‘బకాసురుడొచ్చాడు!’


‘ అమ్మా! బకాసురుడెప్పుడొస్తాడు? ‘, చిన్న పిల్ల వాళ్ల అమ్మని అడిగింది. ఆవిడ కళ్లు పెద్దవి చేసింది. బకాసురుడేమిటి, మన ఇంటికి రావటమేమిటి, ఎప్పుడొస్తాడని ఈ పిల్ల అడగమేమిటి?
‘ ఎవరే బకాసురుడు? ‘ అడిగింది.
‘ నువ్వంటూ ఉంటావే వాడే! ‘
‘ నేనెప్పుడన్నానే? ‘
‘ నువ్వే…నువ్వే అన్నావు. నేను నువ్వు కంచంలో పెట్టింది తినకపోతే ఇదిగో చూడూ, బకాసురుడు వచ్చేస్తున్నాడు అని చెప్పావు. నేను వెంటనే భయపడి తినేసాను! ‘
‘ అయితే? ఇప్పుడు వస్తున్నట్లు నీకెవరు చెప్పారు? ‘
‘ నువ్వే కదా ఫోనులో డాడీ ఈ రోజు వస్తున్నారని ఎవరితోనో అంటున్నావు? ‘
ఆవిడకి మతి పోయింది. ‘ నీ దుంప తెగ! డాడీ బకాసురుడని నేనన్నానా? ‘
పిల్ల లేచి నిలబడింది. ‘ అమ్మా, మొన్న డాడీ ఎందుకో గట్టిగా అరుస్తుంటే నువ్వే కదా బకాసురుడిలా అరవద్దన్నావు? ‘

బాగుంది. ఆ ఇల్లాలికి పాపం బకాసురుడు ఊతపదమైతే ఆ పిల్ల నోటికి పూత పూసుకున్నట్లు పూసుకుంది!

అదలా ఉంచండి.

అప్పుడప్పుడు మా ఆఫీసులో ఒకాయన రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడుగుతాడు. కూర్చో పెట్టుకున్నాక కొద్ది సేపే మాట్లాడకుండా గడుపుతాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగగానే ‘ చూశారా? ‘
అంటాడు. ‘ ఏమిటండీ? ‘ అనగానే ‘ ఆ పోలీసు ఏమి చేయగలడు చెప్పండి. రోజంతా వాళ్లావిడ ఇంటిలో పోరుతూ ఉంటే ఏమి పని చేస్తాడు? ఇక్కడ అలా పాపం ఏదో నిలబడ్డాడు. ఎవరి దారిన వారు పోతున్నారు. అంతే! ‘
ఏదో బాధలో ఉన్నాడనుకున్నాను. కానీ మొన్న కొద్ది మంది తాజ్ మహల్ హోటల్ లో జరిగిన విషాదం గురించి తీవ్రంగా చరించుకుంటున్నారు. తీవ్రవాదులు కూడా అలా మాట్లడరేమో అనుకున్నాను. ఒకరి గొంతు అసలు ఎక్కడికో వెళ్లి పోయింది. ఈయనొక్కడినీ పాకిస్తాన్ మీదకు వదిలేస్తే అందరినీ కాల్చి వస్తాడనుకున్నాను! ఇద్దరి మొహాలు చలికాలంలోనే ఎర్రబడి పోయాయి. ఇంతలో ఈ మిత్రుడు వచ్చాడు. అందరినీ ఆపేశాడు. హమ్మయ్య, కొద్ది సేపు అందరూ శాంతించారు. ఈయన ఏమి చెబుతాడో అని చూసాను. రెండు చేతులూ పైకి పెట్టాడు. ‘ ఇదంతా కాదు. తెల్లరి లేచినప్పటి నుంచీ ఇంటిలో ఒకటే పోరుతుంటే ఆ కోస్ట్ గార్డ్ వాళ్లు మటుకు ఏమి చేస్తారండీ? ఉద్యోగం చేయటానికి వెళ్లినప్పటి నుంచీ నువ్వు వచ్చేయి, వచ్చేయి, అక్కడొద్దు, నేనిక్కడ ఉండలేక పోతున్నాను. ఇంతే! దట్సాల్!. ‘

వోర్ర్నాయనో! అనుకున్నాను. ఆఫీసు నుంచి వస్తున్నాను. చక్కగా ఆపి నా వెనుక కూర్చుని నా చిన్ని భుజాన్ని ప్రేమతో తాకాడు. రెండు సార్లు కొట్టాడు. అతనికి అలవాటు. ఏమి చేయటానికి లేదు. దట్సాల్. కొద్ది సేపు బండీ ముందుకు వెళ్లింది. ఒకాయన కూరలు రెండు సంచుల నిండా మొసుకు పోతున్నాడు. ‘ ఏమి చేస్తాడండీ? ‘, అన్నాడు, ‘ ఇంటికెళ్లగానే కూరలో కూరలో అంటే అతను మటుకు ఏమి చేస్తాడండీ? చూడండీ, ఎలా కొంగలా ఒంగిపోయి ఉన్నాడో? రూట్! అసలు అన్ని సమస్యలకూ రూట్ అక్కడ ఉంది. ‘

ఈయన డాక్టర్ దగ్గరకి కళ్లు సరిగ్గా కనిపించటంలెదంటే ఆ డాక్టర్ కూడా ఇటువంటి వాడే అయి ఉంటాడు. అన్ని సమస్యలకూ స్త్రీలే మూలంగా కనిపించేటట్లు అద్దాలు తయారు చేసి మరీ ఇచ్చినట్లున్నాడు.

ఈయనకు ఆవిడ లేకపోతే క్షణం గడవదు. ఎక్కడికైనా వెళితే మూడు నిమిషాలకు మూడు ఫోన్ లు చేస్తాడు. అతనిని ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు చూసి చిరునవ్వు నవ్వితే ఫోన్ పెట్టాక ‘ ఆడవాళ్లతో చాలా ఇబ్బందిగా ఉంది…’, అంటాడు, ‘ పెళ్లి అయ్యే వరకు మా నాన్న అమ్మ లాంటి ఆడదాన్ని ఎందుకు చేసుకోవద్దనే వాడో తెలిసేది కాదు. అసలు పెళ్లి అనేది ఒక కేక్తస్ లాంటిది…’

అందరం అటు తిరిగాం. ఏదో జీవిత సత్యం చెబుతున్నాడనుకున్నాం. ‘ పెళ్లి ఒక కేక్టస్. ఒంటె ఉంది చూశారూ, దానికి ఈ కేక్టస్ చాలా ఇష్టం. అది నోటిని పూర్తిగా చీల్చి రక్తం కారుస్తూనే ఉంటుంది. అయినా దానికి అదే ఇష్టం. అదే తింటూ ఉంటుంది. ఈ పెళ్లి అనేది ఈ ప్రక్రియ లాంటిది. అందరినీ కరుస్తుంది. అయినా అందరూ అదే కావాలంటారు! ‘

అతనికి అందరూ ఒక నమస్కారం పెట్టేసి తప్పుకున్నాం. ఈ మధ్య ఎందుకో కనిపించటం లేదు.

ఎందుకో మొన్న మరో ఆఫీసులో కనిపించాడు. అక్కడకు బదిలీ అయినట్లుంది. అతను చేతులు కట్టుకుని ఎవరినో చూస్తున్నాడు. అటు వైపు చూశాను. నలుగురు వ్యక్తులు చిరంజీవి, ఆయన పార్టీ గురించి గురించి బ్రేక్ ఇవ్వకుండా మాట్లాడుకుంటున్నారు. శబ్దం స్థాయిని మీరుతున్నది. ఇతను దగ్గరగా వచ్చాడు. అందరికీ తన రెండు చేతులూ చూపించాడు. ఒకరిద్దరు ఎవర్రా ఇతను అన్నట్లు కళ్ల జోడు సద్దుకుని చూశారు. కాకపోతే అందరూ ఆగిపోయారు. ఒకరు ఆవేశంలో ఇంకా ఏదో అనబోతున్నాడు. అతనికి మరో సారి చేయి చూపించాడు. వద్దు, మాట్లాడకు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. అతనూ ఆగిపోయాడు. ఈయన గొంతు ఏ మాత్రం పెంచలేదు. ‘ ఏమీ లేదండీ..’, అన్నాడు, ‘…రోజంతా ఇంట్లో నువ్వింక ఏమి చేస్తావు, ఏమి చేస్తావు, నువ్వు లాభం లేదు, లాభం లేదు అని వాళ్లావిడ ఒకటే పోరతా ఉంటే అతను మటుకు ఏమి చేస్తాడు? పార్టీ పెట్టేశాడు. నో…దట్సాల్! ‘ ఈ చివరి మాట మటుకు గట్టిగా మాడ్యులేషంతో చెప్పేశాడు!

బకాసురులు ఎక్కడో లేరు. ముద్రలు వేసుకుని అన్నింటిలో ఒక మాటే చెప్పే వారు మన మధ్యలో రోజుకి ఒకరిని తింటూ మనలోనే ఉన్నారు!

–వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: