సన్యాసి-వివాహ వేదిక!-వేదాంతం శ్రీపతిశర్మ


నాలోని సన్యాసి రావు నన్ను తేలికగా వదలడు.
ఆఖరికి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు కూడా అటూ ఇటూ చూసే లోపల చక్కగా ప్రక్కనే కూర్చున్నాడు. ‘ నువ్విక్కడెందుకు? ‘ అడిగాను.
‘ అదేవన్న మాట? నేను లేనిదే నువ్వు లేవు. నేను చూడకుండా నువ్వు పెళ్లి ఎలా చూస్తావు? ‘
‘ కాదు సన్యాసీ! పెళ్లి నీ లాంటివాడికి…’
‘ పిచ్చివాడా! కాశీ యాత్ర గురించి తెలీదా? జాగ్రత్త. అన్ని సంప్రదాయాలూ సన్యాసులతోనే! ఆలోచించు! ‘
‘ నన్ను సుఖంగా చూడనియ్యి సన్యాసీ. ఇక్కడ నువ్వు బాగా లేవు! ‘
జనం నేను ఎవరితో మాట్లాడుతున్నానా అని వింతగా చూస్తున్నారు.
సన్యాసి రావు నవ్వాడు. ‘ ఒరే అబ్బీ, సన్యాసులు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. వాళ్లు వి. ఐ.పీలు. అర్థమైనదా? ‘
‘ పోనిలే రా వదిలెయ్! ఆ అమ్మాయి నన్ను బలేగా చూసింది. ఇటువంటప్పుడైనా గమ్మునుండు! ‘
‘ ఓస్, అమ్మాయి నిన్ను చూసిందా? సరే కానీ! నీ సంతోషం ఎందుకు వద్దనాలి? ‘
ఎవరో కాఫీ గ్లాసు అందించారు. అది పట్టుకుని అడిగాను.

‘ సన్యాసీ..’
‘యస్? ‘
‘ తెలుగు సినిమా జనాలని కమ్మేసి యున్నట్లుంది. ఎవరూ మామూలుగా నడవరు, నిలబడరు, మాట్లాడరు! ‘
‘ కరెక్ట్! ‘
‘ అవును సన్యాసీ, అలా అమ్మయికీ అబ్బాయికీ మధ్య తెర ఎందుకు పట్టుకుంటారు? ‘
‘ గుడ్ క్వెష్చన్! అది ఒక వెండి తెర! సిల్వర్ స్క్రీన్! వాళ్లిద్దరినీ ఒక్క సారి వాళ్లు చూసిన సినీ రీళ్లన్నీ తిరగేసుకోమని! ‘
‘ ఛా! ‘
‘ అవును మరి! పెళ్లి అయ్యే ముందు ప్రతి కుర్రాడూ ఏ త్రిషతోనో, జెనిలియాతోనో ఊహించుకుంటాడు. అమ్మాయి ఏ సిధ్ధార్థనో, ఉదయకిరణ్ నో ఊహించుకుంటుంది! ‘
‘ కరెక్ట్! మరి పెళ్లి? ‘
‘ ఎవరితోనో జరిగిపోతుంది. అందుచేతా అలా తెర పట్టుకుని కొద్దిసేపు పాతవి గుర్తుకు తెస్తారు. ‘
‘ తరువాత? ‘
‘ చేతులు నెత్తి మీద పెట్టి ఆ ఊహలన్నీ ఆపెయ్యమని ఏవో మంత్రాలు చెప్పేస్తారు ‘
‘ కరెక్ట్! ‘
‘ తెర తీసేస్తారు. ఇంకేముంది? నిజం అలా నిప్పులా కనిపిస్తుంది. అది చెప్పేందుకే అగ్నిహోత్రం వెలిగించి చుట్టూతా తిప్పుతారు. దీని చుట్టూతానే- అంటే నిజాన్ని వదలం అని ప్రమాణాలు చేయిస్తారు! ‘
‘ సన్యాసీ, నీ సినిమాకి శుభం చెబుదాం. ‘
‘ శుభం! అక్షతలు తీసుకో వెర్రి వెధవా! తీసుకుని అక్కడకెళ్లి చల్లు. ‘
లేచి వెళ్లి అదే పని చేశాను. అంతా ఎందుకో పొట్టి సఫారీలూ, పట్టు చీరెలూ …ఒకటే నవ్వుతున్నారు.
‘ ఎందుకు సన్యాసీ? ‘
‘ నవ్వాలిరా. ఏడవకూడదు కదా!. పైగా ఎందుకు నవ్వుతున్నారో తెలుసా? ‘
‘ ఎందుకు సన్యాసీ? ‘
‘ ఏమీ లేదురా అబ్బీ! వీళ్లంతా పెళ్లి అయిపోయిన వారు. వాళ్లతో పాటు ఆ శిక్ష మరొకరికి కూడా పడుతోందని సంతోషం. ఇదే భారతీయత! మనం అన్నీ పంచుకుంటాం రా అబ్బీ! ‘

ఇంకా ఏమి చెబుతాడోనని భయం వేసి గబ గబా ప్లేటు అందుకుని భోజనం చేసి ఇవతలకి వచ్చాను.

వరండాలో ఎవరో అడుగుతున్నారు, ‘ అబ్బాయి ఏమి చేస్తాడు? ‘
ఇంకొకరు చెబుతున్నాడు , ‘ పెళ్లిళ్లకి సినిమాలు తీస్తాడట. వీడియోగ్రాఫర్! ‘

నా నెత్తి మీద ఒక గొడుగు ఎవరో పెట్టారు. ‘ పెళ్లయిందా? ‘
‘ అయిపోయిందండీ! ‘
‘ ఒక్కడివే ఎందుకు వచ్చావు? మీ ఆవిడని ఇక్కడినుంచి సినిమాకి తీసుకుని వెళ్లాల్సి వస్తుందనా? ‘
‘ లేదండీ. ‘
‘ అసలు నీ మామ నీకు పిల్లనెందుకిచ్చాడో తెలుసా? ‘
‘ ఈ రోజుకీ తెలియదు! మీ మీద ఒట్టు! ‘
‘ అదీ. చూడు నాయనా, వారానికి కనీసం ఒక సినిమా అయినా చూపించగలిగే స్తోమత నీకు ఉన్నదని నమ్మి చేశాడు. నువ్వు వేస్ట్! ‘
‘ సార్…’
‘ వదిలెయ్. ఇదిగో, హైదరాబాదుకీ, విజయవాడకీ మధ్య స్థలాలు. నీకు తూర్పు ఫేసింగ్ ది ఉంచాను. మనం మాట్లాడుకుందాం రా! ‘
ఇంతలో ఎవరో వచ్చి ఆయనను ప్రక్కకు తీసుకుని వెళ్లారు.  ‘ ఏమీ అనుకోకండి సార్! వీళ్ల అమ్మాయి సినిమా పధ్ధతిలో లేచిపోయేసరికి ఇలా మతి చలించింది. సారీ! ‘

సన్యాసి నిజమే చెప్పాడు!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: