‘నీవన్నది, నీవనుకున్నది…’-వేదాంతం శ్రీపతి శర్మ


బస్సు మిస్సయింది. దాని వెంట పరుగు తీసి సర్కస్ లో లాగా అక్కడ ఫుట్ బోర్డు మీద వ్రేలాడుతున్న వారి చేయి పట్టుకుని విన్యాసాలు చేయలేను. కుంటుకుంటూ మరల బస్ స్టాప్ కి వచ్చాను. కుంటటం అంటే ఎందుకంటే కాలి చెప్పు కూడా అప్పుడే తెగింది. ఏమి చేస్తాము? భగవంతుడు కొందరి జాతకాలు నూనెలో నాంచి ఇవతలకి తీసి అప్పుడు గానీ వ్రాయడు! ఆయనకదో సరదా! చెన్నై చివర ఏదైనా రైలు బేసిన్ బ్రిడ్జ్ దగ్గర ఆగిందంటే ఆ రైలు ఏ రైలు అని ఎవరూ అడగరు. అది ఖచ్చితంగా సర్కారే! అలాగే ఏలినాటి శని అడుగు పెడుతున్నాడూ అంటే ఎలాగా? అని చూసుకోవక్కరలేదు. మా సుబ్బారావు గారు నన్ను చూడకూడదూ అనుకుంటుండగానే చూడటమే కాదు చక్కగా కళ్లజోడు సద్దుకుంటూ యుధ్ధ ప్రాతిపదుక మీద మీదకే వచ్చేస్టాడాయన!
అదేమి అలవాటో చేతిలోని సంచీతో నా చేయిని కొడతాడు. తరువాత పలుకరిస్తాడు.
‘ కుంటుతున్నావెందుకు? మోకాలు మూసుకుందా?’
కొంతమందికి ముందు మంచి మాట రానే రాదు. వారిలో ఈయన ముందుంటాడు! ఫలానా వాడు గుర్తున్నాడా? అని అడిగితే ,వెంటనే ‘ పోయాడా?’ అనగలరు.
‘ చెప్పు తెగింది సార్! ‘
‘ అయితే, కుంటటం దేనికి? ఇందులో సిగ్గు పడేదేముంది? చక్కగా రెండు చెప్పులూ చేతిలోకి తీసుకుని నడవ వచ్చును. జనం ఏమనుకుంటారు అని ఆలోచించటం వలన ఈ దేశంలో నూటికి తొంభై సమస్యలు…’

 

~~~***~~~

సుబ్బారావు సామాన్యుడు కాడు. తెలుగువారిలో మాన్యుడు. మొదటి సారి ఆయన బస్సులో నిలబడి ఉందగా నేను ప్రక్కన కూర్చుని ఉన్నాను. ఆయన పాంటుకు పెట్టిన బెల్టు పాపం సరిగ్గా లేదు. పర్టీ అభ్యర్థి పార్టీకి కట్టుబడి ఉండకుండా తప్పించుకుంటున్నట్లు ఆయన నడుముకు కట్తుబడకుందా దాని దారి అది చూసుకుంటోంది.

అయినా ఆయన ఒక చేత్తో పైన రాడ్ ను పట్టుకుని మరో చేత్తో పాంటు సద్దుకుంటూ ముందర నిలబడ్డ ఇద్దరి మధ్య సంవాదాన్ని ఆలకిస్తున్నాడు.
‘ మా ఏరియాలో పవర్ కట్ పొద్దున ఆరు నుంచి ఎనిమిది ‘
‘ ఏ ఏరియా?’
‘ మలక పేట ‘
‘ అలా ఎలా ఉంటుంది? అక్కడ ఎనిమిది నుంచి పది ‘
‘ కాదు ‘
‘ అరే! నేను చెబుతున్నాను ‘
ఇదీ సమస్య. తెలుగు వాడు దీని మీద పోట్లాడుకుంటాడు కానీ అసలు పవర్ కట్ ఎందుకు అనే విషయానికి రాడు. ఈయన అందరూ వినాలన్నట్లు గట్టిగా చెబుతున్నాడు,’ చార్మినార్, ఛత్రినాకాలో…సికిందరాబాదు మహంకాళీ గుడి నుంచి…’-మొత్తం అన్ని ఇలాకాలూ చెప్పేశాడు. ఆయన ఇబ్బంది చూసి లేచి సీటు ఇచ్చాను. కూర్చుని కళ్లజోడు సద్దాడు. ‘ యాభై, పంతొమ్మిదవ యాభైలో ఈ రకం బస్సులు వచ్చాయి…’
తరువాత ఏమి చెప్పాడో తెలియదు. నా స్టాపు కాకపోయినా దిగిపోయాను. ఆ బస్సు వెళ్లాక కొద్దిగా వెనక్కి తిరిగి చూశాను. చిత్రం ఏమిటంటే ఆయన ప్రక్కనున్నవాడిని లెక్క చేయకుండా కిటికీలోంచి నన్ను చూస్తూనే ఉన్నాడు. బ్రతికిపోయాననుకున్నాను!

ఒక రోజు స్థానిక లైబ్రరీలో నిలబడి ఉన్నాను. వెనుక నుండి వినబడింది,’ ఏమి చేస్తున్నారు?’
అటు తిరిగాను. ఇంక లాభం లేదనుకుని ‘ ఏముందీ? తూర్పున సూర్యుడు కిటికీలోంచి కనిపిస్తున్నాడు, అలా కొద్ది సేపు చూస్తున్నాను.’, అన్నాను.
వెంటనే ముక్కు మీద వేలు పెట్టాడు.’ నో! సూర్యుడు తూర్పులో ఉదయించడు!’
‘ సార్! ఇది టూ నచ్!’
‘ కాదు! ఏ దిక్కులోనైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ దిక్కును మనం తూర్పు అంటాం! అటు ఇటులో ఎంత పొరపాటు? ఆలోచించండి.’
నేను కూర్చుని పేపరు తీశాను. ఆయన అటు కూర్చుని ఇదే పేపరు గట్టిగా చదివాడు.
‘ దారుణం. వరకట్నం పుచ్చుకోవటం క్రైం అని మనం మరచిపోతున్నాం.’
‘ నిజమే సార్. వరకట్న చావులు ఎక్కువవుతున్నాయి!’
‘ అలా కాదండీ! మీరు కూడా ఆలోచించాలి. ఒక కూతురికి కట్నం ఇచ్చిన వారు కొడుకు దగ్గర పుచ్చుకోక పోతే ఎక్కడి నుంచి తెస్తారు? తేరగా వస్తోందన్న చోట పుచ్చుకోవటం ఘాతుకం. మీరు అస్సలు ఆలోచించటం లెదు మరి!’
నేను లేచి నిలబడ్డాను.’ మీరు ఎక్కడ పని చేస్తారు సార్?’
ఆయనా లేచి పాంటు పైకి లాక్కున్నాడు.
‘ సృష్టిలో చాలా చిన్నదిగా చూసే వృత్తి ఒకటే-అధ్యాపకులది. దీని తరువాత రాజకీయాలె! ‘

~~~***~~~

ఒక రోజు మా సందు చివార్న ఏదో గుంపు నడుచుకుంటూ వస్తోంది. ఏవో నిన్నాదాలు వేస్తున్నారు.
‘ ఎవరు వీళ్లు? ఏమి చేస్తున్నారు? అసలు ఏమిటి ఈ నాన్ సెన్స్?’ వెనుక నుంచి సుబ్బారావు గారు!
‘ ఏముందండీ? మీకు తెలియకపోవటం విచిత్రం. అధ్యాపకులు సమ్మె చేస్తున్నారు. జీతాలు చాలటం లెదట. మీ లాంటి వాళ్లు కూడా రోడ్డున పడితే ఎలా సార్?’
ఆయన వెంటనే కళ్లజోడు తీసేశాడు.నన్ను ఒక వింత జంతువును చూసినట్లు చూశాడు.
‘ పాయింట్ అది కాదు.అస్సలు తెలియటం లెదు మీకు. ఇది చాలా గొప్ప వృత్తి. వైదుని తరువాత టీచరే మరి సంఘానికి కావలసినది. అధ్యాపకుడు చీకటిలో నిలబడ్డా కొవ్వొత్తిలాగా కరగిపోతూ అందరికీ వెలుగును ప్రసాదిస్తాడు. జాగ్రత్త!’

~~~***~~~
 సుబ్బారావు గారు ఈ రోజు ఇలా నా చెప్పు తెగిన సమయంలోనే వచ్చి నా ప్రక్కన నిలబడి జనం గురించి ఎందుకయ్యా? చక్కగా రెండు చెప్పులూ చేతిలో పట్టుకుని నడవవచ్చుగా అని నీతులు చెప్పటం…సమయం బాగుండనప్పుడు ఇలా అన్నీ జరిగిపోతాయి. ఒక తిమింగలం లా మరో బస్సు ఒక వైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వొంగిపోయినట్లు వచ్చి నిలబడింది. సుబ్బారావు గారు పేంటు పైకి లాగి పరుగు తీశారు. అసలు ‘లాగూ ‘ అంటే ఈయనదే. లాగి పట్టుకోమనేదే లాగు అని అర్థం! ఆ బస్సు స్టాప్ దగ్గర కాకుండా కొద్దిగా దూరంగా ఆపాడు. హైదరాబాదా మజాకా? ఈయన పరుగు తీయగానే ఒక ‘తనుమధ్యమ ‘-చక్కని అలంకారంతో ఉన్న సుందరి తీరా అడ్డు వచ్చింది. ఈయన ఎదమ వైపుకు జరిగాడు. ఆమె కూడా అటే జరిగింది. కాదని మాష్టారు ఈ సారి కుడి వైపు జరిగారు. ఆమె కూడా అటే జరిగింది. ఇదరూ ఎదురూ బదురూ! ఇలా కొద్ది సేపు కబడ్డీ ఆడే వారిలా కనిపించారు. ఒక ఫ్రేం లొ చూస్తే ఒక రకమైన రాక్ నృత్యమని మనం విశ్లేషించుకోవచ్చునన్నమాట! ఇంతకీ అమ్మాయికి చిరాకు వచ్చి ఆయనను చిన్నగా తోసి పారిపోయింది. ఈయన కళ్లజోడు తీసేసి ఎవరయి ఉంటారా అని చూస్తున్నాడు. ఈ తరం లెక్చర్ ఎప్పుడు వినాలి? ఇటు తిరిగే సరికి బస్సు అలా రోడ్డు ఎక్కెసింది మరి. ఇటు వెనక్కి తిరిగి నన్ను చూశాడు. అసలు సంగతి అది కాదు. ఆ అమ్మాయి ఆయన ఎడమ కాలి చెప్పును తనతో లాగి ముందుకు దూకెసింది. దానితోటి అది తెగి నా తెగిన చెప్పు దగ్గర నా కాలి ముందే వచ్చి పడిపోయింది. నేను ఎన్.టి.ఆర్ (సీనియర్) రేంజీలో నడుము మీద చేయి పెట్టాను…

సుబ్బారావు గారు మెల్లగా ఒక చెప్పుతో కుంటుతూ నన్ను చేరుకున్నారు. నన్ను ఎందుకో కోపంగా చూశారు. చెప్పు తొడుక్కుని  కొద్ది సేపు దేశం గురించి ఆలోచించినట్లున్నారు!

‘ చెప్పు తెగినత్లుంది సార్?’
‘ …’
‘ ఫర్వాలెదు సార్! రెండు చెప్పులూ చేతిలోకి తీసుకుని దేవుడిచ్చిన పాదాలకు భూమి స్పర్స చేయించి ఎందుకు నదవ కూడదు?’
నేను కాళ్ల జోడు గురించి చెబితే వెంటనే కళ్ల
జోడు తీసేసారాయన.
‘ నాన్ సెన్స్! అసలు మీరు బొత్తిగా ఏమీ గమనించరు! ఎండ చూడండీ ఎలా ఉందో? పైగా అసలు విషయం మీకస్సలు అర్థం కావటం లేదు.
నా లాంటి వాడు చెప్పులు చేతులు పట్టుకుని రోడ్డు మీద నడిస్తే ఎమైనా ఉందా? నో!’

~~~***~~~

చాలా కాలం అయింది సుబ్బారావు గారిని చూసి. ఆ మధ్య అటు వైపు బస్సులో వెళుతుంటే ఉన్నట్టుండి కిటికీ లోంచి చూస్తుంటే దూరంగా ఎవరితోనో నడుస్తూ కనిపించారు. వింటున్న వాడి వైపు పూర్తిగా వొంగిపోయి చెబుతున్నారు. చాలా సేపు కనిపించినంత మేరకు చూశాను. ఇక బస్సు వెళ్లిపోతోంది. చివరికి పైకి లేచి వున్న ఆయన వేలొక్కటీ ఏదో పై లోకాలకి కూడా వివరిస్తూ ఉన్నట్లు కనిపించింది…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘నీవన్నది, నీవనుకున్నది…’-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: