈయన నిజంగా ఆగంతకుడా?
కాదు. కానీ ఆయన పరిస్థితులు అటువంటివి. ఈ అమ్మాయికి ఊహ తెలియనప్పుడే అమెరికా వెళ్లిపోయి స్థిరపడిపోయిన మేన మామ, మధ్యలో ఎటువంటి సంపర్కం లేని వాడు ఉన్న పళంగా ఇదిగో వస్తున్నాను అని జాబు వ్రాయటం వలన ఆగంతకుడా? అనే ప్రశ్న సినిమాకు మూల స్తంభం అవుతుంది. బంధువు కావచ్చు కానీ బంధుత్వం కాలక్రమంలో మాయమైనందుకు చివరకు గట్టిగానే ప్రశ్నింపబడతాడు. ‘మనిషి ‘ అనే మాటకు సత్యజిత్ రే ఒక గట్టి సవాలు ఈ చిత్రంలో విసిరారు…

అన్నీ ప్రక్కన పెట్టి ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తీ ఒక ఆగంతకుడే అనే తత్వం కూడా కనిపించకపోదు.
సినిమాలో గమనించవలసినది ఏమిటంటే దాదాపు ఒక స్టేజ్ నాటకంలా ఉన్న ఇతివృత్తం తెర మీద నిరాటంకంగా సాగిపోతుంది. దర్శకత్వంలో ఉన్న మహిమ అది. పలు చోట్ల కట్ అయినట్లు కూడా తెలియదు.

~~~***~~~

రియలిసం కోసం సినిమాలోని అన్ని అంగాలూ పని చేయటం ఎలా అనేది ఒక కోణంలోంచి చూస్తే అద్భుతమైన ఆలోచనలు కలుగుతాయి. ఇందులో నరేటివ్ కి పెద్ద పీట వేసి స్టైల్ ను కొద్దిగా ప్రక్కకు లాగటం గమనించవచ్చు! ప్రేక్షకుడికి చూపిస్తున్న సమయంలోకి నిరభ్యంతరంగా అడుగు పెట్టమనే ఆహ్వానం జరుగుతున్న కథలోని ఘట్టాల పంక్తి లో దాగి ఉండటం విశేషం. చాలా మంది దర్శకులకు ఇది చేతకాదనే చెప్పాలి. సహజత్వం ఒక సూత్రంలోకి చేరిపోతుంది. ఇక్కడే కూర్పు అనేది ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కూర్పు కథలోని సరళిని మరింత బాగా చేయటానికి ఒకప్పుడు ఒక మాస్టర్ షాట్ తీసి అందులోని కొన్ని భాగాలను మరల టేక్ చేయటం జరిగేది. ఈ చిత్రంలో ఆ ప్రక్రియ చేసి ఉండవచ్చు అని నాకెందుకో అనిపించింది. మేచ్ కట్స్, ఐ లైన్ కట్స్ అక్కడక్కడ కనిపిస్తాయి…
ఏది ఎలా ఉన్నప్పటికీ ఫేమిలీ డ్రామాలు తీసే దర్శకులు ఒక సారి ఈ చిత్రాన్నీ, ఆ రకమైన టేకింగునీ సమీక్షిస్తే మంచి లాభం పొందగలరని నా అభిప్రాయం!
~~~***~~~

ఈ చిత్రం 1991లో వనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, 1992 లో రెండు జాతీయ అవార్డులు (ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం) తీసుకుంది. ఒక ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా తీసుకుంది.
~~~***~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: