‘ కంటిలో నలుసు ‘-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


ఈ రైలు చిత్రంగా ప్రయాణం చేస్తోంది. ఇంటిలో కొత్త ఆగంలా, బాలమురళీ గారి సరిక్రొత్త రాగంలా, సాగమన్నప్పుడు చక్కగా ఆగిపోయే కుళాయిలా, ఆగమన్నా ఆగని సీరియల్ లా…అలా అలా పోతోంది మరి.
ఏ.సీ బోగీలో ఇది ఇంకా చిత్రంగా ఉంటుంది. ఇష్టం లేని ఇద్దరికి పెళ్లి చేసినట్లు అటూ ఇటూ ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే హోదాలకు తీరని భంగమన్నట్లు అలా కూర్చున్నం. నా ఎదురుకుండా ఉన్న వ్యక్తి పైగా పూర్తిగా కిటికీ వైపుకు తిరిగిపోయి కొత్తగా జైలులోంచి విడుదల అయిన వానిలాగా ప్రకృతినే ఆస్వాదిస్తున్నాడు. నేను కూడా ప్రకృతి నుంచే వచ్చానని చెబుదామనుకున్నాను. అప్పుదప్పుడు ఎందుకో ఆ అద్దాన్ని కొలుస్తున్నట్లు చుట్టూతా చూపుడు వేలుతో రాస్తున్నాడు! ఇది అర్థం కావటంలేదు. నాకెందుకు అంటే అలా ఎలా కుదుర్తుంది? నేను భారతీయుడిని! ప్రక్క ఇంటి వాడితో నేను మాట్లాడకూడదు కానీ వాళ్ల సమస్య మటుకు నాకు వాళ్ల కంటే ఎక్కువ తెలియాలి!
అతను ఉన్నట్టుండి ఎందుకో గబ గబా లేచాడు. రైలు ఎందుకో ఆగబోతోంది. ఏదో కొనాలేమో. దిగిపోయాడు. కిటికీ దగ్గరకు వచ్చి ప్లాట్ఫార్మ్ మీద నిలబడ్డాడు. అటు వైపు నుంచి కిటికీ అద్దాన్ని వేలితో కొలుస్తున్నాడు. అది పగలగొట్టే ఆలోచనో లేక మరి ఏమిటో అర్థం కాలేదు. రైలు బయలు దేరే లోపు మరల ఎక్కేశాడు.

కొద్ది సేపు లాప్టోప్ తీసి ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. స్టాక్ మార్కెట్ దెబ్బ గట్టిగా తగిలిందా? అనుకున్నాను. నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు. ఇదే సమస్య, ఇప్పటి వరకూ బాగానే ఉన్నాను. ఇంతలో నాకు భయం మొదలైంది!

‘ కిటికీ అద్దం బాగాలేదా సార్? ‘ అడిగాను. అతను నన్ను, కిటికీనీ చూశాడు.
‘ బాగానే ఉంది కదా? ‘ అన్నాడు.

మరల లాప్టాప్ లోకి దూరి పోయాడు. కాకపోతే ఈ బోగీలోనివన్నీ కొలతలు తీసుకుని జాగ్రత్తగా ఎలా బాంబు పెట్టాలని చూస్తున్నాడేమో అని కూడా అనిపించింది! లేకపోతే బయటకు వెళ్లి మరీ ఎందుకు కొలుస్తున్నాడు. మరల లేచాడు. ఎవరికైనా చెబుదామనుకున్నాను. రైలు ఆగుతోంది. అతను దిగాడు. కిటికీ దగ్గర ఈ సారి ఊరకే నిలబడ్డాడు. కిటికీని కేవలం తాకి చిన్నగా ఒక గుద్దు గుద్ది మరల లోపలికి వచ్చేశాడు.

నేను బిగుసుకున్నాను. నా ఎదురుగా జాగ్రత్తగా కూర్చున్నాడు. బండీ కదిలింది. నా కిటికీని ఎప్పుడో మరచిపోయాను. అతని కిటికీ వైపు చూశాను. అతను నన్ను చూసి నవ్వాడు.

‘ భయపడకండి…’, అన్నాడు, ‘…నేను ఈ కిటికీని పగుల కొట్టటంలేదు. ‘
‘…’
‘ ఈ కిటికీలోంచి మనం చూడగలం కానీ బయటనుంచి చూడలేము. కదా? ‘
‘ మీరు ఈ బోగీలో మొదటిసారా? ‘, అడిగాను.
బిగ్గరగా నవ్వాడు. ‘ నాకు తెకుసు. మీరు అడుగుతారని. చాలా సార్లు ప్రయాణం చేసాను. కానీ ఈ కిటికీ నన్ను వదలదు ‘
‘ ఎందుకు సార్? ‘
‘ కంటిలో నలుసు చాలా మోసం చేస్తుంది ‘
‘ కరెక్ట్ ‘
‘ కొద్ది రోజుల క్రితం మా ఆవిడని ఒక స్తేషన్లో దింపాను ‘
‘ తప్పిపోయిందా సార్? ‘
‘ లేదు. వాళ్ల అన్నయ్య స్టేషంకు వస్తాడని అనుకున్నాను. రాలేదు. ఎవరో వచ్చాడు. ఇద్దరూ నా వైపు చూడను కూడా చూడా లేదు. ఇంటికి వెళ్లాక తెగ ఆవేదన పడిపోయాను.కనీసం నన్ను విష్ కూడా చేయలెదు, ఎవరయి ఉంటారని మథన పడిపోయి ఆ బాధలో ఒక లెటర్ వ్రాశాను. ఎవరు? అని అందులో అడిగాను ‘
‘ ఆమె చెప్పలేదా? ‘
‘ చెప్పింది. వాళ్ల అన్నయ్య రాలేకపోయినందుకు ఒక మిత్రుడు వచ్చి ఇంటికి తీసుకుని వెళ్లాడు.’
‘ ఇంక సమస్య ఏముంది? ‘
‘ అదే కంటిలో నలుసు మాష్టారూ! ఆవేశంలో నాకు వాళ్లు కనీసం చేయి అయినా చూపించలేదే ఇది ఏ వ్యవహారం అయి ఉంటుందోనని ఊగిపోయి బంధాన్ని చెడకొట్టుకున్నాను. ఈ కిటికీలోంచి అక్కడ వాళ్లు చూడలేరనీ తెలుసు. మనసు ఆ సంగతిని దూకెసి ఆలొచించింది ‘
‘ ఆ సంగతి ఆమెకు చెప్పండి ‘
‘ చెపాను. కానీ దెబ్బ పడిపోయింది. నలుసు రప్చర్ చేసేసింది. ఇంత అనుమానం అయితే నీతో వేగలేను అని చిన్నగా సెలవిచ్చింది ‘
‘ ఊర్కోండి సార్. కొద్ది రోజుల తరువాత సద్దుకుంటుంది. పెద్ద సమస్య కాదు లెండి ‘
‘ కంటిలో నలుసును ఊదేసి తీయొచ్చు…’, అతను నిలబడ్డాడు. బండీ మరల ఆగుతోంది. ‘ మనసులోని నలుసును తేలికగా తీయలేము సార్. ఈ కిటికీని చూస్తూ అలా నిద్ర పోలేను. ఉందండి, ఇప్పుడే వస్తాను…’
మరల దిగిపోయి కిటికీ దగ్గర నిలబడ్డాడు.

జాలి వేసింది. కిటికీలో కరెక్ట్గా అతని మొహమొక్కటి పాస్పోర్ట్ ఫొటోలాగా ఒక బార్దర్లో కనిపిస్తోంది. చూపుదు వేలుతో చుట్టూతా రాస్తున్నాడు.

ఏమిటొ జీవితాలు. క్షణంలో ఒకరికి బార్డర్ గీసేస్తాము. క్షణంలో గూఢార్థాలు తీసి విశ్లేషణలు చెసేస్తాము. క్షణంలో ఒకరిని ‘కొలుస్తాము ‘. మరు క్షణం కొలతలకు పూనుకుంటాము…

( ఇది జరిగిన కథ )

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: