‘శ్రీకృష్ణ పాండవీయం ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


1966 లో నటించి దర్శకత్వం వహించి ఎన్. టి. రామారావు గారు ప్రజల ముందుకు తీసుకుని వచ్చిన ఈ చిత్రానికి చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

పౌరాణిక పాత్రలు ఎలా ఉంటాయి అనేది రవి వర్మ గారి పెయింటింగుల నుంచి ఊహించగలిగితే బాపు గారి బొమ్మలలో గొప్పగా రూపు దిద్దుకున్నాయి. ఈ రెండిటినీ కలబోసి సజీవంగా తెర మీద చూడాలనుకున్నప్పుడు ఎన్.టి.ఆర్ గారు తప్ప మరొకరు కనిపించరు.
‘ ఆర్యన్ ‘ నాసిక, విశాల వక్షస్థలం, అందమైన కళ్లు,చక్కని గాత్రం, హుందా తనం ఆయనకే చెల్లింది.
పౌరాణిక కథలకు అద్దం పట్టిన తెలుగు పద్య నాటక ప్రక్రియ నుంచి, ఆ మేటి కళాకారుల నడక, భావ విన్యాసం నుంచి తెలుగు చిత్రం అలవోకగా తెర మీదకు దూకిన విన్యాసం చెప్పుకోదగ్గది.

ఈ చిత్రం కొన్ని స్టేండర్డ్స్ సెట్ చేసిన చిత్రం.
రెండు పాత్రలు-శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు-ఇవి రెండూ ఎన్.టి.ఆర్ గారు పోషించి వైవిధ్యం చూపించి పాత్రలకు ఉన్న నేపథ్యం, నటనా చాతుర్యం చక్కగా తీసుకుని వచ్చారు.

కథ తెలిసినదే. భారతంలో ఏమున్నదీ లేనిదీ అనేది ప్రక్కన పెట్టి కాన్సెప్చువల్ గా కథను చూడాల్సి ఉంటుంది. దీనికి ప్రధానంగా నాటక ప్రక్రియ ప్రభావం అని అందరికీ తెలిసినదే.

శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలచి అడుగడుగునా ఆదుకొనటం, ఆయన గాంధర్వ వివాహం, మయ సభలో సుయోధనుని పరాభవం, దంతవక్త్ర, జరాసంధ వధ, బకాసుర వధ, హిడింబ తో భీముని వివాహం,ఇలా సాగి చివరకు ధర్మజుడు తలపెట్టిన రాజసూయం లో శిశుపాల వధతో కథ ముగుస్తుంది.

మామూలుగా ఆలోచిస్తే శ్రీకృష్ణునికీ, పాండవులకీ మధ్య గూఢమైన సంబంధం కృష్ణార్జునుల నరనారాయణ స్వరూపం.అది కృష్ణావతారం లోని ఒక భాగం.కాకపోతే తాత్వికంగా కాకుండా కథా స్వరూపంగా తలపెట్టి అటు ప్రతినాయకులను వారి అంతరంగం ద్వారా చూపించి పాందవులలో భీముని ముందుకు తేవటం జరిగింది…అందు చేత శకుని వృత్తాంతం, సుయోధనుని మయ సభ ఘట్టం ప్రధానంగా కనిపిస్తాయి.

శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తున్నప్పుడు కనుల విషయంలో ఎన్.టి.ఆర్ గారిని జాగ్రత్తగా పరిశీలించాలి. దీనిని ‘లుకింగ్ బియాండ్ ‘ అని గుర్తించాలి. ఎదురుగా నిలబడిన పాత్ర వైపే కాకుండా కొద్దిగా దూరంగా చూస్తున్నట్లు కళ్లను నిలపటం ఒక ప్రక్రియ. కళ్లు పెద్దవి చేసి చిరునవ్వు నవ్వటం శ్రీకృష్ణుని రూపంలో ఆయనకే చెల్లింది. అదే దుర్యోధనుని దగ్గరకు వచ్చినప్పుడు కళ్లు పెద్దవి చేస్తారు. కానీ కనుబొమ్మలను కొద్దిగా సంకుచితం చేసి
తల కొద్దిగా వంచటం జరుగుతుంది.ఇది చిత్రమైన విషయం. జాగ్రత్తగా చూస్తే ఇలా చేసినప్పుడు వ్యక్తిలోని క్రౌర్యం ,కపటం ప్రతిబింబిస్తాయి. ఇది నటునిలోని ప్రతిభా పాటవం.
నడక దగ్గరకు వస్తే దుర్యోధనుని నడక ఇలా తప్ప మరోలా ఉండదు అనిపిస్తుంది. ఎడమ చేయి కొద్దిగా ముందుకు వచ్చి అర క్షణం ఆగి ఒక అర్థ చంద్రాకారంలో మరల వెనక్కి వెళుతూ ఉంటుంది.

ఈ చిత్రంలో పాటలు గొప్పగా ఉంటాయి. ‘స్వాగతం ‘ పాట వెంపటి చిన్న సత్యం గారి నాట్య కళకు ఒక తార్కాణం.సంగీతం అందించిన టి.వి.ఎస్. రాజు ఇలా ఎన్ని సినిమాలు చేశారో తెలియదు. సంగీతం పాత్రలకు, సన్నివేశాలకు అలా అద్దం పట్టినట్లుంటుంది. ‘ప్రియురాల సిగ్గేలనే ‘ పాట ఘంటసాల గారి గళంలో భగవంతుడు పాడితే ఇలా ఉంటుందేమో మరి అని ఒక క్షణం అనుకుంటామేమో!
వీటికి భిన్నంగా హిడింబకు పాడిన జిక్కీ గారు మాధుర్యానికి మరో పేరు అనిపించారు. ‘అయ్యారే నీకే మనసియ్యాలని ఉందిరా…’
ఇందులో ‘ అయ్యారే ‘, ‘ ఇయ్యాలని…’-ఈ రెండు పదాలను పలికిన తీరు అద్భుతం! ఒక్క సారి ఝాంగురే బంగారు జిక్కీ రాణీ అనిపించింది!

ఈ సినిమాలో చివరి సన్నివేశం తో పాటు మయ సభ, హిడింబ పాట ఇలాంటివి తలచుకున్నప్పుడు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్, ఆర్ట్ దర్శకుడు కె.వి.రాజు గార్లను మెచ్చుకోకుండా ఉండలేము.ముఖ్యంగా రాజసూయం చివరిలో పురుషసూక్తం వినిపిస్తున్నప్పుడు తీసిన దృశ్యాలు దైవం ఒక ఘటనలోకి వచ్చినప్పుడు ఇలా ఉంటుందేమో అనిపించేలా చిత్రీకరించారు.

ఈ చిత్రం కూడా కొన్ని పాత చిత్రాల లాగా రంగులు పూసుకుంటే మరో సారి చరిత్ర సృష్టించగలదని అనిపిస్తోంది!

సినిమాలో ఒక చోట కొద్దిగా నవ్వొచ్చింది. ‘ మత్తు వదలరా ‘ పాట దగ్గర భీముడు కళ్లు మూసుకుని పడుకుని ఉంటే శ్రీకృష్ణుడు రెండు వేషాలలో చెట్టుకు అటూ ఇటూ ఎవరు చూసేందుకు వేషాలు మారాడో అనుకున్నాను.అవసరం లేదనిపించింది.

మన నాటక ప్రక్రియలోని ప్రతిభను తెర మీదకి తెచ్చి, మన పురాణాల లోని అద్భుతమైన సన్నివేశాలను చిరకాలంగా నిలచిపోయేటట్లుగా, పౌరాణిక పాత్ర పోషణ ఇలా ఉండాలీ అనుకునేటట్లుగా, తెలుగు వారికే ఉన్న ఈ విలక్షణమైన ప్రతిభను ప్రపంచానికి చాటిన నందమూరి వారు ధన్యులు!

అందుకే ఆయన ‘సకల మహీపాల మకుట శోభా నీరాజితుడైన రారాజుగా ‘ అందరి గుండెల్లో అలా నిలచిపోయి ఉన్నారు!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “‘శ్రీకృష్ణ పాండవీయం ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

  1. An interesting take on an interesting movie.
    దర్శకత్వంలో చాలా ప్రతిభ చూపిస్తూనే మూలకథల్ని మార్చడంలో రామారావు చాలా వెర్రితలలు వేశాడానిపిస్తుంది ఈ సినిమాలో.
    మరికొన్ని విచిత్రాలు లేకపోలేదు .. తన సొంత సినిమాలో ఇంకో స్టారుకి (భీముని పాత్రధారి పేరిప్పుడు గబుక్కుని గుర్తు రావట్లేదు) ఒకటి కాదు రెండు పాటలు పెట్టడం చాలా గొప్ప విషయం. మయసభ సీను, ఆ తరవాత మనుటయా మరణించుటయా సీను .. ఈ రెండూ మాత్రం అమోఘం.

  2. భీముని పాత్రధారి పేరు ఉదయ్‌శంకర్. కన్నడ నటుడు.
    చిన్న అచ్చుతప్పు — సంగీతం టీవీయస్ రాజు – శర్మ కాదు.

  3. (యాధృచ్చికంగా కూడలిలోకి వచ్చిన)నా ఉదయం ఇవ్వాళ ఒక మంచి సినిమా గురించి చదవటంతో మొదలయ్యినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి.2009 లో మొట్టమొదట ఈ సినిమాతోనే సినిమాలు చూడడటం మొదలు పెట్టాను.శ్రీకృష్ణపాండవీయం గురించి త్వరలో నవతరంగం లో రాయనున్నందున ఇక్కడ వివరంగా వ్యాఖ్యానం చేయలేకున్నాను. ఈ సినిమాకు సంగీతం సమకూర్చింది టి.వి.రాజు–రాజ్-కోటి ద్వయంలోని రాజ్ తండ్రిగారు.పాతతరం సంగీతదర్శకుల్లో పాశ్చాత్యసంగీతాన్ని అద్భుతంగా తెలుగుసినిమాలలో వినియోగించినవారు ఆయన.ఎక్కువగా యన్.టి.రామారావు చిత్రాలకు సంగీతం అందించారు.భీమసేనుని పాత్రధారి ప్రముఖ నటుడు ఉదయ్ కుమార్.రాజ్ కుమార్,కళ్యాణ్ కుమార్,ఉదయ్ కుమార్ లను కన్నడ చలనచిత్ర త్రిమూర్తులుగా పిలిచేవారు.తెలుగులో చాలా సినిమాలలో నటించారు.ఉదయ్ కుమార్ చివరిరోజుల్లొ నటించిన విజయవంతమైన తెలుగుసినిమా మగమహారాజు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: