‘ మధుమతి ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


నాలుగు మంచి సినిమాల గురించి చర్చించుకుంటున్నప్పుడు మధుమతి ‘తెలియకుండానే ‘ ప్రవేశిస్తుంది. పాటలు వినాలని అనిపించినప్పుడు ఒక సారి సినిమా పెట్టుకుని చూద్దామనిపిస్తుంది. సినిమా చూశాక ఒక సారి మరల పాటలు చూద్దామనిపిస్తుంది. మధ్యలో కొన్ని దృశ్యాలను మళ్లీ చూద్దామనిపిస్తుంది…దీని గురించి మాట్లాడాలనిపిస్తుంది. అంటే చాలా సింపుల్! చరిత్ర సృష్టించిన విషయంలోని చమక్కు అలాంటిది. సగటు భారతీయ కళాకారునిలోకీ, ప్రేక్షకులలోకీ అలా దిగిపోయి ఎక్కడో ‘ ఆజారే..మై తో కబ్ సే ఖడీ…’ అంటూనే ఉంటుంది మధుమతి!

~~~***~~~

1958 లో బిమల్ రాయి దర్శకత్వం లో వచ్చిన చిత్రం ఇది.దీనికి కథ రిత్విక్ ఘటక్,మాటలు రాజేందర్ సింగ్ బేడి,సంగీతం సలిల్ చౌధరీ, కూర్పు హృ షీ కేశ్ ముఖర్జీ అందించారు.
దిలీప్ కుమార్, వైజయంతీ మాలా బాలీ, ప్రాణ్, జానీ వాకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

 ~~~***~~~

ఒక సారి అనిపిస్తుంది-ఈ చిత్రం సంగీత ప్రధానం కాకపోతే ఎలా ఉండేదీ అని.నిజమే! సలిల్ చౌధరీ అందరినీ మరో ప్రపంచం లోకి తీసుకుని వెళ్లిపోయాడు. పాటలే కాదు. నేపథ్య సంగీతం-నిశ్శబ్దం కూడా మనలను నిలబెడుతుంది!

ఎంచుకున్న విషయం మనసుకు చాలా హత్తుకునేది. జనపదం లోని బేలతనం, రాజా జమీందారుల ఘోరాలు, పసిడి ప్రేమ, ఒక యువకుని తాపత్రయం. కాకపోతే ఇక్కడ కవిత్వం ప్రధాన మైనది. ప్రకృతితో పాటు కథ సాగిపోవాలి. తొలి పాటలో ప్రధానమైన మాట- మెరీ దునియా, మేరే సప్నే మిలేంగే షాయద్ యహీన్…అక్కడ వంగిన ఆకాశం, భూమిని కలుసుకున్న తీరును ఈ విషయం తొ ముడి పెట్టారు. అలాగే చివరి పాటలో అతను  పొందినది అనుకున్నది, పోగొటుకున్నందుకు బాధ పడటం అనేది ఒక భావుకుని వ్యవహారం-రూఠే హైన్ జానే క్యోన్ మెహ్ మాన్ వొ మెరే దిల్ కె!టూటే హువె  ఖ్వాబోన్ నే…

సినిమాలో పాత్రల ప్రవేశం ఆ రోజులకే ఎంతో ఆలోచనతో చేసినట్లు కనిపిస్తుంది. దిలీప్ కుమార్ ఒక నాణేం పైకి విసిరినప్పుడు చెట్టు మీద నుంచి దానిని పట్టుకుని జానీ వాకర్ దిగుతాడు. అలాగే సంతలో చిన్న పిల్లవాడి మీదుగా గుర్రాన్ని దాదాపు నడుపబోయిన ప్రాణ్ విలన్ గా ప్రవేశిస్తాడు. జానీ వాకర్ పాత్రపోషణ తెలియకుండా ఆకట్టుకుంటుంది.
‘ అమ్మాయిలు ఎటు వెళుతున్నారు? ‘, అని దిలీప్ కుమార్ అడిగితే ‘ ఇటు రానప్పుడు ఎటు వెళితే ఏమిటి? ‘ అంటాడు జానీ వాకర్!

సినిమాలో  డి సా ల్వ్ పధ్ధతినీ, ఒక దృశ్యానికీ, మరో దృశ్యానికీ గల లింకును జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవటాన్నీ చూడవచ్చు.

వైజయంతీ మాలా బాలీ పేరు మధుమతిగా మరి మార్చుకున్నదేమో! ఆ నాట్యం లేకపోతే పాత్ర ఎక్కడికి వెళ్లేదోననిపిస్తుంది. జానపదం నృత్యానికి అణువుగా సలిల్ అల్లిన సంగీతం చెరగని ముద్ర వేసింది. సినిమా యావత్తూ ఒక జలపాతం ధారగా ఆ కొందలలో లోయలలోంచి అలా జారిపోతున్నట్లు సంగీతం వినిపిస్తూ ఉంటుంది.
‘ జుల్మీ సంగ్ ఆంఖ్ లడీ…’ పాట సలిల్ చౌధరీ హృదయం లోని చిన్న పిల్లవాడి కేరింత ఏమో అనిపిస్తుంది. జాన బెత్తెడు కాదు జానపదం, సాహిత్య సంగీత ఙ్ఞాన పథం మన జానపదం!

‘బిఛువా ‘ పాటలో వైజయంతీ మాలా ఒక చిత్రమైన మిశ్రమం చూపించింది. ఒక సారి తిన్నగా నిలబడి పాదాలు ఏ మాత్రం కదపకుండా ఒక విన్యాసం చూపిన తీరు నటనకీ, నాట్యానికీ ఎన్ని పాళ్లు సరిపోవాలో అని ఆలోచించగలిగే వారికి ఒక  చక్కటి పాఠం!
గ్రేస్-నీ పేరు వైజయంతి!

 ~~~***~~~

కిత్నీ భయానక్ రాత్ హై-ఈ చివరి సన్నివేశం లోని మాట, కెమెరా వర్క్, వెనుక పిడుగుల శబ్దం వినిపిం చడం  మీద చాలా వ్యాఖ్యలు వచ్చాయి. శబ్దం ఆ మాట ముందు వినిపిస్తున్నప్పుడు బిమల్ రా య్ ఎన్నో సార్లు కట్ చేశాడుట. అన్నీ ఒక సారే జరగాలి అన్నాడు దర్శకుడు.ఇదే ఘటనకు, ఘటనను ప్రదర్శించే దర్శకుని ఆలోచనకూ ఉన్న బంధుత్వం. తెర మీద జరుగుతున్నదానిని నేను చూపించటం లేదు. తెర మీద జరుగుతున్నదానిని మీతో పాటు నేనూ చూస్తున్నాను! నేను ఇది చూస్తున్నాను అని మీకు చెప్పటంతో నా సినిమా ప్రారంభమవుతుంది.అది జరిగి పోతుంది…

~~~***~~~

లతా మంగేశ్కర్ స్వరం ఆ గాలులలో ఎక్కడో ఖచ్చితంగా అతుక్కుని పోయి ఉంటుంది. ‘సలిలంగా ‘ సాగిపోయింది మరి. ఆయన సమకూర్చిన పాటలు సాహిత్యంలోంచి దూకిన తరంగాలు-ఉదాహరణకి దిల్ తడప్ తడప్…నిజంగా ఆ సన్నివేశంలో ఉన్న ప్రేమికుని గుండె లోని శబ్దాన్ని శబ్దం లోకి దింపాడా అనిపిస్తుంది.దర్శకుని హృదయంతొనూ, కథాంశంలోని మర్మంతోనూ, కెమెరా వర్క్ తోనూ,ప్రకృతితోనూ,భావ విన్యాసంతోనూ సంగీతం కలసి నాట్యం చేసిన తీరు-ఇక్కడ మేజిక్ ఉంది. ఇక్కడే ఉంది.

~~~***~~~

ఈ చిత్రం ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను తీసుకుంది. వాటికంటే ఈ చిత్రం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలోని చిత్ర దర్శకులను కూడా ఆలోచింపచేసింది. ఈ కథను ఆధారంగా చేసుకుని అలా సినిమాలు వివిధ భాషలలో వస్తూనే ఉన్నాయి, వస్తాయి కూడా.
సుధేందు రా య్ గారికి ఈ చిత్రానికి అందించిన ఆర్ట్ డైరెక్షన్ కు అవార్డు లభించటం గణనీయం.

ఒక చిత్రకారుడు, ఒక కవి, ఒక గాయకుడు, ఒక రచయిత అలా నా ప్రపంచం, నా కలలు అనుకుంటూ కూర్చుని ఉన్న ప్రతి చోటా, ప్రతి సారీ అక్కడ ఒక బాబూజీకి ఒక మధుమతి దొరకాలనిపిస్తుంది…ప్రకృతి కూడా ఆ మువ్వల సవ్వడికి స్పందిస్తుందనిపిస్తుంది…

 ~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ మధుమతి ‘-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: