‘చుట్టు చెంగావి చీర ‘-వేదాంతం శ్రీపతి శర్మ


చీరె కట్టుకోవటానికి, చుట్టుకోవటానికి చాలా తేడా ఉందనిపిస్తూ ఉంటుంది. మా ఆఫీసులో ఒక మూల ముగ్గురు మహిళలు కూర్చుని ఉంటారు. పొయ్యి రాళ్లు అమ్ర్చినట్లు ఎవరో వాళ్ల కుర్చీలను సద్దారు. వాళ్లు మాట్లాడుతున్నట్లు అనిపించదు. అంతా నిశ్సబ్దంగా ఉంటే అర్థమవుతుంది.ఏదో ఒక పెద్ద గిన్నెలో అన్నం ఉడుకుతున్నట్లు శబ్దం అవుతూ ఉంటుంది…

ఒక రోజు చీరెలు అమ్ముకునే వాడు ఏకంగా లోపలికి వచ్చాడు.ముగ్గురూ కలసి దాదాపు అన్ని చీరెలూ బయటకు తీసేసారు.’ చుట్టూ ‘ ఉన్న స్త్రీలందరూ పండగ చేసుకున్నారు. గంట, గంటన్నర వ్యవధి దాటింది. ఒక్క చీరె కూడా అమ్ముడు పోలేదు. అతను అన్నీ సద్దేసి నిరాశతో నిలబడాడు.

ముగ్గురిలో ఒక పెద్దావిడ ‘ ఆ నీలం చీరె బాగుంది కానీ నువ్వన్నట్లు అయిదున్నర గజాలుందీ? ‘ అన్నది.
అతను వెంటనే బయటకు తీసి టేబిలు మీద పూర్తిగా పరచాడు. ఆడవాళ్లకి ఉండవలసిన సహనం ఈ దిక్కుమాలిన ఉద్యోగాల వలన చీరెలు అమ్మే వాళ్ల దగ్గరకి వెళ్లిపోయిందనిపిస్తున్నది.(ఈ విషయం మా ఆఫీసులో చాలా మంది స్త్రీలు ఒప్పుకుంటారు కూడా!)

అయినా ఆవిడ ఆ చీరె లెంగ్త్ మీద సందేహం గానే ఉన్నారు. పైగా ఆవిడ బిల్లులు పాస్ చేసే చోట ఉన్నారు. మరి చెకింగు తప్పదు.

కాకపోతే విక్రమార్కుడే వచ్చాడు, మరల నేనే వచ్చాను అని చెప్పేందుకు ఆ చీరెను తన నడుముకు పెట్టి చక చకా ఎంతో అందంగా కట్టేసి నిలబడ్డాడు. వార్ని! నువ్వురా మగాడివి అనుకున్నాను!

ఇంతలో ఆ ముగ్గురు మహిళలూ ఎందుకో లేచి నిలబడ్డారు. హాలంతా నిశ్శబ్దం కమ్ముకుంది. ఇటు తిరిగాను. పై ఆఫీసరు గారు ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ద్వారం తెరచియే ఉండెను. చీరెల వాడికి ఆ సంగతి తెలియదు. తన ‘ చుట్టు ‘ కౌశలానికి ముగ్ధులై ఇలా ఈ అతివలు అలా నిలబడిపోయారా అనుకుని ఒక్కింత విస్మయంతో చీరె కుచ్చిళ్ల వైపు, తన వైపు పలు మార్లు చూసుకుంటున్నాడు. ఆఫీసర్ గారు ఆలోచిస్తున్నారు. విచిత్ర వేష ధారణలో ఉండి అటు తిరిగి నిలబడిన ఈ వ్యక్తి ఎవరై ఉంటాడా అని చూస్తున్నాడు.

అతను పట్టించుకోవటం లేదు. ‘ చూడండి మేడం! చూడండి…చక్కగా సరిపోతుంది…’
  
ఆఫీసర్ గారు లోనకి వచ్చారు.

‘ ఏమి చీరె ఇది? ‘
 అతను చీరె తీసేశాడు.
‘ సార్, చుట్టు చెంగావి చీర! అలా చుట్టి చూపించాను సార్.’
‘ ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటావు? ‘
‘ నెలకి ఒక సారి సార్! మేడం గార్లు…’
‘ ఎవరు రానిస్తున్నారు?’
‘ ఎవరూ…రావద్దనలేదు సార్!’
‘ ఇక పైన రాకు!’
‘ సార్! డబ్బులు ‘
‘ నాకనవసరం!’
‘ మరి నెలసరి వాయిదాలు…’
‘ ఈ వ్యాపారం కూడా ఉందా?’
‘ మంచి చీరెలు సార్! షాపులో దొరకవు సార్!’
ఆయన చుట్టూత చూశాడు.
‘ రెండు కొంటే…’
‘ వాయిదా వడ్డీ లేదు. ఆరు నెలలు…’
మహిళల వైపు తిరిగాడు.
‘ బాగుందా?’
‘ ఏమిటి సార్?’
‘ చీర?’
‘ బాగుంది సార్.’
ఆఫీసర్ గారు ఆయన రూము వైపుకు నడిచారు.
అందరూ గాలి పీల్చుకున్నారు.
ప్యూన్ వచ్చాడు. చీరెల వాడి దగ్గరకు వచ్చాడు.’ ఏయ్…’
‘ ఎల్లి పోతున్నాలే…’
‘ కాదు. సార్ ఆయన రూములోకి రమ్మంటున్నారు!’

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘చుట్టు చెంగావి చీర ‘-వేదాంతం శ్రీపతి శర్మ

  1. ఇంతకీ ఆఫీసరంకుల్ ఎన్ని చీరలు కొనిండ్రు? ఆడవారు చీరలు కొనడాలు సరే! మీది ఎప్పుడూ వారి ఎదురు సీటేనా ఏంటి? బాగుంది.ఎంచక్కా ఇంటిదాని మీద మనసు మళ్ళి నప్పుడు ఓ చీర చవగ్గా కొట్టేయచ్చు.వద్దనుకుంటే చీరలపై అతివల అభిప్రాయాలను తెలుసు కోవచ్చూ. ఎంత జనరల్ నాలేడ్జ్ మీకు ముఫ్తుగా దొరుకుతోందో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: