అర్జునా టుక్ ద బో!-వేదాంతం శ్రీపతి శర్మ


కొంతమంది డెని గురించి చెబుతున్నా నటన లేకుండా చెప్పరు. నేను కారులో వచ్చాను అని చెప్పాలంటే రెండు చేతులతో డ్రైవ్ చేస్తున్నట్లు చూపించి మరీ ఆ విషయాన్ని చెప్పరు. మెట్ల గురించి చెప్పేటప్పుడు చేతిని ఒక్కో మెట్టూ ఎక్కుతున్నట్టు ఆడించి ఇలా మెట్లెక్కి వచ్చాను అంటారు. కొందరు అసలు భావ ప్రదర్శన వద్దనుకుంటారు.నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలన్నా నాకు తలనొప్పిగా ఉంది వెళ్లి పడుకుంటాను అని చెప్పినట్లు చెబుతారు. ఇంతకీ భావ ప్రదర్శన చేసే వారి గురించి తలచుకున్నప్పుడల్లా నాకు మా స్కూల్లోని పాత మాష్టారు గుర్తుకొస్తూ ఉంటారు. ఆయన మహా ఏక్షన్ కింగు మరి…

~~~***~~~

ఎవరైనా టీచర్ రాకపోతే ఈయన క్లాసులోకి వచ్చేవారు. ఆ అమ్మాయి ఎక్కడుందో కానీ అదేమిటో ఆయనను ఒక కథ చెప్పమని అడిగేది. ఆయనలోకి తక్షణమే ఒక విద్యుత్ తరంగం అలా పాకి ప్రభు దేవా మెలికలు తిరిగినట్లు తిరిగిపోయి రెండు చేతులూ వేలం వేస్తున్నట్లు పైకి ఎత్తి అందరినీ సైలెన్స్ అనే వారు.

‘ ద్రౌపది స్వయంవరం గురించి చెబుతాను ‘, అనే వాడు. ఇప్పటికీ గుర్తు, ఆ అమ్మాయి వెంటనే చేతులు కట్టుకునేది. (ప్రస్తుతం పెళ్లి అయిందో లేక ఇంకా వాళ్ల నాన్న స్వయంవరం ప్రకటించాలని ఎదురు చూస్తోందో తెలియదు!)
‘ పైన తిరుగుతున్న చేప కన్నులోకి కింద నీటిలో చూస్తూ బాణం వేయాలి. ఎందరో వచ్చారు. ప్రయత్నించారు…’
ఎలా ప్రయత్నించారో నటించి మరీ చూపించే వారు ఆయన. కిందకి వంగి ఇదిగో ఇలా ఇలా అన్నమాట…
కనపడని వారు ఒకరిద్దరు బాక్ బెంచర్స్ నిక్క పొడుచుకుని అక్కడ ఏమవుతోందని చూసే వారు. మా ద్రౌపది కళ్లు పెద్దవి చేసేది! ఆ బాణం సూటిగా తననే వచ్చి తగులుతుందేమోనని భయం ఒకటి. ఆయన కూడా అడిగిన ఈ పిల్లకు ముందు అర్థం కావాలనే ఆతృతతో అలా వంగి ఉండే ఆమె వైపు తల తిప్పి మరీ వివరించే వారు. ఠక్కున లేచి మరల చేతులు విదిలించుకునే వారు.
 
‘ హ హ…అప్పుడేమైందీ? ఎవరి వల్లా కాలేదు! అప్పుడు అర్జునా టుక్ ద బో…అర్జునా…’
ద్రౌపది వంత పాడేది, ‘టుక్ ద బో!’
‘ ఎలా? దట్ ఈస్ ఇట్. ఎలా? ఇదిగో ఇలా…’
ఏక్షన్ కింగు కాబట్టి మరల బోర్డు ముందుకు వచ్చి ద్రౌపదిని చూస్తూనే కుడి కాలు అలాగే ఉంచి ఎడమ కాలు ముందుకు దిఫెన్స్ ఆడుతున్నట్లు పెట్టి కొద్దిగా లెఫ్టిస్ట్ లీఇంగు ఉన్నట్లు లీన్ అయ్యే వారు. ఇప్పుడు ఏమి చేస్తాడా అనుకునే లోపల మోకాళ్ల దగ్గర జర్రి పాకినట్లు లటుక్కున రెండు కాళ్లనూ కొద్దిగా వంచేసే వారు. ద్రౌపదిలో కూడా ఒక షాక్ వచ్చినట్లు ఉండేది. ఆ దెబ్బకు అప్పటివరకూ కట్టుకుని ఉన్న రెండు చేతులూ వాటంతట అవే వదిలెసేది…
‘ అర్జునా…ఇలా అన్నమాట. యస్. సైలెన్స్! ఇలా…’
అలా వర్ణిస్తూనే కుడి చేయి ఆకాశం లోకి ఎత్తేసే వారు. ఎడమ చెయి క్రింది వైపుకు లాగే వారు. తల క్రిందికే ఉన్నా సీను వర్ణిస్తున్నప్పుడు ఆ అమ్మాయి వైపు చూసే వారు.
‘ చూశారా, ఇలా…’
చివరి వరుసలో కొందరు లేచి నిలబడ్డారు. నిజానికి ఆయన వర్ణన ఎంత గొప్పదంటే బాణం వదులుతున్నాడు…ఇదిగో వదులుతున్నాడు, ఆ పైన ఉన్న ఫానుకు తగులుతుందీ అనిపించేది. ద్రౌపదికి మరింత టెన్షన్!
అలా ఉండగా ఎందుకో ప్రిన్సిపాల్ గారు వచ్చి తలుపు దగ్గర నిలబడ్డారు. ఆయనకు తెలియదు! ఆయన చేపను కంటిలో సూటిగా కొట్టబోతున్నారు. ఆ సంగతి ప్రిన్సిపాల్ గారికి తెలియదు! వాట్ ఈస్ దిస్ అనుకుని నోరు వెళ్ల బెట్టారాయన! ఎందుకైనా మంచిదని టీచర్ టేబిల్ కింద ఏదైనా సర్పరాజం ఉందేమోనని అటు వైపు అతి పెద్దదైన కళ్లజోడు లోంచి దృష్టి సారించారు. ఇలా కృఇందికి వంగి ఇంకా బాణం వదలని మాష్టారు గారికి కూడా ఒకటి అర్థం కావటం లేదు! ఇలా ఉన్న పళంగా క్లాసంతా ఇంత నిశ్శబ్దంగా ఎందుకు తయారయిందీ అనుకున్నారు. బాణం అలాగే పట్టుకుని తల పైకి ఎత్తారు. అందరూ నిలబడి ఉండటం గమనించారు! ఆయన చెబుతున్న కథకి అంత అద్భుతమైన స్పందన వస్తుందని ఆయన ఊహించలేదు! గర్వ పడి చిరునవ్వు నవ్వి,’ యస్! అర్జునా టుక్ ద బో ‘ అని మరల కృఇందికి చూశారు. ఇంతలో ఏదో గంట మ్రోగి ఇటు తిరిగారు. నిజం గానే గంట మ్రోగి క్లాసు కూడా అయిపోయింది…

~~~***~~~

అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. మా ద్రౌపదికి మటుకు ఆ కథ పూర్తిగా ఆయన ఎన్నడూ చెప్పలేదు! తెలుసుకునే ఉంటుంది. ..

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: