‘కుడి భుజం ‘-వేదాంతం శ్రీపతి శర్మచిట్టి కథ


 

బస్సు కిటికీ దగ్గర కూర్చుని ప్రదేశమంతా పరిశీలిస్తున్నాను. నా పక్కన ఏదో పెద్ద బస్తా ఎవరో పడేశారనుకున్నాను. కాదు. ఒక పెద్దాయన ఎలా కూర్చున్నాడో కూర్చున్నాడు.
‘ కలిసే వెళదాం!’
‘ …’
‘ పేరు? ‘
నా పేరెందుకు? కలసి వెళ్లేది ఏముంది? బస్సన్నాక అందరూ కలసే వెళ్లాలి.వదలలేదు.
‘ పేరు? ‘
‘ రాజా…’
‘ కాజా?’
‘ ఖర్మ!’
‘ వర్మ? ఏమిటి ఇంతకీ?’
చేతిలోకి పెన్ను తీసుకుని న్య్స్ పేపర్ మీద వ్రాశాను. చదివి జేబులో పెట్టుకున్నాడు. బస్సు కదిలింది.
‘ ఏమి చేస్తూ ఉంటావు?’
‘ వ్రాస్తాను ‘
‘ రాసుకుంటావా? ఎందుకు?’
దినఫలాల్లో ఒక వ్యక్తి నన్ను ఆకట్టుకుంటాడు అని వ్రాశారు. ఇదన్నమాట. ఇదేమి ఆకట్టుకోవటం?
‘ పేపరుకు వ్రాస్తాను ‘, గొంతు చించుకున్నాను. ఆయన చిన్నగా నవ్వాడు.

‘ ఈ బస్సు ఎందుకు ఎక్కావు?’
నీ కోసమే! అందామనుకున్నాను.
‘ రైల్లో టికట్ దొరకలేదు ‘
‘ జైల్లో?’
‘ రైలు! రైల్లో దొరకలేదు ‘
చిన్నగా నవ్వాడు.
వినలేని వాళ్లకి మాట్లాడాలని ఎనలేని ఉత్సాహం ఎందుకో మరి ఈశ్వరుని సృష్టి!
‘ నేను కుదుపుకి పడిపోతాను. నన్ను నువ్వు చూసుకోవాలి!’
‘…’
అలాగే, పడిపోతే చూస్తాను!
చూస్తావా చూడవా అన్నట్లు తల పైకీ కిందకీ ఆడించాడు.
‘ అలాగే నండీ ‘
ఊరు దాటింది బస్సు. కుడి భుజం మీద తిరగలి పెట్టినట్లయింది. ఇటు తిరిగాను. ఓహో! పెద్దాయన తల ఆంచి చక్కగా నిదురిస్తున్నాడు.
అక్కడ ఏకుపంచర్ చికిత్స చేస్తున్నట్లనిపించి పరిశీలించాను. ఆయన జుట్టు మహిమ అది! సూదులు లోపలికి వెళ్లిపోయాయి. పెద్దాయన బాగానే ఆకట్టుకున్నాడు! ఇంటికి వెళ్లాక కట్లు కట్టుకోవాలి.
బస్సు ఆగ గానే లేచాడు.
‘ ఏ ఊరు?’
‘ తెలియదు ‘
‘ ఎలికలపాడా? ఇక్కడెక్కడది?’
ఓహో! మీ ఊరదా? అర్థమైంది.
‘ తెలియదు ‘
‘ ఆ మాత్రం తెలియకపొతే ఎలా?’
నేను మాట్లాడలేదు.
బస్సు కదిలింది.
‘ నేనూ కుదుపుకి పడిపోతాను. చూస్కోవాలి నువ్వు!’
అంటూనే నా భుజం అద్దెకిచ్చినట్లు చెయ్యి పెట్టి దులిపి మరీ వాలిపోయాడు.
నేను ఎందుకు చూస్కోవాలి ఈయన్నీ?

కొద్ది సేపు అలా బస్సు మెల్లగా సాగిపోయింది.ఎక్కడో చిన్నగా కుదుపు వచ్చింది. ఆయన ఉలుక్కున లేచాడు.’ అబ్బా, అలా కదలకు బాబూ,నాకు నిద్రాభంగం కలుగుతున్నది.’
ఏమిటీ దౌర్జన్యం?
‘ అయ్యా, నేను కదలలేదు. నా శరీరం ఎప్పుడో బిగుసుకుపోయింది మరి. బస్సు సడెన్ బ్రేక్ వలన అలా కుదుపు వచ్చింది.’
‘ నేను ఈ బస్సు ఎక్కినప్పటినుంచీ అదే చెబుతున్నాను. కుదుపుకు నేను పడి పోతాను మరి. నన్ను చూసుకోవాలి నాయనా!’
కండక్టర్ అటు వెళుతూ ఒక చిటికె పారేశాడు.’ పెద్దాయన చూసుకోండి సార్!’
నా భుజాన్ని కొద్దిగా చేతితో తడిమి చూశాను. తడి ఏదీ తగలలేదు. దేవుడున్నాడని నిర్ధారించ్కున్నాను. ఆయన మరల దాని మీద వాలిపోయాడు.
నా ఊరు ఎప్పుడొస్తుందో ఏమో!
కొద్దిగా చీకటి పడింది. అవతల చెక్ పోస్ట్ పడి బస్సు ఆగిపోయ్తింది. నలుగురు పోలీసులు లోపలికి వచ్చి తనిఖీ చేయటం మొదలు పెట్టారు. అవి ప్రొహిబిషన్ రోజులు!
ఒక కాన్స్టెబల్ నా పైన బాగు తీసి దాని పాకెట్ కెలుకుతున్నాడు. అందులోంచి ఎలా వచ్చిందో ఒక బాటిల్ వచ్చింది. ‘ఎవరిది?’
అడిగాడు.నేను లేచాను. నన్ను పట్టుకుని కిందకి తీసుకుని వెళ్లారు.
ఆ ఇన్స్పెక్టర్ నేను చెప్పినదేదీ నమ్మలేదు. చీకటి పడుతోంది. జనం దిగి అవసరాలు తీర్చుకుంటున్నారు.ఎవరో కావాలని ఇందులో పెట్టి తప్పించుకున్నారు.ఇప్పుడెలా? ఆ ఇన్స్పెక్టర్ బస్సును వెళ్లిపొమ్మంటున్నాడు. బస్సు కదలటం లేదు. ఆ పెద్దాయన ఎక్కలేదుట!. నేను దిగులుగా నిలబడ్డాను. ఇంతలో ఆ చెక్ పోస్ట్ వెనుక నుండి పెద్దాయన వచ్చాడు. ఇన్స్పెక్టర్ కోసం లోపలకు వెళ్లి రెండు నిమిషాలలో నా దగ్గరకు వచ్చాడు. ‘ పద నాయనా, నేను చెప్పాను.బస్సు వెళ్లిపోతోంది ‘
ఇద్దరం లోపలికి ఎక్కాం. ఈయన ఏమి చెప్పి ఉంటాడు?
‘ సార్, మీరు ఏమి చెప్పారు? నా భుజం మీద పడుకోవాలనా?’
‘ ఆ బాటిల్ ఎక్కడిది? నిజం చెప్పు!’
‘ తెలియదు!’
‘ నేను నిన్ను నమ్ముతాను. కాకపోతే ఎవరో తప్పుకున్నారు.’
‘ మీరు ఏమి చెప్పారు? నన్ను ఎందుకు వదిలేశారు?’
‘ అది నాదని చెప్పాను!’
‘ ఛా! మరి మిమ్మల్ని ఎలా వదిలేశారు? ‘
‘ నా జేబులో ఉన్న నా వ్యాధి తాలూకు డాక్టర్ సర్టిఫికెట్ ఇది. నాకు కళ్లు తిరిగినప్పుడు నేను కొద్దిగా వాడాలని ఉంటుంది.’
నేను ఏదో అడగబోయే ముందు ఆయన మరల భుజం మీద వాలిపోయాడు.’ నాకు కుదుపు పడదు. నన్ను చూసుకోవాలి జాగ్రత్త!’
‘ మరి మీ దగ్గర అటువంటి బాటిల్ లేదు కదా?’
‘ లేదు. ఎన్నని కొనను? డబ్బులు లేవు!’
‘ మరి ప్రయాణం ఎందుకు?’
‘ సరదా కాదు. అవసరం. నాకు ఇలాంటి భుజాలు లేవు. అందరూ వెళ్లిపోయారు. నేను పోయే వరకూ ఇలా పోతూ ఉంటాను. నన్ను చూస్కో! నాకు కుదుపు పడదు!’
ఆ బస్సు అలా పోతోంది…ఆయన నిద్ర పోయాడు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: