‘ఏ దరికో?’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


సుందరం ఎందుకో గత నెల రోజులుగా చాలా దిగులుగా, దిగాలుగా ఉంటున్నాడు. ఆయన ఇంటి ముందు జామ చెట్టు కింద కూర్చుని చాలా మందితో కబుర్లు చెప్పే వారు. ఈ మధ్య ఆయన దగ్గరికి వచ్చిన వారు కూడా ఎక్కువ సేపు కూర్చోవటం లేదు. వయసు మీద పడింది కదా ఆరోగ్యం ఎలా ఉందో అనుకున్నాను. బాగానే ఉన్నారండీ అని ఆయన అబ్బాయి చెప్పాడు. నిన్న సాయంత్రం బాల్కనీ లోంచి ఒక సారి ఎందుకో ఎదురుగా ఉన్న ఆయన జామ చెట్టు వైపు చూశాను. తెల్ల లుంగీ కట్టుకుని భుజాన ఒక తువాలు వేసుకుని కూర్చుని ఉన్నారు. నా కథ ఏదైనా పత్రికలో వస్తే ముందర ఆయనే నాకు చెబుతాడు. అలా జరగకపోతే నేనే ఆ పత్రికను బాల్కనీలోంచి అలా కొద్ది సేపు జెండా ఎగురవెసి నట్లు ఆడిస్తాను. ఆయన నన్ను చూసి అదే పత్రికను పక్క నుంచి తీసి నాకు చూపించి చిరునవ్వు నవ్వుతాడు. అలాంటిది ఈ సారి ఆ పని చేసినా నన్ను చూసి కేవలం చిరునవ్వు నవ్వి వదిలేశాడు. లాభం లేదని చొక్కా తొడుక్కుని గబ గబా కిందకి వెళ్లాను…

ఆయన కోదలు కాఫీ తీసుకుని వచ్చి మా ఇద్దరికీ ఇచ్చింది. ‘ ఏంటొ నండీ ఈ మధ్య పరధ్యానంగా ఉంటున్నారు. ఎవరైనా పిల్లలు నమస్కారం పెట్టినా ఎందుకో ఆశీర్వచనం కూడా చేయటం లేదు ‘ అని ఓ మాట చెప్పి ఆమె లోనకి వెళ్లింది.

‘ ఏంటండీ? ‘ అడిగాను. ఎందుకో నవ్వాడు. ఏమీ మాట్లాడలేదు.
‘ ఎవరైనా ఏమైనా అన్నారా? ‘
‘ లేదు…’, అన్నాడాయన, ‘ ఎన్ని రోజులు బ్రతికితే బాగుంటుంది? ‘
‘ కావలసినన్ని! ‘
‘ ఎవరికి? ‘
‘…’
నా నోరు మూత పడింది. ఏమైనా గొడవ జరిగిందా? ఏమో! నా కళ్ల లోకి చూసి చిరునవ్వు నవ్వాడు.
‘ మీరు ఎవరినైనా ఆశిర్వదించినప్పుడు ఏమని ఆశీర్వదిస్తారు?’, అడిగాడు.
‘ చిరంజీవ, సుఖీ భవ, తేజస్వీ భవ…’
నన్ను ఆపాడు. ‘ ఎంత చిరంజీవ, ఎంత సుఖీ భవ? …అ అంటే శరీరం లేవకపోయినా బ్రతికి ఎంత సుఖపడగలరు? ‘
నవ్వాను. ఈయనకు ఏదో భయం పటుకుంది. చాలా మందికి జరుగుతుంది.
‘ ఊరుకోండి సార్ ‘, అన్నాను.
ఆయన లేచారు. లోపలికి వెళ్లిపోయాడు. ఆ జామ చెట్టు చాలా పాతది. నాకు బాగా గుర్తు. సుందరానికి ఎందుకో ఆకు చాటు జామకాయ చాలా తొందరగా కనపడి పోయేది. నేను ఎంత వెతికినా కనిపించేది కాదు. పిట్ట గోడ మీద నిలబడి ఒక కర్రని పైన చీల్చి అడ్డం గా ఒక బద్దను ఏర్పరచి ఆకు కొమ్ముకి చేర్చి దానిని మెలేసి టక్కున తెంపే వాడు సుందరం. అదేంటో నాకు ఒక రకమైన కాయ ఇచ్చి ‘ ఇది చాలురా నీకు. నీకు ఇది పడదు ‘ అని చెప్పి అతను మరో కాయ తినే వాడు. ‘ నీకెలా తెలుసు? ‘, అడిగేవాడిని. ‘ కాయని చూడ గలిగిన వాడిని, నీ కాయం గురించి తెలీదురా? ‘, అనే వాడు. ఆలోచిస్తుండగా మరల ఏదో కాగితం పట్టుకుని వచ్చాడు.
‘ యుధ్ధం లోకి వెళ్లినంత మాత్రాన ప్రాణాలు పోతాయనుకోవటం పొరపాటు ‘, అన్నాడు.
‘ వెళ్లనంత మాత్రాన మిగిలిపోతాయనుకోవటమూ పొరపాటే!’, అన్నాను.
కాగితాన్ని ఒక సారి చూసి నాకిచ్చాడు.
నేను చదివే ముందు అడిగాడు, ‘ జీవితానికీ, యుధ్ధానికీ గల సంబంధం ఏమిటి? ‘
నేను ఒక్క సారి ఆయనను చూసి కాగితం లోకి వెళ్లాను.
‘ సుందరా, నాకు ఎంత కోరినా అది రావటం లేదు.పిల్లలు అన్ని పండుగలూ జరిపారు. వాళ్ల వయస్సూ అయిపోయింది. నన్ను చిన్నప్పుడు శతమానం భవతి అని ఎవరో వాక్ శుధ్ధి ఉన్న వారు చాలా సార్లు దీవించినట్లున్నారు. వంద దాటేశాను. శరీరం ఆరోగ్యం గానే ఉంది. ఏమి లాభం? నా వాళ్లందరూ నా ముందే దాటిపోయారు! నేను ఈ కాశీలోనే పోవాలని ఇక్కడ ఇలా మిగిలిపోయాను. ఈ ఉత్తరం ఈ ఆశ్రమం వారు నీకు నా కోసం వ్రాసి పెడుతున్నారు. కిటికీ అవతల గంగ అలా ప్రవహిస్తూ ఉన్నది. చాలా మంది కొట్టుకుని పోతున్నారు…నా పక్కన ఉన్న గదిలో ఒక ముసలమ్మను బ్రతికుండ గానే ఇక లాభం లేదని వాళ్ల వాళ్లు నదిలోకి వదిలేశారు. కాల ప్రవాహం అంటే ఇదేనేమో!’
చీకటి పడింది. ‘ ఎవరీయన? ‘, అడిగాను.
కాగితం వెనక్కి తీసుకున్నాడు. ‘ నా మిత్రుడు. పదేళ్ల క్రితం కాశీ వెళ్లినప్పుడు ఈయనను కలసినప్పుడు నాకివన్నీ తెలియవు. నా అడ్రస్సు వ్రాసుకున్నాడు.
‘ మరి ఇప్పుడు…’
‘ ఈ ఉత్తరం అందగానే పరుగున కాశీ వెళ్లాను. నాకు ఆయన ఎక్కడా దొరకలేదు. ఆ ఆశ్రమానికి వెళ్లి ఈ ఉత్తరాన్ని చూపించి అందరినీ అడిగాను. మాకేమి తెలియదన్నారు. దిగులుగా ఘాట్ దగ్గర కూర్చుని అక్కడ ఉన్న కుర్రాడితో జరిగినదంతా చెప్పాను.’
సుందరం మరల ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన భుజం మీద చేయి వేసి నేనూ కూర్చున్నాను.
ఆయన కళ్లు నలుపుకున్నాడు. ‘ ఊర్కోండి సార్, ఇంతకీ తరువాత? ‘
‘ ఏముందీ? ఆ కుర్రాడు చెప్పాడు. అటువంటి కార్యక్రమం చేసే ముందు ఏ అడ్రసు దొరికితే ఆ అడ్రసుకు ఆ భాష తెలిసిన వారి చేత ఇలా వ్రాయిస్తారట! ‘
ఎప్పుడు లేచి నిలబడ్డానో నాకే తెలియదు.
ఆయన చేయి నా వైపు చాచి ఏదో అడుగుతున్నట్లు చూస్తున్నాడు.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ఏ దరికో?’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: