మీరజాలగలడా?-వేదాంతం శ్రీపతి శర్మ


రైలు అలా పోతోంది. ఎదురుగా ఒక జంట కూర్చుంది. వయసు పై బడ్డ వారే ఇద్దరూ. కాకపోతే ఇద్దరూ మంచి గాయకులు అనుకుంటాను. ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. కాలక్షేపం బాగుంది కానీ ఇది అంత్యాక్షరి లాగా లేదు. వాళ్లు అలా ఎందుకు పాడుతున్నారో అర్థం కావటం లేదు.

ఆయన ‘ రావే నా చెలియా…’తో ప్రారంభించాడు. అటు కిటికీ దగ్గర అమ్మాయి ఇటు చూసి వింతగా మొహం పెట్టింది. పెద్దావిడ ‘ ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి…’అంటూ మొత్తం పాడేసింది. ఆయన కొద్దిగా అమ్మాయి వైపు జరిగాడు. ‘ కనుల ముందు నీవుంటే, కవిత పొంగి పారదా?’ అంటూ జాలు వారాడు. ఆవిడ వ్యవధి ఇవ్వదలచుకోలేదు. ‘ ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో….’అనగానే ఆయన ఆపేశాడు. ఆవిడ ఆయనకు దగ్గరగా జరిగి అమ్మాయిని చూస్తూ ‘ వెచ్చని నీ వడిలో ఏ శ్రావణ మేఘాలో! ‘ అంటూ ఆ అమ్మాయికి, ఆయనకూ అడ్డంగా తల ఊపుతూ మరీ పాడుతోంది.

బలే వింతగా తోచింది. వయసుకు, రొమాన్సుకు సంబంధం లేదు. ఆవిడ కూడా ఎందుకు అంతగా స్పందిస్తున్నదో తలచుకుంటే స్త్రీ పురుషుల బంధం ఎంత గొప్పదో అనిపించింది.

~~~***~~~
 
ఏంట్ బర్డ్స్ అని కొన్ని పక్షులు ఉంటాయి. వీటిలో ఆడ పక్షులు మగ పక్షులు ఒంటరిగా ఉన్న ఆడ పక్షులకోసం ఏదైనా పాడుతుంటే గొంతు కలిపి ఆ ఒంటరి ఆడ పక్షులు వినకుండా కొత పాటలు పాడేస్తాయిట!
వెంటనే ఈ ‘ మగ పక్షులు ‘ వేరే ట్యూన్ అందుకుంటాయట!దీనిని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లోని జోసఫ్ టోబియాస్ అనే ఆయన కనుగొన్నారు!

ఈ ఏంట్ బర్డ్ అనే పక్షులలో ఒక జంట ఒకలా పాడుతూ ఉంటే ఒక వేళ మరో జంట అదే పాట ఎత్తుకుంటే ఈ జంట వెంటనే మరో ట్యూన్ పాడటం కూడా వీరు గమనించారు.
 
 
సిగ్నల్ జామింగ్ ప్రక్రియకు ఇది దగ్గరగా ఉందని వారు చెబుతున్నారు. అలాగే మధ్యలో ఇంటర్ఫియరెన్స్ వలన కలిగిన సమస్యకు సమాధానంగా మగ పక్షులు మరో సిగ్నల్ పాటను తయారు చేసుకోవటం చిత్రంగా కనిపిస్తోంది. జంతువులలో కూడా ఒక చక్కని కమ్యూనికేషన్ పధ్ధతి ఇలానే తయారు కావటం, కొత్త సమస్యలకు సరిక్రొత్త సమాధానాలు వెతికి అవలంబించటం అన్ని ప్రాణులకు సమంగానే కనిపిస్తోంది…

~~~***~~~

కాలం ఎంత మారినా బేసిక్ ఇన్స్టింక్టులు అవే! ఆడ ఆడే! మగ మగే! ‘అప్పు చేసి పప్పు కూడు ‘ సినిమాలో పాట- సుందరాంగులను చూచిన వేళల…యువతి చెంత పర పురుషుడు నిలచిన భావావేశము కలుగు కదా?…పాట పాడుతున్నాడు పెద్దాయన! అదేమిటా అని అటు చూశాను. అమ్మాయి ప్రక్కన కాఫీ కానుతో ఒకడు నిలబడి ఉన్నాడు!

ఆవిడ వెంటనే అందుకుంది-ఒకే బాణము ఒకటే మాట ఒక్క భార్యకే రాముని ప్రేమ..మిన్నే విరిగి పడినా…ఇక ఆ రాగం ఆగలేదు!

ముసలాయన ఎందుకులే అని కష్ట పడి పై బర్త్ ఎక్కేశాడు!

~~~***~~~

మగ పక్షులు అంత కంటే ఏమీ చేయలేవు. ఆడు వారు, మగ వారూ, పాడువారు…అందరూ అంతటా ఉన్నారు. జీవులందరూ ఒక పడవలోనే ఉన్నాం. వసుధైవ కుటుంబకం!

~~~***~~~
 
కొద్ది సేపు సవుండ్ లేదు. పెద్దావిడ చక్కగా తన విజయానికి కళ్లు మూసుకుని చిరునవ్వుతో కులుకుతోంది. అమ్మాయి పత్రిక చాటున ముసి ముసి నవ్వులు నవ్వుతోంది.కొద్ది సేపు అయ్యాక పెద్దాయన మంచి నీళ్లి అడిగి తీసుకుని త్రాగి ‘ తలచినదే జరిగినదా…’ అని పాడుకుని నిద్ర పోయాడు. పెద్దావిడ గర్వం తో చీరె సద్దుకుంది. కళ్లు మూసుకునే చిన్నగా ‘ మీరజాలగలడా నా యానతి…’ అని రాగం తీసింది!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: