‘ శనీచరి ‘ మహాశ్వేతా దేవి 10 కథల పుస్తక సమీక్ష


జనసాహితి వారు ప్రచురించిన  ఈ పుస్తకం మహాశ్వేతా దేవి గారి 10 కథలకు నిర్మలానంద గారు అందించిన అనువాదాలు.
ఇందులోని పది కథలు-1. భీకర యుధ్ధం తరువాత 2. జీవిత ఖైదీ 3. దొంగతనం 4. అన్నం 5. నీళ్లు 6. దేవతా వృక్షం 7. మకర్ సవర 8. శనీచరి 9. గిరిబాల 10. విత్తనాలు.మహాశ్వేతా దేవి గారి గురించి తెలియని వారు ఉండరు. ఈవిడ కుటుంబం యావత్తూ రచయితలు, కళాకారులు, చలన చిత్ర దర్శకులు (రిత్విక్ ఘటక్ ఈవిడకు బాబాయి అవుతారురచన, సృజనాత్మకత, సమాజ సేవ అన్నీ ఇమిడి ఒక పరిపూర్ణత సాధించిన కుటుంబం అనిపిస్తుంది. అవార్డులు రివార్డులు ఒక ప్రక్క అలా పోతూ ఉంటాయి. కాకపోతే గమ్యం అనేది వాటి ముందు నిలబడి ఉంటుందా లేక వాటితో పాటు సాగుతూ ఉంటుందా అనేది చాలా సార్లు చర్చ లోకి దూకుతూ ఉంటుంది. కానీ నిజానికి ఈ అవార్డులు అనేవి స్టేషన్లో  బండీ ఆగినప్పుడు ఏదో లభించినట్లు లభించేవే కానీ వాటి తరువాత మరో స్టేషన్ ఉంది అనుకోవటం ఉత్తమం. ఇంకొక సూక్ష్మం ఉన్నది. ఆవలి తీరం జరుగుతూనే ఉంటుంది. సుఖం, సంతోషం-ఇలాంటివి మన మీదుగా జాలు వారే జలపాతం లా జారిపోవాలి కానీ మనం వాటితో పాటు ఎక్కడికో జారిపోకూడదు!
అదే నిజమైన ఆనందం…
విషయానికి వస్తే కళాకారుడు, రచయిత ఇలాంటి వారు సంఘానికి కొద్దిగా పెడగా ఉంటూ ఏదో చెప్పి వెళ్లిపోతారా అనే వాళ్లకి మహాశ్వేతా దేవి గారు ఒక సవాలు. చెప్పింది ఆవిడ చేశారు. చేసింది మరల మరో విధంగా చెప్పారు. సృజనాత్మకత కల వారు, రచయితలు, రచయిత్రులు, కళాకారులు నిజమైన కర్మసిధ్ధులని ఒక జీవితకాలంలోనే నిరూపించిన కొద్ది వారిలో ఆవిడ ఒకరు…సంఘాన్ని ఒక సంఘటనలో బంధించి కథకీ, నేపథ్యం లో ఉన్న సంఘానికీ ఒక ‘సంఘీభావాన్ని ‘ ఏర్పరచటం రచయిత్రి ఎంచుకునే పధ్ధతి. సామాన్యంగా నాటక కళకు దగ్గరగా ఉన్నవారికి ఒక ప్రక్రియ సాధ్యమవుతుంది-ఒక భూమికను సృష్టించవలసిన అవసరం ఏర్పడదు! ఘటన-ఇదే మూలస్తంభం. అదే ఇతివృత్తాన్ని తెర తీసిన వెంటనే మన ముందు ఉంచుతుంది. సంవాదాలు, పాత్రలు ఆ వృత్తంలోకి తెచ్చినట్లు ఉండవు-అక్కడ ఉన్నవారే! ఇంకాస్త ముందుకు వెళితే హిందీ సాహిత్యంలో మున్షీ ప్రేంచంద్ రచనలు చదివిన వారు దీనిని త్వరగా స్ఫురించుకో గలుగుతారు. ఉదాహరణకి ‘ బడే ఘర్ కీ బేటీ ‘, అని ఒక కథ ఉంటుంది. ఒక ఉమ్మడి కుటుంబంలోకి ఒక పెద్ద ఇంటి నుంచి కోడలు వస్తుంది. ఈమెకీ, ఆ ఇంటిలోని వ్యవహారాలకీ పొత్తు కుదరకపోవటం వలన ఒక చిన్న పోట్లాట మొదలవుతుంది. ఆ మాటా, ఈ మాటా అనుకుని పెను తుఫానుగా మారిన తరువాత ఆ పెద్దింటి పిల్ల తాను ప్రారంభించిన సమస్యకి చిన్నగా తానే సద్ది చెప్పి అంతా ప్రశాంత పరుస్తుంది. అందరూ ‘ పెద్దింటి పిల్లలు ఇలాగే ఉంటారు…’ అంటూ వెళ్లిపోతారు!
సాహితీ చర్చలు జరుగునప్పుడు ఈ కథ సుఖాంతమేనా? అని చాలా మంది అడుగుతారు. నిజమే. నిజానికి సుఖాంతం కాదు! రచయిత మామూలు ఇళ్లల్లో ఉన్న వ్యావహారిక మనస్తాపాలను అంతర్లీనంగా పెట్టి లేమి లో ఉన్న ఒక వైపరీత్యాన్ని పైకి ఒక పాత్ర ద్వారా ఎత్తి చూపాడు.అంటే మామూలు మనిషి ఒక పరిష్కారం వైపు ఒక మంచి మాట చెప్పినా దానికి విలువ ఉండదు! ఆ క్రెడిట్ అటు పోవాలిసిందే-పోట్లాటలో కూడా! సిరి గల వానికి చెల్లునన్నట్లు ఈ లోకం తీరే అంత.

బాగుంది. మహాశ్వేతా దేవి దగ్గరకు వద్దాం. ప్రేం చంద్ కథను మూట కట్టి పాఠకుడికి వదిలేస్తాడు. ఈవిడ మూటను విప్పి అంశాలను అక్కడక్కడ తాకి, బయటకు తీసి వ్యాఖ్యల రూపంలో ఇదిగోండి అంటుంది. దీనికి కారణం ఆవిడ నిలబడ్డ నేపథ్యం అయి ఉండ వ చ్చు. కళాత్మకత అనే విషయంలో ఇక్కడ ఒక చిన్న విభేదం కనిపిస్తుంది. ఇది స్పందనను కోరుకునే పధ్ధతిలో ఉన్న తేడా. సంఘంలో మార్పు నా కథ నుంచి ఒక సూర్యోదయం లా రావాలీ అనే సిధ్ధాంతం ఈవిడ దగ్గర కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రేం చంద్ లాంటి వారు నీ సమాజం నాకు ఇలా కనిపించింది అంతే అని చెప్పినట్లు ఉంటుంది. కళాకారులలో కళాత్మకత ఒకేలా ఉంటుంది. కళాకారులలో మరల ఒక వ్యక్తిత్వం ఆ కళ కవ్వం లా కవ్వించిన రీతి వలన మరో విధంగా బయటకు ఊడి పడుతుంది. అది ఈ తేడాను సృజిస్తుంది…

ఈ సంకలనంలో ‘ అన్నం ‘ అనే కథను చూద్దాం.
ఒక ఉమ్మడి కుటుంబంలో యజమాని చావు బ్రతుకులలో ఉంటాడు. ఆయన బ్రతకాలని హోమం చేస్తూ ఉంటారు.అందులోకి వేయవలసిన సమిధెల కోసం కట్టెల నుంచి పుల్లలను తయారు చేయటం కోసం గ్రామంలో వరదకు ఇల్లు, ఇల్లాలు అన్నీ కొట్టుకుపోయిన ఒక వ్యక్తి అన్నం కోసం వచ్చి పని చేసుకుంటూ ఎప్పుడు అన్నం పెడతారా అని చూస్తూ ఉంతాడు. ఇంటిలో రకరకాల బియ్యం, చేపలు, నానా హంగామా ఉంటుంది. కొ డుకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అన్నీ కొట్టాక హోమం అయ్యే వరకూ అన్నం పెట్టమంటారు. పనమ్మాయి కొద్దిగా దొంగతనంగా అటుకులు ఇచ్చి అతనిని చల్లారుస్తుంది. అలానే నిద్ర పోతాడు. లేచే సరికి ఆ యజమాని చని పోయి ఉంటాడు. అన్నం మొత్తం పారేయమంటారు. తినకూడదు అని చెబుతారు. అతనిని ఆ అన్నం మొత్తం తీసుకుని వెళ్లి పారేయమంటారు. తినకూడదూ అని  పనమ్మాయి కూడా అరుస్తుంది. కానీ అతను రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ కూర్చుని తన ఇల్లలిని, తల్లిని, పిల్లలను తలచుకుని తనివి తీరా తింటాడు. నిద్ర పోతాడు. లేచే సరికి పోలీసులు గిన్నె దొంగిలించాడని లాక్ అప్ లో పెట్టి కొడతారు. తన వాళ్లని వెతుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది.కథలో ఒక క్రాఫ్ట్ ఉంటుంది. మొదటి లోనే ప్రముఖమైన పాత్రలు చేతికి అందిపోతారు. ఇంటిని పోగొట్టుకున్న వాడు, ఎంతో పెద్ద ఇంటిలో అందరూ ఎవరి దారిన వారు ఉన్న వారు, పారేస్తున్న అన్నం, ముద్ద దొరకని పరిస్థితి అన్నీ ఒక సెంటర్ స్టేజ్ మీదకి వచ్చిన ఇతివృత్తం.
సండేశాలు ఆకడక్కడ దాగి ఉం టాయి, అక్కడక్కడ తొంగి చూస్తాయి.

అనువాదాలు చక్కగా ఉం టాయి. కాకపోతే గ్రామీణ మాండలీకాలు వాడుతున్నప్పుడు అనువాదం చేసిన వారు భిన్నమైన గ్రామీణ మాండలికాలు వా డ కనిపిస్తుంది. ఒకటి వాడిన వ్యక్తి అంత తొందరగా మరో ప్రాంతం లోని వాడుక వాడతారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకి ఈ కథలోనే ఎక్కువగా తెలంగాణ మాండలికం వాడినప్పుడు ఎందుకో మన రాష్ట్రం లోని భిన్నమైన ప్రాంతాల పదాలు దూరిపోతాయి. ఇది అవసరమా? అనిపిస్తుంది.
ఈ సంకలనంలో ‘ మకర్ సవర ‘ అనే కథను జి. భవాని అనువదించారు.

మహాశ్వేతాదేవి గారి కథలు ఇతర భాషల అనువాదాలను త్వరలోనే చర్చించగలం…

~~~***~~~
-వేదాంతం శ్రీపతి శర్మ
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: