‘మనలో మన మాట!’-వేదాంతం శ్రీపతి శర్మ


సుందరమ్మ గారు బాగా మాట్లాడతారు, బలేగా నడుస్తారు!. చాలా సార్లు ‘ ఏవండీ మీరు నడుస్తుంటే అసలు కాళ్లు కదులుతున్నట్లే ఉండవు. అలా ఎలా నడవగలరు? ‘, అని అడిగాను. నన్ను కోపంగా చూశారు. ‘ నేనెలా నడిస్తే నీకెందుకో? ‘ అన్నారు.
‘ కాదండీ, మీరు బొంగరం లా అలా తేలిపోతూ ఉంటే చిత్రం గా ఉంటుంది. నిజానికి మీరు అసలు నడవరు. స్పందిస్తారు! ‘
ఆవిడ ఆలోచించారు. ఈ మాట నచ్చినట్లుంది.
‘ సరే గానీ, రేపు మా ఇంటికి రా ‘, అన్నారు!
‘ ఎందుకండి? నేనేమైనా తప్పుగా…’
‘ అది కాదు. ఈ మధ్య పేపర్ల వాళ్లకి ఏవేవో వ్రాస్తున్నావుట కదా?’
‘ దానికి మీ ఇంటికి ఎందుకండీ? ‘
‘ పిచ్చివాడా! అక్కడే మగ వాళ్లు గోతులలో పడుతున్నారు. రేపు మహిళలం అందరం ఒక చర్చ చేసుకుంటున్నాము. నువ్వు ఆ చర్చ గురించి పేపర్ లో వ్రాయాలి! ‘
~~~***~~~
రాత్రి ఒక చిత్రమైన కలొచ్చింది. ఇది ఏమిటా అని అనుకున్నాను. అనాస పండు ఒకడు కోసి దాని నిండా ఇసక పోసి నాకు తినమని ఇస్తున్నాడట!
స్వప్నాలు చిత్రంగానూ, స్వప్న ఫలాలు విచిత్రం గాను ఉండటం ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది! సుందరమ్మ గారి తలుపు తెరచే ఉన్నది. లోపల ఈ సమావేశం తాలూకు ఏవో వంటకాలు తయారవుతున్నట్లున్నాయి. బెల్ చప్పుడు విని గబ గబా వచ్చారావిడ.
‘ అదుగో మళ్లీ, ఎందుకు నా నడక చూసి నవ్వుతావు?’
‘ నేను అందుకు నవ్వ లేదండీ! పలకరింపుగా నవ్వాను. ‘
‘ లోపలికి వచ్చి ఆ మూల కూర్చో. ఇదిగో, నువ్వు మధ్యలో అస్సలు మాట్లాడే పని లేదు…’ అంటూనే లోపలికి వెళ్లారు ఆవిడ. అంతలోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చాలా చీకటి పడ్డట్లయింది. కొద్దిగా కలవరం చెంది తలుపు వైపు చూశాను. అదీ సంగతి. ఆ తలుపు దగ్గర మహాలక్ష్మి గారు నిండుగా నిలబడి ఉన్నారు. ఆవిడకు కదలాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఐనప్పటికీ నన్ను ఎందుకో కోపంగా చూశారు. ఈ మగ పురుగు ఇక్కడెందుకుంది? ఫినైల్ వాడలేదా అన్నట్లు చూసి ‘ సుందూ… ఓ సుందూ, నేను వచ్చేశానే! ‘ అని అన్నారు (అరిచారు). లోపలినుంచి ఆవిడ గారు కూర్చోమని బదులు చెప్పారు. ఈవిడ వచ్చి నాకు ఒక కోణంలో ఉన్న కుర్చీలో చిత్రంగా కూర్చున్నారు. ఆ కుర్చీ ఎన్నో శబ్దాలను చేసి కొద్దిగా ఊగి చివరకు స్వస్థత చెందింది! తలుపు దగ్గర ఈ సారి గాజులు అమ్మే వాడు
ఎవరో చేతికి రంగు రంగుల గాజులు తగిలించుకుని నిలబడ్డాడనుకున్నాను. కాదు. అది కేవలం సరోజిని గారి చేయి మాత్రమే. ఆవిడ తలుపుని తోసి
గాజుల చప్పుడుతో తాళం కలిపి లోనకి అడుగు పెట్టారు. మహాలక్ష్మి గారు ఊరకే ఆమె వైపు కళ్లు తిప్పి కూర్చొమని సైగ చేశారు.
‘ సరూ, రజినీ రాలేదే? ‘

సరోజిని కళ్లు గడియారం లోని ముల్లు టైం ఆగిపోయినప్పుడు కీ ఇచ్చి సరైన టైం చూపించేందుకు తిప్పినట్లు తిప్పింది.

‘ లేదు. తంకీ పన్నుందట!’
ఈ ఉచ్చారణ ఏమిటి అనుకున్నాను. కాకపోతే తప్పేముంది? ఇది పళ్లు లేని వారి సమావేశం కాబోలు. అయ్యో, అందరివీ కట్టుడు పళ్లా?

ఇంతలో చాలా గంభీరంగా ఉన్న ఒక పొడుగాటి మహిళ ‘న్యాయం కావాలీ’ అన్నట్లు ద్వారం దగ్గర నిలబడింది.

‘ రా సువర్చలా ‘, మహాలక్ష్మి గారు గట్టిగా చెప్పారు. ఆవిడ కళ్లజోడు పైకి తోసి లోపలికి వచ్చి కూర్చుని బాగ్ లోంచి ఒక పుస్తకం తీశారు. ‘స్త్రీ-ఒక శక్తి ‘ అని దాని మీద ఉంది.
‘ ఇంకనూ రాస్తున్నవా సువా?’ సరోజిని స్టైల్ గా అడుగుతోంది.
ఆవిడ మరో పుస్తకం తీసింది. దాని మీద ‘ నేను ఎందుకు వ్రాయాలి? ‘ అని ఉంది.
సుందరమ్మ గారు హాల్లోకి వచ్చారు. ఆవిద కుర్చీలో స్థిర పడ్డారు.
‘ ఈ రోజు ఇలా మనమందరం చక్కగా మా ఇంటిలో కూర్చుని మాట్లాడాలనుకోవటం ఎంతో ఆనందదాయకం! ‘
మా ఇంటిలో అన్న మాట కొద్దిగా ఆ ముగ్గురినీ బాధ పెట్టినట్లుంది. ముగ్గురూ తీరిగ్గా దగ్గేశారు.
సుందరమ్మ గారు తమాయించుకున్నారు. ‘ ముందుగా నేను చెప్ప దలచుకున్న విషయం ఏమిటంటే…’
మహాలక్ష్మి గారు ఆవిడ చేయి మీద చేయి పెట్టి కొద్దిగా ఒరిగారి. ‘ మనలో మన మాట సుందూ, నిన్న ఏమి అయిందో తెలుసా? ‘
సరోజిని అందుకుంది, ‘ఏమయింది మహీ? ‘, మహాలక్ష్మి గారు కళ్లు చాలా గుండ్రం గా తిప్పారు. ‘ మనలో మన మాట, ఈ ఉద్యోగాలు చేసే ఆడవాళ్లతో చాలా ఇబ్బంది సుమా! మా పక్కింటావిడ వాళ్ల చిన్న పిల్లను మా ఇంటిలో మేము చూడకుండ కూర్చోపెట్టేసి వాళ్ల ఆయనతో టక్కున పారిపోతుంది. ఇక సాయంత్రం వరకూ ఆయా పని చేయలేక చస్తున్నాను.’
‘ ఆ పిల్ని పట్కోని వాళ్లు వెళ్లే ముందే దింపేయండీ
‘ ఆ పిల్ల పిల్ల రక్షసి సరూ, నేనే లేపలేనే!’
సువర్చల గారు కళ్లజోడు సద్దుకున్నారు. ‘ స్త్రీలు, ఉద్యోగాలు అనే విషయం మీద ఆ మధ్య నేనొక వ్యాసం వ్రాశాను. స్త్రీ, నీకు అసలు ఉద్యోగం ఎందుకు అని సూటిగా ప్రశ్నించాను.’
సుందరమ్మ గారు ధైర్యం తెచ్చుకున్నారు. ‘ ఈ పక్కింటి గొడవలు ఇలానే ఉంటాయి. ఇంతకీ ఈ సమావేశంలో నెను చెప్ప దలచుకున్న దేమిటంటే…’
సరోజిని ఇటు పక్క నుంచి ఆవిడ చేయి మీద చేయి పెట్టింది. ‘ మొన్న ఏమయిందో తెల్సా? మేమందరం డైనింగ్ టేబిల్ దగ్గరా కూర్చున్నాం…’
అలా చేయటం వింత ఏమోనన్నట్లు సువర్చల గారు ఇ సారి కళ్లజోడు తీసేసి చూసారు.
‘ కూర్చున్నామా? ఇంతకీ మా మామగారికి చెప్పటం మరచిపోయాం. అంతే!’
‘ ఏమయింది? ‘
‘ మామగారు నిరాహార దీక్ష చేపట్టారు.’
సువర్చల గారు కళ్లజోడు తిరిగి పెట్టేశారు.’ పెద్ద వాళ్లతో ఈ మధ్య ఇబ్బందిగానే ఉంటోంది…’, అన్నారావిడ, ‘…ఎందుకో ఉన్న పళంగా ఇంటిలోని వారిగానూ కనపడరు, బయటవారిగానూ కనపడరు. ఇంటా బయటా సమస్యలు అని వ్రాస్తే వీరి వలన అని అర్థం చేసుకోవాలి! ‘
అందరూ ఎందుకో చప్పట్లు కొట్టారు. సరోజిని గాజులు ఘల్లు మన్నాయి!
సుందరమ్మ గారు తమాయించుకున్నారు, ‘ పోన్లేండి. అసలు మనం ఈ రోజు చర్చించుకోవలసిన విషయం ఏమిటంటే…’
ఈ సారి సువర్చల గారే ఆవిడ చేతిని దర్జీ వాడు కొలుస్తున్నట్లు పట్టుకున్నారు.’ అసలు ఇది వింటే వింతగా ఉంటుంది….’, అన్నారు, ‘…మా ఆయన దైనింగ్ టేబిల్ ముందు కూర్చుని అడిగారు. ఒక గాడిద ముందు ఒక బాల్టీలో లికర్, ఒక బాల్టీలో మంచినీళ్లు పెడితే ఏమి తాగుతుందీ అన్నారు.నేను మంచినీళ్లు అన్నాను. ఎందుకు? అని వారే అడిగి అది గాడిద కాబట్టీ అన్నారు!’
ఒకరి మొహాలొకళ్లు చూసుకున్నారు. తలుపు దగ్గర ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు.వాడు పళ్లు ఇకిలిస్తున్నాడు. మహాలక్ష్మి గారు లేచారు. ‘ అయ్యో అప్పుడేనా?’ దాదాపు అరిచారు సుందరమ్మ గారు.
‘ నేను వెళ్లాలే సుందూ, వీడు చిచ్చర పిడుగు. ఇంటికెళ్లి ఏవేవో వాగుతాడు. ఎందుకు గొడవ? ‘

ఆవిడకి బొట్టు పెట్టేసి పంపించేశారు సుందరమ్మ గారు. ఇటు తిరిగే లోపలే సువర్చల గారి మొబయిల్ మోగింది. ‘ హలో, ఏమిటి? నా డాడీ మూడో రవుండా? డబ్బు కూడా పెట్టారా? వస్తున్నాను..’

ఆవిడా లేచి బొట్టు పెట్తించుకున్నారు.

మిగిలింది గాజుల సరోజిని, సుందరమ్మ గారే!
‘ చీర బాగుంది సరూ!’
‘ ఎక్జిబిషన్ ‘
‘ ఇంకా ఉందా? ‘
‘ ఉంది. వెళదామా? ‘
నేను నిలబడ్డాను. ‘ మీరు నడవలేరు సుందరమ్మ గారూ, చాలా నడవాలీ
ఆవిడ నన్ను కొద్దిగా కోపం గానే చూశారు. ‘ వెటకారమా? ‘
‘ అయ్యో లేదండీ.ఇంతకీ ఈ సమావేశం లొ మీరు ఏమి చెప్పదలచుకున్నారు? ‘
‘ ఏమి లేదు.’
‘ అదేంటి? ‘
‘ అవును. నన్నేదో ఇక్కడ కూడా వెక్కిరిద్దామనుకున్నవు కదూ? అదేమీ కుదరదు. నేను అలా మొదలు పెడితే తప్ప ఎవరి మనసులోని మాట వారు చెప్పరు. ఇది మనలో మన మాట. అదీ తెక్నిక్!’
ఆలోచన బాగుందీ అని అభినందించి తప్పక రిపోర్ట్ వ్రాస్తానని చెప్పి వచ్చేశాను.

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: