‘ రాయి, చెట్టు, దీపం…’-వేదాంతం శ్రీపతి శర్మ


ఆలయంలోని విశాలమైన ప్రాంగణం బలే హాయిగా అనిపించింది. చల్లని గాలి, చక్కని సంగీతం, నిర్మానుష్యమైన ప్రాంతం-ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు.అదో కారణం కావచ్చు. ఒక మూలగా ఉన్న అశ్వథ్థ వృక్షం దగ్గర కూర్చున్నాను. చెట్టు చుట్టూతా రాళ్లతో చక్కగా కట్టారు. చెట్టు క్రింద ఎవరో ఒక దీపం పెట్టారు. రాయి మీద కూర్చోగానే ప్రశాంతత మరింత పెరిగింది. ఏ చిక్కులూ, చికాకులూ లేకుండా, ఏ పోషణ గురించీ బాధ పదకుండా ఈ రాయిగా మారి ఎందరికో పీటగా ఉండి ఆలోచనలు, హావభావాలూ, పట్టింపులూ, ఆచారాలూ, సమస్యలూ, అనుభవాలూ…ఆర్థికపరమైన ఇబ్బందులూ ఇవేమీ లేకుండా చిరస్థాయిగా ఉండిపోయే ఈ రాయి ఎంత హాయి? అనిపించింది…దైవ సన్నిధిలో ఇది అజరామరం!

~~~***~~~

లేదు. ఈ చెట్టునైతే మరోలా ఉంది. గుడిలోని దైవం లాగా ఈ చెట్టు ఉన్నంత కాలం అందరూ భక్తితో నమస్కరిస్తూనే ఉంటారు. ఈ రాయికి ఏముంది? యోగిలా స్థాణువైనా రాజయోగం ఏదీ? లోపల ఉన్నది రాయైనా అంతా భోగమే! పోనీ చెట్టు సంగతి చూద్దాం. కరెక్ట్! ఇది బాగుంది. చెట్టు దైవమే. కానీ రాయిలా కాకుండా ఒక వ్యవస్థతో ముది బడినది. ఎవరో పెంచినదే కదా? ఋణానుబంధం, కాలగమనం…ఇలా ఎన్నో సిధ్ధాంతాలు! కానీ ప్రక్రియలోకి రాకుండా ఒకరికి సహాయం చేసే చెట్టులా ఉండలేము కదా! ఇంత నీడ ఎలా ఇవ్వగలదు? దీపం వైపు దృష్టి మళ్లింది…

~~~***~~~

ఇది ఇంకా బాగుంది. కొద్ది సేపైనా ఎలా వెలిగిపోతోందో! అసలు దీని వలనే కదా ఈ చెట్టుకీ, ఒక్కో సారి ఆపుట్టకీ వెలుగు, ఆరాధన, గౌరవం….ఇలా ఎన్నో! దీపంగా మారితే? ఇది కూడా పోషణ, ఒక వ్యవస్థ, ఒక అవస్థ, చమురు, వొత్తి…వద్దు. మరి ఏదో ఒకటి కాలకుండా వెలుగేది?

~~~***~~~

మనసు రాజీ పడలేదు. దీనికి బుధ్ధి లేదు. ఎక్కడికెళ్లినా ఆలోచిస్తుంది. రాయిలా ఉండవే, ఆలోచించకే అంటే వినదు! దీపం వైపే చూస్తూ కూర్చున్నాను. ఆ వొత్తుకౌ చివార్న ఉన్న జ్యోతిగా మారితే? ఇదేగా దీపమంటే? బాగుంది. కానీ ఇదీ వ్యవస్థే! చాలా కొద్ది సేపే! అయితే ఏమిటి? నిజమే! నేను అలా మారాలి…వెలిగిపోవాలి. వెలిగి-పోవాలి.ఎప్పుడైనా ఫరవాలేదు…

~~~***~~~

ఇంతలో దీపం కొండెక్కింది. మాడిపోయిన వొత్తులున్నాయి. అవి కాటుకగా మారతాయేమో! ఒక సుందరి కళ్లను అలంకరిస్తాయేమో! వద్దు. ఈ ఆలోచనలు ఇక్కడొద్దు.

ఎందుకొ నవ్వుకుని ప్రమిదని చేతిలోకి తీసుకున్నాను. రెండు వొత్తులు వెలిగించారెవరో. ఒకటి పూర్తిగా వెలిగినట్లుంది. ఒకటే కొద్దిగా మిగిలి లోపల పడి ఉంది. ఈ వొత్తి ఎంత గొప్పది? అనుకున్నాను. ‘నేను అంత గొప్పదాన్ని కాను…’, అది అంటోంది,’…నేను వెలిగి ఉండగా ఎక్కడినుంచో వచ్చి ఒక చిన్న వొత్తి నాతో కలసి నా జ్యోతితోనే ఐక్యమయ్యి పూర్తిగా ఒక జ్యోతినే చూపించి నేను ఇలానే ఉండగా తను మటుకు మాయమైపోయింది. అది బ్రహ్మలో లీనమైనది!’

~~~***~~~

నాలో ఏదో నవ్వింది. ఎక్కడో ఒక గంట మ్రోగింది. నా చుట్టూతా అనంతమైన జ్యోతి స్వరూపమే! దైవం ముందు మరల నిలబడ్డాను. నమస్కారం చేసుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాను…

~~~***~~~

‘ అహమస్మి, జ్యోతిరహమస్మి, బ్రహ్మా అహమస్మి ‘
(అఘమర్షణసూక్తం)

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: