‘ సం.సా.రా.లు ‘-సుధామ గారి పుస్తక పరిచయం-వేదాంతం శ్రీపతి శర్మ


అల్లంరాజు వెంకటరావు గారు (సుధామ) ఆంధ్ర భూమి దినపత్రికకు వారం వారం వరుసగా ఎడిట్ పేజీ మధ్య శీర్షికకు వ్రాసిన వ్యాసాలలోని యాభై వ్యాసాలను ‘సం.సా.రా.లు ‘ అని ఒక సంకలనం చేశారు. ఈ పదం మధ్య మధ్య ఈ చుక్కలెందుకంటే ఇది ‘ సంస్కృతి, సాహిత్యం, రాజకీయాలు ‘ కు చిన్న సైజు. ఈ పుస్తకం నవంబర్ 2001లో ప్రచురితమైనది. కాకపోతే సుధామ గారు మరల ఈ వ్యాసాలు కొనసాగిస్తున్నారని తెలిసింది.

ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ మూడింటినీ ఎంచుకుని ఒక శీర్షికను విజయవంతంగా నిర్వహించటం తేలికైన పని కాదు. రచయితకు చరిత్ర తెలియాలి, జరుగుతున్న జీవనధారలోని లోతుపాతులు తెలియాలి, సమకాలీనమైన రాజనీతి, విధానాలు, స్పందనలు అవగాహనలో ఉండాలి. అలా అని ఒక ఉద్బోధ చెస్తున్నట్టుగానో లేదా ఒక తరగతిలో క్లాసు తీసుకుంటున్నట్లుగానో ఉన్నా ఇబ్బందే! కాకపోతే విషయాన్ని కాలానికి అన్వయించి ఒక విలక్షణమైన శైలిలో చెప్పటం చేతనైతే రచయిత పాఠకులను ఆకట్టుకుంటాడు. సుధామ గారు ఇక్కడే రాణిస్తారు!

ఒక సమానాంతర ఆలోచనా ప్రవాహం ఎంచుకున్న అంశాల క్రింద అలా సాగిపోతూ ఉంటుంది. ఈ రెండిటికీ మధ్య కొన్ని పదప్రయోగాలు కవ్విస్తూ ఉంటాయి. ఉదాహరణకి ‘ ఉల్కాపాతం ‘, ‘ అలకాపాతం ‘, ‘ ఎథిక్ స్పీచ్ ‘ కి ‘ ఎ థిక్ స్పీచ్ ‘, ‘ జ్వరరాగసొద ‘-ఇలాంటివి చిత్రంగా ఉంటాయి.

స్పూనరిస్మ్ అనే పేరుతో ఉన్న చివరి వ్యాసం అప్పటి అమెరికా, పాకిస్తాన్ వ్యవహారాలను తమాషాగా చెబుతుంది.

ఈ వ్యాసాలు ఆ శీర్షికలోని చోటుకు పరిమితమయి ఉంటాయి. అందుచేత గబ గబా మొదలయి అలానే తెర దించేస్తాయి. చదువుతున్నప్పుడు రచయిత విషయాన్ని ముగించేసి ఎప్పుడు తన మాట చెప్పాలా అని ఆదుర్దా పడుతున్నాడా అనిపిస్తుంది. దీనికి కారణం ఇదే అయి ఉంటుందని నాకు తోచింది.

ఈ యాభై వ్యాసాలలో ఎంచుకున్న అంశాలు చక్కనైనవి, ఆలోచించగలిగితే చిక్కనైనవి కూడా. కవ్వించిన చోట కవ్వంతో చిలకాలని కూడా అనిపిస్తాయి.

కాకపోతే మొదలు పెడుతున్నప్పుడు ఎంచుకున్న సంఘటనలు మరి కాస్త నాటకీయంగా ప్రారంభిస్తే బాగుండేదేమో అనిపించింది. అలాగే ఒక పరిస్థితిలోకి పాఠకుడు అడుగు పెట్టే లోపే సంవాదాలు ప్రారంభమైపోవటం కనిపిస్తుంది. ఇది కూడా వ్యాసం పొడవు ముందరే నిర్ధారింపబడటం వలన అయి ఉంటుంది.

అక్కడక్కడ జరిగిన కాలంలోని సంస్కృతిని జరుగుతున్న కాలంతో మొగ్గ చివర గుచ్చి దారం పోనిచ్చి కలిపినట్లు కనిపిస్తుంది. 1980వ దశాబ్దం లో అమెరికాలోనూ, ఐరోపా దేశాలలోనూ ఒక ఒరవడిలో వచ్చిన జర్నలిస్టిక్ రచనల లాగా గతంలో జరిగిన దానిని ఒక పర్స్పెక్టివ్ లోకి దింపి దానికి ఒక పారలల్ గీసి ప్రతిబింబింపచేయటం సుధామ గారి శైలి కాదు. అందు చేత ఇప్పటి మాట చెబుతాను అన్నట్లు వ్యాసం ముగుస్తుంది.

సుధామ గారు సంఘటనలను ఒక మాలికలా అల్లగలిగే ఒక ప్రయోగం ఏదైనా చేపట్టి కొద్దిగా నాటకీయతను పెంచి మరల ఇటువంటి సంకలనం ఈ దశాబ్దం కోసం తీసుకుని వస్తే బాగుంటుంది!

‘సం.సా.రా.లు ‘ పుస్తకానికి బొమ్మ చంద్ర గారు గీశారు. ఈది సరదాగా చదివి ఆలోచించి, ఆనందించ వలసిన పుస్తకం.

ఈ పుస్తకం విశాలాంధ్ర బుక్ హవుస్, అబిడ్స్, హైదరాబాదులో దొరకునని వ్రాసి ఉన్నది. అలాగే 147 పుటలు గల ఈ పుస్తకం ధర యాభై రూపాయలు.

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: