‘ కాఫీ కప్పు ‘-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


సుందర రావు గారు ఒక చోట వ్రాశారు-‘ ప్రతి వ్యక్తిలోనూ ఒక చంటి పిల్లవాడు ఉంటాడు. వాడి వయసు ప్రతి క్షణం మారుతూ ఉంటుంది…ఎక్కువ అవుతూ ఉంటుంది, తక్కువ కూడా అవుతూ ఉంటుంది!’

ఆయనతో కావాలని పిచ్చాపాటీ చెసే వాడిని. చాలా పెద్ద హోదాలో పని చేసి రిటైరయ్యారు సుందర రావు గారు. ఇల్లు ఎంత పెద్దదైనా ఎందుకో ఇంటిలో ఎప్పుడూ ఉండే వారు కారు. అలా అని దేశం మీద పడి తిరిగే వారు కారు. ఇంటి వెనుక భాగంలో ఆయనకొక చిన్న గది. అందులో అన్నీ పుస్తకాలే!
 చక్కగా తయారు చేసుకున్న అల్మీరాలలో అద్దాల మాటున దాక్కున్న పుస్తకాలు. ఒక పుస్తకం ఏదైనా చూసి ‘ సార్, చదివి ఇస్తాను ‘ అంటే ఒక చిరునవ్వు నవ్వే వారు.
ఆ పుస్తకం వైపి ఒకలా చూసి, ‘ తీసుకోండి. కాకపోతే ఇది అద్దం వెనుక ఎందుకు ఉందో తెలుసా? ‘, అని అడిగే వారు.
‘ భద్రపరచేందుకు కదా? ‘
‘ అంటే? మాసిపోతుందని అనుకుంటున్నారా? ‘
‘ పోనీ చిరిగిపోతుందని అనుకోవచ్చు కదా?’
‘ ఇంకో మాట చెప్పండి ‘
‘ ఆ..తొందరగా కనిపించేందుకు ‘
‘ మరొక్క ఛాన్సు ‘
‘ ఫొటో తీసుకుంటున్నప్పుడు అది ఫొటోలో పడేందుకు ‘
‘ అస్సలు కాదు. ‘

‘ మరి ఏమిటి సార్? అడ్డంగా ఉన్నాయని అద్దంలో పెట్టారా?’
నన్ను చిత్రంగా చూశారు. చిన్నగా నవ్వారు.
‘ అలా కాదు. మనసులో పడి మాసిపోయాకనే ఒక ఆలోచన పుస్తకం లోకి వెళుతుంది. అది మాసిపోతుందని బాధ ఎందుకు? కానీ మాసిపోయినదే కదా అని ఇష్టం వచ్చినట్లు వాడారనుకోండి, చిరుగుతుంది. తిరిగి ఇవ్వటం మరచారనుకోండి, మాసిన చోటు-మనసు విరుగుతుంది. విరిగితే ఎలా ఉంటుంది? అందుకు ఆ అద్దంలో పెట్టింది. ‘

~~~***~~~

పిల్లలు ఆడుకునే పార్కులో దాదాపు రోజూ చూసే వాడిని. వాళ్లతో బాటింగు, బవులింగు చేసి అలసి పోయి బెంచీ మీద కూర్చుని ఏదో సరిగ్గా ఆడలేనందుకు బాధ పడుతున్న వాడిలా తల అటూ ఇటూ ఆడించే వారు.
‘ వెళదామా? ‘, అడిగేవాడిని.
‘ చీకటి అవనీయండి…’, అంటూ లేచే వారు.
‘ ఓపిక లేనప్పుడు కూడా ఎందుకు సార్ ఈ పిల్లలతో?’
‘ నేను సర్వీసులో ఉన్నప్పుడు కూడా దాదాపు రోజూ వచ్చే వాడిని. లోకం స్టేటస్ పేరుతో ప్రాణాలు తోడేస్తుంది. ఇక్కడకొచ్చి స్టేట్ ఆఫ్ మైండ్ ను వెతికి పట్టుకుని ఇంటికి వెళ్లే వాడిని…’
ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలకు అలా నిలబడి పోయే వాడిని.ఆయనకు తెలుసు. అయినా నా కోసం వెనక్కి చూసే వారు కాదు.అదేమిటి అని కూడా అడిగే వాడిని…
‘ ఇవి డైలాగులు కావు. ఆచరణలో కలసిపోయిన ఆలోచనలు. పూర్వం చాలా మంది చేసినవే! కొత్తేమీ లేదు. అలా చూసే అవసరమూ లేదు ‘
‘ సార్, ఒక కప్పు కాఫీ తాగుదామా?’
నేను కావాలని అడిగే వాడిని. ఆయన ఆయన ధోరణిలోనే నవ్వే వారు కానీ ఆగే వారు కాదు. ఏ సమాధానం చెప్పే వారు కాదు…ఇద్దరం వెళ్లిపోయే వాళ్లం.

~~~***~~~

 
ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసి వెళ్లి ఎదురుగా కూర్చున్నాను. గదిలో మంచం వేశారు ఆయన కోసం. ఆయన కోడలు కాఫీ తెచ్చి ఇచ్చింది.అది పట్టుకుని మీరు త్రాగరా అన్నట్లు చూశాను. బేలగా నవ్వారు. ఆయన తాగరు. కోడలు వెళ్లిపోయింది. ఆయనకు శుగరు లాంటిది ఏదీ లేదు. నేను తాగుతున్నాను. ఆయన అల్మీరాలన్నిటినీ తనివి తీరా చూసుకుంటున్నారు. చూపు మటుకు వాటి మధ్యన ఉన్న ఒక చిన్న సందు-ఖాళీగా ఉంచి ఉన్న అర ఒకటి అక్కడే ఆగిపోయింది.
‘ అవును సార్…’, అడిగాను,’ …ఎప్పటినుంచో అడగాలనుకున్నాను. ఆ అర అలా ఖాళీగానె ఎందుకు ఉంటుంది? ‘
నవ్వారు.’ అది నా కాఫీ అర ‘
‘ కాఫీ అరా? అదేంటి?’
‘ భారతి చోటు అది. మా ఆవిడ. నా కోసం వొంగిపోయి కూడా అక్కడే ఆ కప్పు పెట్టి ఎదో చదువుతున్నా ఆ కబురూ, ఈ కబురూ చెప్పి వెళ్లిపోయేది. అలా కబుర్లు చెబుతూనె వెళ్లిపోయింది. కాఫీ లేదు, కబురూ లేదు.అర ఉంది, ఆలోచన ఉంది,అలమర ఉంది, మర మనుషుల మహా సామ్రాజ్యం ఉంది,…కాఫీ గురించి అడిగినా చెప్పలేదు కదూ. ఇంతే. మరేమీ లేదు. ఇక ఆ కప్పు అన్నీ కప్పుకున్నాకే! పై కప్పు మీదనే! కలసి తాగుతాము తెలుగు కాఫీ!’
విపరీతంగా నవ్వారు. లేచి ఆపాను.
‘ సార్, మీ కంటిలో కన్నీరు?…’
‘ అవింకా ఉన్నాయా? వచ్చేశాయా? కనిపించాయా? ‘, మరల నవ్వారు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘ కాఫీ కప్పు ‘-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ

  1. మనసుని కదిలించిన కధ. పదాలతో అర్ధాలు మార్చుకుంటూ అలా అలా కదిలిపోయిన కధ. లోతైన భావాలు సులభమయిన పదాలతో ఎలా కలిగించవచ్చో తెలిపే కధ
    నాకు నచ్చింది.

    1. నాకు కీ.శే. శ్రీ వాకాటి పాండురంగారావు గారు ఒకప్పుడు ఒక కథకు ఇచ్చిన ఖితాబు మీరు చాలా కాలం తరువాత మరల ఇచ్చారు. బహు కృతఙ్ఞతలు.

      వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: