‘పాకీజా’-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు


ఎండలో తిరుగుతూ ఒక చెట్టు క్రింద చల్లని నీడలో కొద్ది సేపు నిలబడితే ‘ సరె రాహ్ చల్తే చల్తే…’ అనిపించి ప్రాణం కుదుట పడుతుంది. ఎన్నో గొడవల మధ్యలో ఒక సారి పాకీజా చిత్రం పూర్తిగా చూసినప్పుడూ అలాగే అనిపించింది. అది వరకు చాలా సార్లు చూసిందే. అయినా లతా మంగేశ్కర్ మేజిక్, ఆ కథనం, దృశ్యాలు, ఆ రైలు, కూత, నటీ నటుల విన్యాసాలు …ఇవన్నీ కలిపి సంపూర్ణమైన భోజనం చేసినట్లు తృప్తిగా ఉంటుంది. 

~~~***~~~

కమల్ అమ్రోహి, మీనా కుమారి తొలుత ఈ చిత్రం గురించి 1958 లో ఆలోచించారు.14 సంవత్సరాల తరువాత తెరకెక్కిన ఈ చిత్రం ఒక విచిత్రం. తెరకెక్కిన 

కొద్ది రోజులకే మీనా కుమారీ జీవితం మీద తెర పడిపోవటం కూడా బాధగా ఉంటుంది.

 ఉత్తర్ ప్రదేశ్ జమీందారీ, అక్కడి కళాపోషణ మధ్యలో ఒక ప్రేమ వ్యవహారం,సంప్రదాయానికీ సరసమైన సహజమైన ప్రేమకీ ఉండే వివాదానికీ,  ఆ భారీ సెట్టింగులు, అతి సూక్ష్మమైన వస్తువునీ చిత్రీకరించటం,సాహిత్యం, సంగీతం, నేపథ్య సంగీతం అన్నీ తోడవుతాయి ఈ చిత్రం లో.
  

శాహాబుద్దీన్ నర్గిస్ అనే ఒక తవాయఫ్ ని ప్రేమించి ఆ నరకం నుంచి విడిపిస్తానని చెప్పి వివాహం చేసుకునేందుకు ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటిలోని హకీం గారు ఒప్పుకోరు. నర్గిస్ అవమానం భరించలేక కబ్రిస్తాన్ కి వెళ్లిపోయి శహాబుద్దీన్ కూతురుని కని ఒక లేఖ వ్రాసి చనిపోతుంది. ఈ అమ్మాయిని ఆమె ‘ఖాలా ‘ తీసుకుని వెళ్లి పెంచుతుంది. ఆమె పేరు సాహిబ్ జాన్ (తరువాత పాకీజా). తన కూతురును వెతుక్కుంటూ శాహాబుద్దీన్ ‘ కోఠీ’ కి వస్తాడు. ముజ్రా లో కూర్చుంది, మర్నాడు రండి అని కిందకి వచ్చి చెబుతుంది సాహెబ్ జాన్ ఖాలా. అతను బండీ ఎక్కి వెళ్లిపోతాడు. మనకి తన కుడు చేయి అటు చూపించి అటు తిరిగి కూర్చున్న సాహెబ్ జాన్ (మీనా కుమారీ) కనిపిస్తుంది. వీళ్లే కదా…ఇన్ హీ లోగో నే…పాట ప్రారంభమవుతుంది. ఇంత వరకూ సినిమాకు ఒక ఉపోద్ఘాతం.కానీ తరువాతది మనకి ఒక చరిత్ర-ఒక లిజెండ్!

~~~***~~~

సినిమాలంటే ఇష్టపడే వారు, ఆలోచించే వారు ‘పాకీజా ‘ చూడకుండా ఉండరు. ఇందులో ఒక భావ విన్యాసం ఉంటుంది. క్రిస్టలైసేషన్ కనిపిస్తుంది. ఎక్కడ శబ్దం, ఎక్కడ నిశ్శబ్దం, ఎక్కడ మాట, ఎక్కడ పాట, ఎక్కడ కేవలం భావ ప్రదర్శన ఉండాలీ, ఇవి ఏ పాళ్లలో ఉండాలీ అని తెలుసుకోవాలంటే రి వైండ్ చేసుకుని చూసుకోవచ్చు. చాలా చోట్ల కెమెరా మాట్లాడుతుంది…

ఘులాం మొహమ్మద్ ఇచ్చిన పాటలు అలా గాలిలో ఇప్పటికీ ఎప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. పాటలు నలుగురు కలసి వ్రాశారు-మజ్రూహ్ సుల్తాన్ పురి, కైఫీ ఆజ్మీ, కైఫ్ భోపాలీ, కమల్ అమ్రోహీ. సాహిత్య సంగీతాలు లత లాగా పెనవేసుకుంటాయని అనకూడదు. ఎక్కడో చక్కని మల్లె పూల సుగంధం వచ్చినప్పుడు అటు వైపు ఎలా వెళ్లి కూర్చోవాలనిపిస్తుందో సంగీఅతం సాహిత్యం వైపు అలా లాక్కెళుతుంది.

చల్ తే చల్ తే… ఘజల్ అద్భుతమైన సమయం లో ముందుకు వస్తుంది. సరోద్ లోని మేజిక్, ఆ చిన్న పంక్తులలోని భావాలు ఆలోచింప చేస్తాయి. యె చిరాగ్ బుఝ్ రహే హైన్…మెరే సాథ్ జల్తె జల్తే…ఈ పటలో మీనా కుమారీ ముందు రెండు -గడచిన జీవితం, రైలులో తారసపడ్డ వ్యక్తి వ్రాసిన లేఖ వలన ఏవో ఆశలు…ముందు ముజ్రాలో కూర్చున్న అభిమాని-ఇన్ని కలసి అక్కడ ‘ ప్రదర్శన ‘ ఇవ్వాలి. ఆమెకే చేతయింది. ఒక సారి ఆలోచిస్తే అక్కడ అటువంటి ఘజల్ పడకపోతే ఎలా ఉండేదో అనిపిస్తుంది. కథనానికి, ట్రీట్మెంటుకీ వస్తే పటలలోని తేడా గమనించాలి.’ఇన్ హీ లోగో నే ‘ పాటలో , అలాగే థాడే రహియో పాటలో ఆమె నాట్యగత్తెగా చలాకీతనం, అందులోనే హుందా తనం చూపిస్తుంది. నాణేల మూట పెట్టిన వాడి దగ్గర చిలిపిగా నవ్వుతుంది. ఈ ఘజల్ దగ్గర అవి ఉండవు. ఒక విరహిణి చూపే భవ ప్రదర్శబ్నలోకి సున్నితంగా జారి పోతుంది. ఒక పరిస్థితిలో ఒక భావ ప్రదర్శనను ఎంచుకో గలిగితే మరొక పరిస్థితిలో సూక్ష్మమైన మార్పును చూపించవచ్చు. నటనలోని ఒక చిన్న మాట ఇది!
 
 

సీనుకీ సీనుకీ మధ్య దృశ్య పరిచయం దర్శకుని ప్రతిభకు అద్దం పడుతుంది. ‘నేను తవాయఫ్ ను ‘ అన్నప్పుడు ఫ్రీజ్ షాట్. దాని తరువాత రాజ్ కుమార్ ఆమెను కింద నుంచి లేపుతాడు. ఈ లోపల ఆకాశం కనిపిస్తుంది. ‘ చలో దిల్ దార్ చలో…’ ఇది పాట చిత్రీకరణలో ఒక సిలబస్!
మొత్తం సినిమాలో మగ గొంతు కూడా పాడే పాట ఇది ఒక్కటే.
 మొహమ్మద్ రఫీ గారు లతా గారితో గళం కలిపి కొద్ది సేపు పడారు. అది చాలు. పాట మధ్యలో ఒహోహో…అని పై స్థాయిలో ఆయన రాగం తీసినప్పుడు నిజం గానే ఈ కట్టు దిట్టాల నుండి అందరం అక్కడ చూపించిన చంద్రుడు, మేఘాల లోకి సునాయాసంగా వెళ్లిపోతాం…

~~~***~~~

తన ఇంటిలో రాజ్ కుమార్ చెబుతాడు-యెహ్ ఏక్ దల్ దల్ హై, యెహ్ బడీ ఖతర్ నాక్ జగహ్ హై!
అఫ్ సోస్ కి కుఛ్ లోగ్ దూధ్ సే భీ జల్ జాతే హైన్!
…ఒక నవ తరం ఆలోచించ వలసిన విషయాల మీద కొన్ని ప్రతి బింబాలు కనిపిస్తాయి.

ఒక రైలు అలా రాత్రి వేళ వెళ్లినప్పుదల్లా ఎక్కడో ఒక సంగీతం, ఒక పాట, మరేదో ఆలోచన…ఆ కూత మరోలా కూస్తూనే ఉంటుంది!

~~~***~~~
 

1992 లో సినీ విమర్శకుడు పీటర్ వోలెన్ ‘ పాకీZఆ ‘ను 10 అత్యద్భుత చిత్రాలలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇది ‘ సైట్ అండ్ సౌండ్ ‘ పోల్ లో (అభిప్రాయ సేకరణ)తేలిన విషయం.

కమల్ అమ్రోహీ ఒక లెన్సులోని తత్వాన్ని చాలా క్షుణ్ణంగా చెప్పగలడు. ఆయన దగ్గర ఉన్న ఒక లెన్సును పట్టుకుని దీని ఫిల్మ్ ఫోకస్ లో లేదు అని అన్నాడుట. దానిని లండన్ లేబ్ వారు పరీక్షించి ఫోకస్ లోనే ఉందని చెప్పారుట. అయినా ఆయన వినలేదు. అప్పుడు అమెరికా వాళ్లు పరీక్షించి ఇది 1/100 పరిమాణం లో ఫోకస్ లో లేదు అన్నారుట. ఆ తరువాత 35 ఎం. ఎం కెమెరాలో పెట్టగలిగిన ఆ లెన్సుని 20 సెంచురీ వారు కమల్ అమ్రోహీకి బహుమతిగా ఇచ్చారుట…

దృష్టి కలిగిన వాడే దర్శకుడు…తీర్ ఎ నజర్ దేఖేంగే, జఖ్మ్ ఎ జిగర్ దేఖేంగే…

~~~***~~~

…చాలా చెప్పవచ్చు. ఒక కవిత హృదయంలో పాడుతూ ఉంటుంది. ఒకటి కాగితం మీద కదులుతూ ఉంటుంది. ఒకటి మౌనంగా పెయింటింగులోంచి తొంగి చూస్తూ ఉంటుంది. ఒకటి తెర మీద అలా సాగిపోతుంది. అలా మెరిసి అలా మన లోపలికి మాయమవుతుంది.

కమ్మనైన ఆలోచనతో ఏ బొమ్మ కలసిపోయినా ఒక జీవనదిలా సాగిపోతుంది…

న కభీ ఖత్మ్ హో ఉల్ఫత్ కా సఫర్…!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘పాకీజా’-చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ కబుర్లు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: