‘శ్రీ లక్ష్మ్యష్టోత్తర శత నామ పద్యమాల’-పుస్తక పరిచయం


శ్రీ లక్ష్మ్యష్టోత్తరములలోని 108 నామాలకు డా. వి.ఏ. కుమారస్వామి గారు 108 పద్యాలు భావార్థములతో పాటుగా ‘శ్రీ లక్ష్మ్యష్టోత్తర శతనామ పద్యమాల ‘ అను పేరుతో రచించి యున్నారు.

ఈ పుస్తకం ముందుగా అష్టోత్తర నామాలకు గల అర్థాలను, గూఢార్థాలను సరళంగా చెబుతున్నది. ఆ అర్థాలను కవిత్వంలోకి రంగరించుకుని చాలా సరళంగా అర్థమయ్యే రీతిలో పద్యాలలోకి మార్చినట్లు (అమర్చినట్లు)కనిపిస్తున్నది.

లక్ష్మీ దేవి యొక్క 108 నామముల గురించి తెలుసుకోవలనుకున్నా పద్యరీతిలో ఆస్వాదించాలనుకున్నా, ఒక సారి పుస్తకాన్ని చదివి తీరాలి.

నిజం చెప్పాలంటే ఈ ఆలోచనే చిత్రమైనది!
ఈశ్వరుని సృష్టి యావత్తూ ఒక కవనమే అనుకుంటే ఒకలా ఉంటుంది. భగవంతుని, ఆయన విన్యాసలనూ కలిపి కవిత్వంలోకి రంగరించ గల్గటం మన సంస్కృతికి, మన సాహిత్యానికే చెల్లింది.

ఈ పుస్తకానికి పీఠిక సాహిత్య అకాడమీ , తెలుగు అడ్వైసరీ బోర్డ్ కన్వీనర్ డా. పోరంకి దక్షిణామూర్తి గారు వ్రాశారు.

కవి భూమికలో చెబుతున్నారు-

విలసదమేయ వాగ్విభుడు భీష్మపితామహుచేత స్వస్తుతుల్
పలుగకజేసెనెవ్వడు, కృపా పర తంత్రత వాడు నేడు నా
సలలిత మాతృ భాష పయి సాదరుడై సరసార్థ వాగ్ఝరిన్
పలుగక జేసె మద్రచన ప్రాఙ్ఞ్యజనస్తవనీయ శైలిలో!

ఈ భూమికను ఆయన ముక్కోటి ఏకాదశి రోజున రచించారు. విష్ణు సహస్రనామ పారాయణ అను ఉపాసన కవితా పిపాసకు హేతువయి తల్లిని గూర్చి చెప్పు భాషను ‘ సలలితం ‘ గా లాలిత్యంతో మేళవించి ‘ మాతృభాష ‘ అనగా సామాన్యులకు తల్లి ఇందులోంచి పలికిన కవిత్వంగా చెప్పి మాన్యుల స్తవనీయ శైలి కూడా చూసిన వారికి కనిపిస్తుందని చిత్రంగా చెప్పారు!

మామూలు మనుషులకు ఆసక్తికరంగా కొన్ని కనిపిస్తాయి. మచ్చుకు ‘ యశస్విని ‘ అను నామాన్ని తీసుకుందాం :

చదువు రాని వాళ్లకు సమస్యను సరస్వ
తి సృజనము చేసి కీర్తివిసృజన చేసె
పర్వతమునెక్క వలయును పార్వతి గన
కనులవిందగు నిను యశస్విని నుతింతు!

చదువు రాని వారికి సరస్వతి గురించి తెలియటం కష్టం. పర్వతం ఎక్కనిదే పార్వతి కనిపించదు. కానీ ధనం రూపంగా అందరికీ కనిపించు లక్ష్మి అందరికంటే ఎక్కువ పాపులర్ అని చెప్పారు!

ఈ నామములలోని ఇతర ఉపాసనా పధ్ధతుల సమన్వయము కూడా కనిపిస్తుంది :

నవదుర్గలు నీ రూపము
నవార్ణ మంత్రము నా వంతు, లస
న్నవదుర్గా, నైకవిధం
బవనము చూపించు నీకు నాశ్రితుడ కదా!

నవదుర్గల రూపంలో ప్రజలను రక్షణ చేయుచున్నది లక్ష్మియేనని చెప్పటమైనది.

మొదటి పద్యం, చివరి పద్యం గురించి ఇక్కడ ఉదహరించవలసి ఉన్నది :

ప్రకృతి యన నీవ యగుదువు
సుకృతమ్ములు చేయువారి సుఖములకెల్లన్
ప్రకృతివి ప్రధానమీవే
వికటింపగ లక్ష్మి, నా కవిత్వము వినవే!

ప్రకృతి అనగా ప్రధానమని కూడా అర్థమున్నది. భారతీయ తత్వ శాస్త్రములో మూలప్రకృతిని లక్ష్మి అనే చెప్పారు. అట్టి లక్ష్మీ దేవిని తన కవిత్వమును వినవలసినదిగా ప్రార్థిస్తూ ఈ కవనమనేది ఆమె పాల్గొంటున్న ప్రకృతిగా నాందివచనం చెప్పటం, చెప్పగల్గటం విశేషం!

చివరగా :

భువనేశ్వరి కిదెవందన
మవనిన్ సాష్టాంగ సరణి నగుగావుత, నా
కవనము నాకవనంబై
నవరీతిని సుమనసులకు నందనమగుతన్!

ఇది కవన ప్రక్రియలో చరమస్థాయి! సృష్టియే కవిత్వమని చెప్పుకున్నాము! మరి ఆమె భువనేశ్వరి కదా? సుమనస్ అను శబ్దమునకు పువ్వులు, సత్పురుషులు, దేవతలు..అని చాలా అర్థములున్నవి. ఈ కవనము స్వర్గములో నందనవనమై సత్పురుషులకు నందనము-సంతోషము కలిగించుగాక అని అర్థాంతరము.

ఇక్కడ రెండు రకాల శ్లేష కనిపిస్తుంది-నా, కవనము-నాకవనము (స్వర్గవనము)-ఇది సభంగ శ్లేష. సుమనసులు నందనము అన్నప్పుడు అర్థశ్లేష అలంకారములు ఆహ్లాదకరంగా సాగాయి!

ఇదే రీతిలో వారు శ్రీ విష్ణు సహస్రనామముల నామార్థములను పద్యాల రూపంలో భావార్థములతో పాటు రచించి యున్నారు. ప్రచురణ చేయ దలచిన వారు ముందుకు రాగలరు!

ఈ పుస్తకం కేవలం 45 పుటలు. ధర వ్రాయబడినట్లు లేదు. పుస్తకం లభించు స్థలం:
శ్రీమతి ఇ. గీత
బి-1240, ఎన్.జి.ఓ కాలనీ
వనస్థలిపురం
హైదరాబాదు-500070

మొబైల్: 9989063749

-వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: